Home స్కోర్ సెమీస్‌లో సింధు, సైనా

సెమీస్‌లో సింధు, సైనా

Sindhu and Saina went on to win the quarterfinals

ఊహించినట్టుగానే బ్యాడ్మింటన్ స్టార్లు, తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పి.వి.సింధులు భారత్‌కు పతకాలు ఖాయం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో సింధు, సైనాలు విజయం సాధించారు. దీంతో ఇద్దరికి కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. కాగా, ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా లభించలేదు. అయితే సింధు, సైనాలు సెమీస్‌కు చేరడం ద్వారా రెండు పతకాలు ఖాయం చేశారు. ఇదే క్రమంలో ఆసియా క్రీడల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్లుగా రికార్డు సృష్టించారు. కాగా, థాయిలాండ్ క్రీడాకారిణి జిందాపోల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు చెమటోడ్చి విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో సింధు 2111, 1621, 2114 తేడాతో జిందాపోల్‌ను ఓడించింది.

తొలి సెట్‌లో సింధుకు ఎదురులేకుండా పోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే క్రమంలో అలవోకగా గేమ్‌ను సొంతం చేసుకుంది. కానీ, రెండో సెట్‌లో సింధుకు చుక్కెదురైంది. ఈసారి జిందాపోల్ చెలరేగి ఆడింది. సింధును పూర్తిగా నిలువరిస్తూ ఆటపై పట్టు సాధించింది. చూడచక్కని షాట్లతో అలరించిన పోల్ సెట్‌ను దక్కించుకుంది. కానీ, ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో గేమ్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. ప్రారంభంలో కాస్త తడబడినా తర్వాత పట్టు సాధించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగింది. ఇదే సమయంలో సెట్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరడం ద్వారా కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మరో పోటీలో సైనా 2118, 2116 తేడాతో థాయిలాండ్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి రత్చనాక్‌పై విజయం సాధించింది.

తొలి సెట్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోటీ యుద్ధాన్ని తలపించింది. కానీ, కీలక దశలో రత్చనాక్ ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సైనా సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో భారత స్టార్ ప్రారంభం నుంచే పట్టు బిగించింది. చూడచక్కని షాట్లతో అలరించిన సైనా ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే సమయంలో అలవోకగా సెట్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది.