Home ఖమ్మం సారూ.. మాకు నివాస స్థలాలు కేటాయించరూ!

సారూ.. మాకు నివాస స్థలాలు కేటాయించరూ!

నివాస గృహాలు లేక ఏదులాపురం పేదల గోస
50 ఏళ్లుగా పంపిణీ కాని నివాస స్థలాలు

సారూ… మాకు నివాస స్థలాలు కేటాయించండి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఏడాది కాదు రెండేళ్లు కాదు 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. తిరగని కార్యాలయం లేదు. అడగని అధికారి లేడు. కానీ నివాస స్థలాల పంపిణీ కాలేదు. ఎవరెవరికో మా రెవెన్యూలో నివాస స్థలాలు ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ఏదులాపురం పేదల గోస.

kmm1ఖమ్మం రూరల్: మండలంలోని ఏదులాపురం గ్రామం మేజర్ పంచాయతీ. అయిదారు గ్రామాలతో కూడిన ఈ పంచాయతీలో అత్యధికులు పేదలు. ముఖ్యంగా గిరిజనులు, దళితులు ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఉండడంతో పేదలు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో 4,5 వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ, టీఎన్‌జీఓస్, క్రిస్టియన్ మిషనరీలకు ఈ రెవెన్యూలోనే భూమి కేటాయించారు. కొన్ని కాలనీలు సైతం ఏర్పాటయ్యాయి. కానీ గ్రామ పేదలకు మాత్రం నివాస స్థలాలు పంపిణీ కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఫేజ్ 2 నాటికి ఐదువందల పై చిలుకు అర్హులకు నివాస స్థలాలు లేవని అధికారులు లెక్కలు తేల్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సుమారు 7 వందల మందికి నివాస స్థలాలు లేవని తేలింది. స్థానిక నేతలు మొదలు, మండల అధికారు మొదలు, కలెక్టర్, అమాత్యుల వరకూ అందరినీ కలిసి పేదలకు నివాస స్థలాల గురించి వివరించారు. చూద్దాం.. చేద్దాం… అన్నారే తప్ప. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నివాస స్థలాలు పంపిణీ చేయాలని ఏదులాపురం గ్రామ పేదలు కోరుతున్నారు.