Home తాజా వార్తలు సుజల తెలంగాణ

సుజల తెలంగాణ

wtr

చెరువుల పరిరక్షణలో రాష్ట్రం రికార్డు
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : సంప్రదాయ చెరువులు, సహజ నీటి తావుల పరిరక్షణంలో తెలంగాణ తీసుకున్న చొరవ సత్ఫలితాలనిస్తోందని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలపై అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక్కో రాష్ట్రం కనబర్చిన పనితీరుకు అనుగుణంగా ర్యాం కులను ప్రకటించింది. దేశం మొత్తంమీద నీటి నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం 201516తో పోలిస్తే 201617లో మెరుగైన ఫలితాలు సాధిం చి 11 నుంచి 8వ స్థానానికి చేరుకుంది. రాజస్థాన్, తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా రెండు కంటే ఎక్కువ ర్యాంకుల ఎగువకు చేరుకోలేకపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 4.53 పాయింట్ల స్కోరు పెరిగింది. అన్నింటింటే ఎక్కువగా రాజస్థాన్ 8.85 పాయింట్లను సాధించగా ఆ తర్వాత జార్ఖండ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సాధించాయి. ఆరవ స్థానంలో తెలంగాణ నిలిచింది. 2015 16లో 45.2 శాతం స్కోరుతో ఉన్న తెలంగాణ 201617లో 49.8% సాధించింది. భూగర్భజలం, ఉపరితల నీటిని సద్వినియోగం చేసుకుని ఆయకట్టును పెంచడంలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించినట్లు పేర్కొంది. సాగునీటి సౌకర్యాలను కల్పించే సామర్థం కలిగిన సహజ చెరువుల్లో సుమారు 70% పునరుద్ధరించబడ్డాయని, అంతకుముందు సంవత్సరం ఇది 54 శాతమని పేర్కొంది. రాజస్థాన్ ఏకంగా 3 నుంచి 81 శాతా నికి ఫలితాన్ని సాధించిందని, ఇందుకు కారణం ఆ రాష్ట్రంలో ఎన్‌జిఒ సంస్థలను, ప్రజలతో క్షేత్రస్థాయిలో ఏర్పడిన కమ్యూనిటీ అసోసియేషన్లే కారణమని వివరించింది. చెరువులను పునరుద్ధరించడం ద్వారా సాగు విస్తీర్ణం సైతం ఊహించనంత వేగంగా తెలంగాణలో 53 శాతానికి చేరుకుందని, అంతకుముందు సంవత్సరంలో ఇది కేవలం 4% పెరుగుదల మాత్రమేనని పేర్కొంది. బోరుబావుల్లో నీటి మట్టం కూడా బాగా పెరిగిందని, సుమారు 90% మేర ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొనింది. నీటి కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దానికి తగిన చర్యలు చేపట్టడం, వ్యూహాత్మక కృషి చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని ఆ నివేదికలో నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ఉత్తమ నీటి నిర్వహణలో ఎనిమిది రాష్ట్రాలు 50% స్కోరును సాధించగా, అందులో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది.
ఉచిత వ్యవసాయ విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాలు ఐదే :
దేశంలోని ఐదు రాష్ట్రాలు మినహా మిగిలినవన్నీ వ్యవసాయ బోరు బావులకు వాడే విద్యుత్‌కు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, ఇందులో 14 రాష్ట్రాలు ఫిక్స్‌డ్ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొనింది. తెలంగాణ, తమిళనాడుతో పాటు మూడు ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలు మాత్రమే రైతులకు ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ను అందిస్తున్నాయని పేర్కొనింది. అయితే ఉచిత విద్యుత్ అందిస్తున్నందువల్ల బోరుబావుల వినియోగం పెరిగిందని, ఫలితంగా భూగర్భ జలమట్టంలో తేడాలు వస్తున్నాయని వివరించింది. అయితే తెలంగాణలో భూగర్భ జలమట్టం రీఛార్జి కావడంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 201617లో ఎలాంటి మార్పూ లేదని, అదే 77% స్కోరు కొనసాగుతోందని పేర్కొనింది. బోరుబావుల్లో నీటి కొరత కారణంగా కొన్ని రాష్ట్రాలు సూక్ష్మ సేద్యం విధానాన్ని అవలంబిస్తున్నాయని, భూగర్భ జల నిర్వహణలో సమర్ధమైన విధానాన్ని అవలంబించడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతకు తావు లేకుండా చూడవచ్చునని పేర్కొనింది. తెలంగాణలో మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ మొత్తం సాగుభూమిలో 64% ఇప్పటికీ వర్షాధారంపైన ఆధారపడి ఉన్నాయని పేర్కొనింది. నీటి సంరక్షణ పథకంలో తెలంగాణ 56% ఫలితాలు సాధించగా నాలుగు రాష్ట్రాలు 100% సాధించాయని పేర్కొనింది.
పట్టణాల్లో త్రాగునీటి సౌకర్యం : భూగర్భ, ఉపరితల నీటి నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తున్న తరహాలోనే పట్టణాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశాజనకంగానే నిర్వహిస్తోందని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లోని 80% ఇండ్లకు పకడ్బందీగా త్రాగునీటిని సరఫరా చేస్తోందని, ఇందులో 75% ఇండ్లకు నీటి పన్ను వసూలు చేస్తూ ఈ సౌకర్యాన్ని అందిస్తోందని, మిగిలిన ఇండ్లకు ఉచితంగానే ఇస్తోందని వివరించింది. దేశంలో ఒక్క గుజరాత్ రాష్ట్రం మినహా మరే రాష్ట్రం కూడా పట్టణ ప్రాంతాల్లో 100% జనాభాకు త్రాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రం అంతకుముందు ఏడాదిలో 72% మంది జనాభాకు పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యం కల్పించగా ఐదుశాతం వృద్ధితో అది 2017 మార్చి నాటికి 77%కి చేరుకుందని పేర్కొనింది. పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు కలుషితం అవుతున్న కారణంగా దేశవ్యాప్తంగా సగటున 22% జబ్బులు సంక్రమిస్తున్నాయని, రక్షిత త్రాగునీటిని అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థ (కలుషిత) జలాల్లో కేవలం 41% మాత్రమే శుద్ధి అవుతోందని, ఒక్క పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే ఇది 100% శుద్ధి అవుతోందని పేర్కొనింది.