Home తాజా వార్తలు ఉపాధే లక్ష్యం.. సిద్దిపేటే సజీవ సాక్ష్యం

ఉపాధే లక్ష్యం.. సిద్దిపేటే సజీవ సాక్ష్యం

harish raoజిల్లా వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్
నెరవేరనున్న నిరుద్యోగుల కల
900 ఎకరాల సేకరణ, మరో వెయ్యి ఎకరాలకు ప్రతిపాదన
ప్రస్తుతం డిఎక్స్‌ఎన్ కంపెనీ తాత్కాలిక ప్రారంభం
మరో రెండు కంపెనీలు స్థాపించడానికి ప్రతిపాదనలు
6400 మందికి ప్రత్యక్షంగా, 6500 పరోక్షంగా ఉపాధి
హరీశ్‌రావు చొరవతో పనులు వేగవంతం

పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణ, టిఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్ శివప్రసాద్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ను పరిశ్రమల కారిడార్‌గా మార్చడానికి ఇప్పటికే 900 ఎకరాల భూమిని సేకరించాం మరో 1000 ఎకరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఇప్పటికే రెండు పరిశ్రమలు ఉనికిలోకి వచ్చాయి. పరిశ్రమల స్థాపన కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పరిశ్రమల కోసం మిషన్ భగీరథ నీటి నుండి 10 శాతం నీటిని కేటాయించనున్నాం. పరిశ్రమల ద్వారా వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

సిద్దిపేట అర్బన్: దేశంలోనే సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శం. ఎన్నో అవార్డులు, రివార్డులు ఎక్కడ చూసినా ప్రశంసలే. నియోజకవర్గంలో పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు వస్తుంటారు. అభివృద్ధిలో భాగంగా నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది కూడా మాజీ మంత్రి, శాసన సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు ఆశయం. దీని కోసం నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని కోసం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎంఎన్‌సి కంపనీలు వారి కార్యాకలాపాలను ప్రారంభించాయి. త్వరలోనే మరిన్ని కంపనీలు జిల్లాకు రానున్నాయి. కంపనీల స్థాపన వల్ల స్థానిక నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది. పరిశ్రమల స్థాపన కోసం సిద్దిపేట, గజ్వేల్ డివిజన్‌లలో అధికారులు ప్రస్తుతం 900 ఎకరాల భూమిని సేకరించారు.

వీటిలో వివిధ రకాల పరిశ్రమలు స్థాపించనున్నారు. ఈ పరిశ్రమల స్థాపన జరిగితే ప్రత్యక్షంగా 6400 మందికి, పరోక్షంగా 6500 మందికి ఉపాధి దొరకనుంది. మరో 1000 ఎకరాల భూ సేకరణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. అంటే మరో 10 వేల మందికి ఈ పరిశ్రమల ద్వారా ఉపాధి కలుగనుంది. తన్నీరు హరీశ్‌రావు పట్టుదలతో మలేషియా దేశానికి చెందిన ఎంఎన్‌సి పరిశ్రమ డిఎక్స్‌ఎన్‌కి మందపల్లి గ్రామ శివారులో 47 ఎకరాలు కేటాయించారు. దీంతో వారు తాత్కలిక కంటైనర్‌లలో కార్యాలయం ప్రారంభించి పనులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వారు తమ స్వంతం భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నర్మేటలో 125 ఎకరాల భూ సేకరన పూర్తవగా మరో 150 ఎకరాల భూ సేకరణ జరిపి వివిధ పరిశ్రమలకు ఇవ్వాల్సి ఉంది. ఈ కారిడార్‌లోని పరిశ్రమల ఏర్పాటు వల్ల 800 మందికి ప్రత్యేక్షంగా, మరో 1500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. బండ మైలారం గ్రామంలో 153 ఎకరాలు స్వీకరించిన అధికారులు మరి కొంత భూమిని సేకరించే పనిలో ఉన్నారు. బండ తిమ్మాపూర్ గ్రామంలో 127 ఎకరాలు భూమిని సేకరించిన అధికారులు ఇందులో 20 ఎకరాల భూమిని ఆర్‌పిఎస్ గోయంక (ఆలు చిప్స్ తయారీ ఇండియన్ బెస్‌డ్ ఎంఎన్‌సి పరిశ్రమ)కు కేటాయించారు.

ఈ కారిడార్‌లో కేటాయించే పరిశ్రమల వల్ల 2000 మందికి ప్రతేక్షంగా,1500 మందికి పరోక్షంగా ఉపాది కలుగనుంది. తున్కి బోల్లారం గ్రామంలో ఇప్పటికే 150 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 200 ఎకరాల భూమి సేకరించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇక్కడ కూడాఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమలు వస్తే ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉపాది కల్పనకు వీలవుతుంది. పీర్లపల్లి, మునిగడ గ్రామాల్లో 400ల ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. నాగుల బండ వద్ద ఐటి కారిడార్ ఏర్పాటుకు 3 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. దుద్దేడ గ్రామంలో 100 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు.

పరిశ్రమలతో ఉపాధి కల్పన…

ప్రస్తుతం అగ్రీప్రొడక్స్ తయారు చేస్తున్న మలేషియా దేశానికి చెందిన డిఎక్స్‌ఎన్ పరిశ్రమ వారు కార్యకలాపాలను ప్రారంభించారు. వారికి కేటాయించిన 47 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి స్థాయిలో కార్యాలయం, ప్రొడక్షన్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్లతో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ వల్ల 2300 మందికి పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ఇక్కడి కంపనీలో ముఖ్యంగా స్పైరోలినా, గ్వానోడెర్మాలాంటి ఆరోగ్యానికి సంబంధించి మందుల ఉత్పత్తులు జరుపనున్నట్లు అధికారులు తెలిపారు.
నర్మేటలో హై న్యూట్రిషన్ పరిశ్రమ..
నర్మేటలో జపాన్ దేశానికి చెందిన హై న్యూట్రిషన్ పరిశ్రమ ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమలో కోడిగ్రుడ్డుతో తయారు చేసే హై న్యూట్రిషన్ ప్రొడక్ట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ద్వారా 1200 మందికి ప్రత్యక్షంగా,మరో 1500 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది.

బండతిమ్మాపూర్‌లో ఆర్‌పిఎస్ గోయంకా పరిశ్రమ…

బండతిమ్మాపూర్ కారిడార్‌లో ఇండియన్ బెస్‌డ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఆర్‌పిఎస్ గోయాంక(ఆలు చిప్స్ తయారి పరిశ్రమ) స్థాపించడానికి సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశ్రమకు ఇప్పటికే 20 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ పరిశ్రమల వల్ల 400 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. ఇవే కాకుండా సిద్దిపేటలోని ఆయిల్ మిల్లులు, పుట్నాల మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులు, ధాన్యం మిల్లులు కూడా ఒక చోట ఏర్పాటకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరో 1000 ఎకరాలు సేకరణలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా గత పాలకులు చెప్పి ఉపాధి కల్పన మాటలకే పరిమితం కావడంతో చాల మంది నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు, కాని ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, శాసన సభ్యుడు టి.హరీశ్‌రావు పట్టుదల, చొరవతో నిరుద్యోగుల కల నేరవేరనుంది.

Siddipet is developing district in the country