Home ఖమ్మం సింగరేణిలో క్లర్క్ పోస్టులకు భారీగా పోటీ

సింగరేణిలో క్లర్క్ పోస్టులకు భారీగా పోటీ

*ఉన్నవి 471 పోస్టులు.. పరీక్షకు హాజరుకానుంది 83,224 మంది
*ఒక్కో పోస్టుకు 177 మంది పోటీ
*అక్టోబరు 11న ఐవు కేంద్రాల్లో పరీక్ష
*ఏర్పాట్లు చేస్తున్న యాజమాన్యం

Singareni-clerk-posts
ఖమ్మం: సింగరేణి సంస్థ ఇటీవల విడుదల చేసిన రెండో నోటిఫికేషన్‌లో భాగంగా క్లరికల్ పోస్టులకు రాత పరీక్షను నిర్వహించేందుకు యాజమాన్యం సన్నద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాలకు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా ఈ దఫా భారీఎత్తున అభ్యర్థులు క్లరికల్ పోస్టులకు పోటీ పడటం విశేషం. ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 471 ఉద్యోగాలకు గాను లక్షా పదివేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, అర్హతలు సరిగా లేని అభ్యర్థుల దరఖాస్తులను యాజమాన్యం తొలగించగా చివరకు ఈ ఉద్యోగాలకు 83,224 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హులుగా మిగిలారు. ఒక్కొక్క ఉద్యోగానికి 177 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షను వచ్చే నెల 11వ తేదీన అయిదు కేంద్రాల్లో నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లను సమకూర్చే పనిలో నిమగ్నమైంది. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణాల్లో ప్రత్యేక నిఘాల మధ్య యాజమాన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షను నిర్వహించనుంది. రెండో నోటిఫికేషన్‌లో భాగంగా సింగరేణి సంస్థ విడుదల చేసిన ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ అతిపెద్దదిగా భావించవచ్చు. క్లరికల్ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్‌లను ఈ వారం చివరి కల్ల సింగరేణి వెబ్‌సైట్‌లో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా 11వ తేదీన పరీక్ష అనంతరం అభ్యర్థుల ఫలితాలను సైతం ఆ తరువాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.