Home జాతీయ వార్తలు రూ.70 లక్షల వాచీని సిఎం ధరించడం పారదర్శకమేనా?

రూ.70 లక్షల వాచీని సిఎం ధరించడం పారదర్శకమేనా?

Siddaramaiah-Watchబెంగళూరు : ఖరీదైన చేతి గడియారం వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో సిఎం సిద్దరామయ్య న్యాయ నిపుణులు, ఆప్తులతో సుదీర్ఘ చర్చలు జరపాలని నిర్ణయించారు. జెడిఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారం క్రితం రూ. 70 లక్షల విలువ చేసే వాచీ, రూ.1.50 లక్షల విలువ చేసే కళ్లజోడును సిఎం ధరించడం పారదర్శకమేనా…ఇది సాధారణ జీవితమా…అని ప్రశ్నించిన మేరకు వివాదం చెలరేగింది. ధర స్పష్టంగా వెలవరించిన సిఎం ఓ అభిమాని వాచీ ఇచ్చారని అంగీకరించారు. వజ్రాలు పొదిగిన హ్యూబ్లెట్ వాచీ ధర మార్కెట్లో రూ. 7౦ లక్షలకుపైగానే పలుకుతోంది. ఖరీదైన వాచీపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సిఎం భావిస్తున్నారు. సమస్య మరింత ముదరక ముందే పరిష్కారం కావాలని భావిస్తున్నారు. ఈ అంశం పై న్యాయనిపుణులు ఆప్తులతో చర్చించనున్నారు. వాచీని వేలం వేయడమా…లేక ప్రజా సొముగా ప్రకటించడమా అనేది తేలాల్సి వుంది. వేలం వేస్తే వచ్చిన సొమ్ముతో సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించాలని భావిస్తున్నారు. మార్చి తర్వాత ఆస్తుల వివరాలను ప్రకటించాలనుకుంటున్న సిఎం అప్పట్లోగా వాచీ వివాదానికి తెరదించదలిచారు. జిల్లా తాలూకా పంచాయతీ ఎన్నికలు ఈనెల 20న ఉన్నందున 18 వరకు ప్రచారాలకు వెళ్లాల్సి వుంది. దీంతో 19న చర్చలు జరిపే అవకాశం వుంది. ఈ నెల 21న వాచీని ఏం చేయాలనేది తేల్చనున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రులు దేవరాజ్ అరసు, రామకృష్ణ హెగ్డే, ఎస్.ఎం.కృష్ణ, కుమారస్వామిలకు అభిమానులు సమర్పించిన ఆభరణాలను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి విధానసౌధ ఎగ్జిబిషన్‌కు అప్పగించారు. మాజీ సిఎంల బాటలోనే సిద్దరామయ్య కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా సిఎం సిద్దరామయ్య వాచీని వేలం వేస్తే వచ్చిన సొమ్మును అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఇవ్వరాదని జెడిఎస్ కుమారస్వామి చరుకలంటించారు. అది పాపపు సొమ్ము అని…అటువంటిది అమరవీరుల కుటుంబాలకు ఇవ్వరాదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్దనపూజారి వాచీ సొమ్మును సైనికుల కుటుంబాలకు ఇవ్వాలని కోరని మేరకు కుమారస్వామి స్పందించారు. ఖరీదైన వాచీ బహుమతిగా ఇచ్చిన ఆప్తుడికి సిఎం ఏం సాయం చేశారో…బహిరంగ పరచాలన్నారు. అయితే హోం మంత్రి పరమేశ్వర్ మాత్రం దేశరక్షణలో అమరులైన సైనికుల కుటుంబీకులకు ఎంతటి సాయం చేసినా తక్కువేనన్నారు. వాచీ ఇవ్వడం తప్పేమీ కాదన్నారు.