జవహర్‌నగర్ : పరారీలో ఉన్న తన కొడుకు ఆచూకీ కోసం తనను స్టేషన్‌కు పిలిపించి ఎస్ ఐ సైదులు బండబూతులు తిట్టాడని, నీళ్ల బాటిల్‌తో కొట్టాడని, దాంతో తీవ్ర గాయమైందని జవహర్‌నగర్‌లోని గిరిప్రసాద్ కాలనీకి చెందిన పిల్లి లక్ష్మి(60) అనే వృద్ధురాలు గురువారం నాడు మల్కాజిగిరి డిసిపి ఉమామహేశ్వర్‌రావును కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆమె కొడుకు నాని ఒక మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. గతంలో వీరి మధ్య గొడవలు రాగా పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదుర్చుకొని బాలాజీనగర్‌లో వేరుగా కాపురం పెట్టారు. వీరిద్దరి మధ్య ఇటీవల మళ్లీ గొడవలు తలెత్తాయి. దాంతో ఆ మహిళ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌లు కొడతారమోనని భయపడి నాని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ విషయమై ఎస్ఐ సైదులు గత మూడు రోజుల క్రితం నాని తల్లి లక్ష్మీని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్పమంటూ బండబూతులు తిట్టినట్లు బాధితురాలు ఆరోపించింది. అంతేగాక తాగే నీళ్ల బాటిల్‌తో కొట్టడంతో చెయ్యికి గాయమయ్యిందని బాధితురాలు తెలిపింది. కొడుకు ఎక్కడికి పోయాడో తనకు తెలియదని చెప్పినప్పటికీ తనను జైలుకు పంపుతానని ఎస్ఐ సైదులు బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ గురువారం మల్కాజిగిరి డిసిపి ఉమామహేశ్వర్‌రావును కలిసి వినతి పత్రం అందించినట్లు తెలిపింది. ఈ విషయమై ఇన్స్పెక్టర్ వివి చలపతిని వివరణ అడగగా బాధితురాలిని ఎస్ఐ కొట్టాడ లేదా అనేది విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. సిసి కెమెరాల రికార్డులను పరిశీలిస్తామని తెలిపారు.