Home తాజా వార్తలు పని తీరే మీ విజయ రహస్యం

పని తీరే మీ విజయ రహస్యం

Singapore Minister Eswaran

 

నాలుగేళ్ళ పనితీరే మళ్ళీ గెలిపించింది
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
సిఎం కెసిఆర్‌పై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రశంసలు

మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరును, నాలుగేళ్ళ పాలనలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రే టు 17.17 శాతానికి చేరుకోవడం పట్ల సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రశంసలు కురిపించారు. నాలుగేళ్ళ పాలనా తీరు కు ప్రజలు మరోమారు అధికారాన్ని కట్టబెట్టారని, ఈ విజయం రాష్ట్ర అభివృద్ధికి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆ దేశ మంత్రి రాసిన లేఖలో పే ర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ఒక అనువైన రాష్ట్రంగా గుర్తించారని, అందువల్లనే సింగపూర్ డెవలప్‌మెంట్ బ్యాంకు (డిబిఎస్) తొలిసారిగా టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పిందని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ తరహా హబ్‌ను సింగపూర్ వెలుపల నెలకొల్పడం ఇదే మొదటిసారి అని, హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడానికి అనువైన వాతావరణం ఉండడమే కారణమని పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన యాక్సెండాస్ సంస్థ కూడా హైదరాబాద్‌కు వచ్చిందని గుర్తుచేశారు.

రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కెసిఆర్‌కు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అభినందనలు తెలియజేశారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం 17.17% మేర ఆర్థిక వృద్ధి రేటు సాధించడం సంతోషమని, ఇదే వృద్ధి రేటు ఇకపైన కూడా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. రానున్న భవిష్యత్తులో సైతం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ, సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సింగపూర్‌కు చెందిన అనేక కంపెనీలు త్వరలో తెలంగాణను పెట్టుబడులు పెట్టడానికి ఒక కేంద్రంగా ఎంచుకుంటాయని, తెలంగాణ ఆర్థిక వృద్ధిలో ఆ కంపెనీలు కీలక భూమిక పోషిస్తాయని వ్యాఖ్యానించారు.

వాణిజ్యపరంగా, ఆర్థికపరంగా మాత్రమే కాక అనేక రీతుల్లో తెలంగాణ, సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్న నమ్మకాన్ని ఈశ్వరన్ వ్యక్తం చేశారు. సింగపూర్ మంత్రిగా ఈశ్వరన్ రాసిన లేఖతో పాటు ఆ దేశ కాన్సుల్ జనరల్ (చెన్నయ్) కూడా ఒక లేఖను కెసిఆర్‌కు రాశారు. కెసిఆర్‌ను ఈ ఇరువురూ ఆ లేఖలో ‘డియర్ ఎక్సలెన్సీ’ అని సంబోధించడం విశేషం. తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్ననాలుగేళ్ళలో సింగ్‌పూర్ డెవలప్‌మెంట్ బ్యాంకు, యాక్సెండాస్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, రానున్న కాలంలో ఇది మరింత వృద్ధి చెందుతుందని ఈశ్వరన్, చెన్నయ్‌లోని సింగపూర్ కాన్సుల్ జనరల్ రాయ్ ఖో ఆ లేఖల్లో పేర్కొన్నారు.

Singapore Minister Eswaran appreciated on CM KCR