Home స్కోర్ సింధును విడని ఫైనల్ ఫోబియో!

సింధును విడని ఫైనల్ ఫోబియో!

Sindhu lost in the World Badminton Championship Final

మన తెలంగాణ/ క్రీడా విభాగం: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుకు మరోసారి నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు ఓటమి పాలైన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా సింధును ఫైనల్ ఫోబియో వెంటాడుతోంది. ఫైనల్ వరకు అలవోకగా దూసుకొచ్చి తెలుగుతేజం సింధు తుది మెట్టుపై మాత్రం బోల్తా పడుతోంది. కొంతకాలంగా సింధుకు ఇది అనవాయితీగా మారింది. గెలవాల్సిన మ్యాచ్‌లో సైతం ఓటమి పాలవుతోంది. ఈ బలహీనతను అధిగమించడంలో సింధు వైఫల్యం చవిచూస్తోంది. కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా సింధును ఈ ఫోబియో నుంచి గట్టెక్కించలేక పోతున్నాడు. ఒలింపిక్స్ ఫైనల్ మొదలుకొని ప్రతిష్టాత్మకమైన టోర్నీల్లో సింధు రెండో స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణం సాధించడంలో సింధు విఫలమైంది.

ఫైనల్లో తుది వరకు పోరాడినా విజయం మాత్రం సాధించలేక పోయింది. ఈ క్రమంలో పసిడి పతకం సాధించే అరుదైన అవకాశాన్ని సింధు చేజార్చుకుంది. ఒలింపిక్స్‌లో మొదలైన సింధు ఫైనల్ ఫోబియా రెండేళ్లుగా ప్రధాన టోర్నీల్లోనూ కొనసాగుతూనే ఉంది. ఫైనల్లో గెలవడం సింధుకు సవాలుగా మారింది. ఈ బలహీనతను అధిగమిస్తే సింధు ఖాతాలో ఎన్నో చారిత్రక విజయాలు దక్కేవి. కానీ, తుది మెట్టుపై బోల్తా పడడం అలవాటుగా మార్చుకోవడంతో రికార్డు పూటల్లో ఎక్కే అవకాశాలను చేజార్చుకుంటోంది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో అసాధారణ పోరాట పటిమను కనబరిచిన సింధు ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి పాలైంది. దీంతో సింధు స్వర్ణం సాధిస్తుందని ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులకు నిరాశే మిగిలింది. కిందటి ఏడాది జరిగిన పలు ప్రధాన టోర్నీల్లో కూడా సింధు ఫైనల్లో పరాజయం చవిచూసింది. తుది పోరులో ఓటమి పాలుకావడం సింధుకు అలవాటుగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. సెమీస్, క్వార్టర్ ఫైనల్ వరకు అగ్రశ్రేణి క్రీడాకారిణిలను సైతం అలవోకగా ఓడించే ఘనత సింధుకు ఉంది. అయితే తుది పోరులో మాత్రం తనకంటే తక్కువ ర్యాంక్ షట్లర్ల చేతుల్లో ఓటమి పాలుకావడం అలవాటుగా మార్చుకుంది.

ఒత్తిడి వల్లే…
ఫైనల్లో సింధు ఓటములను పరిశీలిస్తే చాలా వాటిల్లో ఒత్తిడికి గురైనట్టు స్పష్టమవుతోంది. రియో ఒలింపిక్స్‌కు ముందు వరకు సింధుకు ఫైనల్ ఫోబియా ఉండేది కాదు. ఫైనల్లో సైతం అలవోకగా గెలుస్తూ పలు టైటిల్స్ సొంతం చేసుకుంది. కానీ, రియో గేమ్స్ తర్వాత పరిస్థితి తారుమారు అయ్యింది. ప్రతి ప్రధాన టోర్నీ ఫైనల్లోనూ ఓటమి పాలవుతూ అభిమానులను నిరాశ గురిచేస్తోంది. సైనా నెహ్వాల్‌తో పోల్చితే సింధు చాలా టోర్నీల్లో ఫైనల్ వరకు దూసుకొస్తోంది. అయితే ఫైనల్ అడ్డంకిని మాత్రం అధిగమించలేక పోతోంది. కిందటిసారి జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్ ఫైనల్లో సింధు అలవోకగా గెలుస్తుందని చాలా మంది భావించారు.

ఒక దశలో సింధు ప్రారంభంలో బాగానే ఆడింది. ప్రత్యర్థి నజొమి ఒసాకా (జపాన్)ను హడలెత్తిస్తూ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. ఈ బలహీనత వల్లే ఆ మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా సింధు ఓటమి పాలుకాక తప్పలేదు. తాజాగా, ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా సింధు ఒత్తిడి వల్లే ఓటమి పాలైంది. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు ఎన్నో తప్పిదాలకు పాల్పడింది. ఒక దశలో ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించే అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. దీంతో మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు.