Home ఎడిటోరియల్ సిమ్‌కార్డు రూ.5, టమాటాలు 150 రూపాయలు !

సిమ్‌కార్డు రూ.5, టమాటాలు 150 రూపాయలు !

tomattoనేటి మానవుని కష్టాలు వర్ణనాతీతం. వాటిని చూసి నవ్వాలో..ఏడ్వాల్లో..దిక్కుతోచని పరిస్థితి దాపురించింది. ఆనాడు ఒక సిని కవి.. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, అంటు పాట రాసాడు. కొద్దిరోజుల్లోనే అది ప్రతి ఇంటి యొక్క వంటింటి గేయంగా అవుతుందేమో .. కాబోలు..పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు అంగడికి డబ్బులు తీసుకుపోయి సంచులు నింపుకు వచ్చేది. ఇప్పుడు డబ్బును సంచులలో నింపుకు పోయి, కూరగాయలు జేబులలో నింపుకు రావలసి వస్తున్నది. కలికాలం అంటే ఇదేనేమో…!? అహ కాదు కాదు..ఇది పాలకుల కాలం. అందుకే అనవసరమైన వేమో..అందివస్తు న్నాయి.. నిత్యావస రమైనవేమో ..చుక్కల నంటుతున్నాయి.
రోజురోజుకు అంగడికి, కూరగాయల కోసం వచ్చేవారికన్నా.. సిమ్‌కార్డుల కోసం వచ్చేవారి సంఖ్యే ఎక్కువ అవు తున్నది. కారణం అగ్గిపెట్టెల్లాంటి సెల్‌ఫోన్స్, వాటిలో రెండు లేదా నాలుగు సిమ్ములు వేసి వాడే సౌకర్యం మొదలైనది. వినియోగదారుణ్ణి వివిధ రకాల ఆఫర్లు ఈ వైపుకు నడిపిస్తున్నాయి. గతంలో నేను ఒక దినపత్రికలో ఈ వాక్యం చదివినట్లు గుర్తు. “మన దేశంలో, అర్జెంటుగా వస్తే వెళ్లిరావడానికి టాయిలెట్స్ ఉండవుగానీ, పదివేల విలువజేసే సెల్‌ఫోన్స్ జేబుల్లో ఉంటున్నాయని’. వీటిని కొనే డబ్బునే ఒక్కసారి వెచ్చించి మరుగుదొడ్లు కట్టించుకోగలిగితే.. కుటుంబ, సమాజ ఆత్మగౌర వాన్ని కాపాడుకున్నవారి మవుతాం కదా..!? నానాటికి సిమ్ములు అతి చౌక అవుతున్నాయి. ఒక నెట్‌వర్క్ రూపాయికే సిమ్, వందరూపాయల టాక్‌టైం అంటుంది. మరో కంపెనీ పది రూపా యలు సిమ్, నెలరోజుల ఇంటర్‌నెట్ ఫ్రీ అంటున్నది. ఇక ఇంకొకటి రెండడుగులు ముందుకేసి, సిమ్‌ఫ్రీ, అన్నీ ఫ్రీ నెలరోజుల వరకు అంటున్నవి. అది వాడితే, వివిధ రకములైన రోగాలు కూడా ఫ్రీనే. ఆ అలవాటు వ్యసనమై, మరో నెలలో మననెత్తిమీద పెనుబండలా మారుతుంది. దాన్ని వాడిన అలవాటుకు, రీఛార్జీల షాపులవైపుకు..పోరా..వినియోగదారుడా..పో..పోరా..వినియోగదారుడా…నీలో..లక్షానికై..ముందుకు అడుగువేయరా అంటూ..వినియోగగీతం పాడవలసి వస్తుంది. ఒళ్లు గుల్లచేసి, జేబుకు చిల్లు పడేలా చేస్తుంది. చివరకు నరకం చూపిస్తుంది.
కూరగాయలు చేస్తున్న ‘గాయాలు’:
దేశమంతటా ఉన్న మార్కెట్లకు వినియోగ దారులు వెళితే..బంగారం షాపుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతున్నది. ఇంక అక్కడైనా..కాస్తో, కూస్తో..కొన్ని ఆభరణాలు కొనుక్కోనైనా తీసుకొచ్చు కోగలరు. కానీ మార్కెట్టుకు వెళితే ఏం కొనుక్కొని రావాలో తెలియడం లేదు. కారణం కూరగాయలు చేస్తున్న ‘కూర’గాయాలు. ఇటీవలికాలంలో ఈ అంశాలు దినపత్రికలలో తరచు చూస్తూనే ఉన్నాయి. టమాట ధర దాదాపు 100 దాటడానికి సిద్ధపడింది. కందిపప్పు మాట ఎత్తితే, తరతరాల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందేమో అని భయపడుతున్నారు. పెళ్ళిళ్ళలో మాంసంతో భోజనం పెట్టడం గొప్పగా భావిస్తున్నారు కొందరు. కాని నేడు పప్పుసాంబారుతో భోజనం పెడుతు న్నారు అని తెలిస్తే, ఆ ఫంక్షన్ వద్దకు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ రైడ్‌చేయవలసిన అవసరం ఏర్పడ బోతున్నది. ఇది విన్న ప్రజలు ముక్కున వేలేసుకునే స్థితి వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మధ్యన ఉల్లిధర కూడా కన్నీళ్ళు పెట్టించింది, కోస్తున్నప్పుడు కాదు, పైసలిచ్చి కొంటున్నప్పుడు. ఇక హోటళ్లలో, బిర్యానీలు తింటున్నప్పుడు, మిర్చి, పానీపూరీలు ఏంచక్కా లాగిస్తున్నప్పుడు “హే భాయ్.. జర, ప్యాస్ డైలాగ్ వినగానే, సర్వర్ నోరు వెళ్లబెట్టవలసి వచ్చింది. ఒకవేళ సర్వర్ ఉల్లి గనక వేస్తే.. హోటల్ గుల్ల అయి యజమాని ఆస్తి అమ్ము కొని, వలసకూలీగా మారి మరోచోటుకి ఉపాధికై వెళ్ళవలసి వచ్చేదేమో. ఉల్లిధరపై దేశవ్యాప్తంగా, నెటిజన్లు సెటైర్లు కూడా విసిరారు. ప్రియురాలికి ప్రియుడు, ఉల్లిగడ్డ ఉంగరం ఇస్తే చాలని, పెళ్లికూతురు తండ్రిని పెళ్ళిలో ఉల్లిగడ్డల పులుసు వడ్డించగలిగితే చాలని, అదే పెద్ద గొప్ప అని భావించినట్లు, దొంగలు కూడా అర క్వింటాల్ ఉల్లి దొంగలిస్తే చాలు, మా జీవిత ఆశయం నెరవేరు తుందని మురిసిపోయినట్లు కార్టూన్లు గీసాయ్. ఇవన్నీ కూడా నవ్వు పుట్టించే విధంగానే ఉన్నప్పటికి, వీటన్నింటి లక్షం, ఉద్దేశ్యం ఒక్కటే, కూరగాయల ధరలన్నీ సామాన్యునికి అందుబాటు లోకి రావాలని, సాగు రైతుకు తను పండించిన పంటకు సరైన ధర వచ్చి, వారి కుటుంబాలు ఆనందంగా బ్రతకాలని.
రైతులకు, ధరలకు ఏమైనా సంబంధం ఉందా..?
రైతులు అహర్నిశలు కష్టపడి, శ్రమను భూమిలో పోసి..పంటకోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసి చూసి చివరకు ధాన్యాన్ని మార్కెట్టుకు తీసుకెళితే, మార్కెట్‌యొక్క విధివిధానాల వల్ల ప్రభుత్వ విధానాలవల్ల, మధ్యదళారులవల్ల, చివరకు నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. ముఖ్యవిషయం ఏమి టంటే, రైతుకు పంటను పండించుటకు మొట్ట మొదట పెట్టుబడి కొంతమంది అడ్తిదారులు సహాయం చేస్తారు, ( ఈ డబ్బుకు వడ్డీ వసూలు చేస్తారులే) తద్వారా పంట చేతికొచ్చినంక, వారే దీనిని కొనుగోలు చేయడం, అనేది ముఖ్య ప్రభావాన్ని చూపగలదు. దీనితో.. మధ్యవర్తుల కొనుగోలు కాబట్టి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడం, కృత్రిమ కొరత సృష్టించడం, వినియోగం డిమాండ్ పెరిగినప్పుడు వస్తువుల ధరలను ఆకాశా నికి ఎత్తేసే అవకాశం ఉన్నది.
పరిష్కార మార్గాలేమిటి?
సరియైన సమయంలో విజిలెన్స్ వారు సోదాలు చేసి అక్రమ నిల్వలు అరికట్టాలి.
రైతులకు కాలానుగుణంగా ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడులు అందించగలగాలి.
వ్యవసాయశాఖ అనుబంధంగా ఉన్న సంస్థలు, ఆదర్శ రైతుల ద్వారా గ్రామాలలోని వ్యవసాయాన్ని అధికారికంగా పర్యవేక్షించాలి.
పంటలకు సరైన సమయంలో పిచికారి చేయుటకు సేంద్రీయ ఎరువులను సబ్సిడీపై అందించాలి
మేలైన విత్తనాలనే అందించేలా చర్యలుండాలి
ఎవరైతే తరతరాలనుండి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నారో వారిలోని 20 నుండి 60 సం॥ల వారిని ఎంపిక చేసి, నెలకు వారికి తగినంత పారితోషికం అందించగలగాలి.
ప్రతి సీజన్‌లో, ప్రతి మండలంలో ఉత్తమ రైతులను ఎంపిక చేసి నగదు బహుమతులను అందచేయగలగాలి.
వ్యవసాయ కోర్సులను అందించే కళాశాలలను విరివిగా ఏర్పాటు చేయాలి.వీటిలోకి ప్రవేశాలను కూడా సులభతరం చేయాలి. తద్వారా విద్యార్థి దశ నుండే, వ్యవసాయంపట్ల ఆసక్తి పెంచగలగాలి. భారతదేశ వెన్నెముకకు బలాన్ని చేకూర్చి మరికొన్ని తరాలపాటు వ్యవసాయాన్ని దేశాభివృద్ధికి యువ‘సాయం’గా అందించగలుగుతారు.
రచయిత : లెక్చరర్,శాయంపేట, వరంగల్‌జిల్లా
9059457045