Search
Saturday 22 September 2018
  • :
  • :

సెమీస్‌లో సింధు

సైనా, కశ్యప్ ఇంటికి, ఇండియా ఓపెన్

Sindhu

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పివి.సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా, సైనా నెహ్వాల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్‌లు క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌లు ఇంతకుముందే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఇక, డిఫెండింగ్ చాంపియన్ సింధు ఒక్కటే టైటిల్ రేసులో నిలిచింది. ఇక భారత్ ఆశలన్నీ ఆమెపైనే ఆధారపడి ఉన్నాయి.
చెమటోడ్చి…
మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు కాస్త చెమటోడ్చి విజయం సాధించింది. స్పెయిన్ క్రీడాకారిణి బియాట్రిజ్ కొరల్స్‌తో జరిగిన పోరులో సింధు 2112, 1921, 2111 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. తొలి సెట్‌లో సింధు జోరుకు ప్రత్యర్థి కొరల్స్ వద్ద జవాబు లేకుండా పోయింది. చూడచక్కని షాట్లతో అలరించిన సింధును పెద్దగా కష్టపడకుండానే తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ, రెండో గేమ్‌లో మాత్రం సింధుకు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కొరల్స్ అసాధారణ పోరాట పటిమతో సింధును హడలెత్తించింది. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిన కొరల్స్ సెట్‌ను దక్కించుకుంది. అయితే కీలకమైన మూడో సెట్‌లో మళ్లీ సింధు పుంజుకుంది. ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. పొరపాట్లకు తావులేకుండా ఆడుతూ ముందుకు సాగింది. మరోవైపు కొరల్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సింధు సెట్‌ను గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సైనాకు పరాజయం ఎదురైంది. అమెరికా క్రీడాకారిణి బివెన్ జాంగ్‌తో జరిగిన పోరులో సైనా ఓటమి చవిచూసింది. ప్రారంభం నుంచే బివెన్ దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో సైనాను హడలెత్తించింది. సైనా ప్రత్యర్థికి కనీస ప్రతిఘటన ఇవ్వడంలో కూడా విఫలమైంది. వరుస తప్పిదాలకు పాల్పడుతూ చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. రెండు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన బివెన్ 2110, 2113తో సైనాను చిత్తు చేసి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

Comments

comments