సిరిసిల్ల : మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం సిరిసిల్లలో నిరసన ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించి శుక్రవారం నాటికి మూడో రోజు. ఈ సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జిఓ 14 ప్రకారం వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మౌఖికంగా కాకుండా రాత పూర్వకంగా వేతనాల పెంపుకు ఆదేశాలు జారీ చేయాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తాము తమ డిమాండ్లు సాధించుకోవడానికి ఈ నెల 11న సమ్మె నోటీస్ ఇచ్చామని ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని దీంతో నిరవధిక సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం కార్యదర్శి గడ్డి కాశయ్య, సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి మోర అజయ్, సిపిఎం జిల్లా కార్యదర్శి పంతం రవి, పెద్ద భారతమ్మ, గుర్రం అశోక్, గడ్డం విజయ తదితరులు పాల్గొన్నారు.