Home కరీంనగర్ సిరుల ‘భోగి’

సిరుల ‘భోగి’

cow

*నేటి నుంచి సంక్రాంతి సంబరాలు
*వాకిళ్లకు రంగుల సింగారం
*మూడు రోజుల పాటు వేడుకలు

మనతెలంగాణ/కరీంనగర్‌కల్చరల్:పచ్చటి పంటలు…ప డుచుల ఆటలు..ఊరూరా భోగి మంటలు..బొమ్మల కొలువులు…వాకిళ్లకు రంగుల సింగారాలు..తెలుగు లోగిళ్లు వె లుగు పూవులై విరిసే సంక్రాంతి సంబురాలు వచ్చాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఇంటిల్లిపాది ఘ నంగా జరుపుకునే వేడుకలు ఆరంభమయ్యాయి. మూడు రోజుల సంక్రాంతిలో మొదటి రోజు భోగి. రెండో రోజు సం క్రాంతి. మూడో రోజు కనుమ పండుగగా జరుపుకుంటాం. సూర్యుడి గమనానికి అనుగుణంగా జరుపుకునే పండుగనే సంక్రాంతి పండుగ అని పిలుస్తారు. మనం నిర్వహించుకు నే ప్రతి పండుగలోనూ చేసే ప్రతి పూజలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందనేది మాత్రం నిజం. దక్షిణాయనం చి వరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీ ంతో సూర్యరశ్మి సరిగా ఉండక, క్రిమి కీటకాలు నశించవు. ఈ క్రమంలోనే మహిళలు పెండ (పేడ) నీళ్లతో ఇళ్లన్నీ అ లికి శుభ్రం చేసి సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో క్రిమి కీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పెం డ ముద్దలుంచి, పసుపు కుంకుమలు పెట్టి బంతి, చేమంతి మొదలైన పూలతో అలంకరిస్తారు. దీనినే గొబ్బెమ్మలు అం టారు. వేకువనే హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వినిపిస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణం రమణీయంగా జరుపుకుంటారు.మకర సంక్రాంతి రోజున సం క్రాంతి పండుగను, కనుమ రోజు మినుములతో గారెలు చేసి పెద్దలకు నైవేద్యం పెడుతారు. పశువులను పూజిస్తారు. సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ఇళ్లల్లో రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు.
సిరుల భోగి..
దక్షిణాయనం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సం క్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణ కోసం ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటలకు ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున తెల్లవారు జామున పిల్లలకు త లారా స్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అ క్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. భోగి పండ్లను పెద్దల చేత పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథ స్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందింద ని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.
మకర సంక్రాంతి…
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు.ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతు ంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిది.అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సంక్రాంతి నాడు పితృ దేవతలకు తర్పణం విడుస్తారు. బ్రా హ్మణులకు బియ్యం,బెల్లం,గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేధ్యంగా పెడుతారు. మహిళలు ముగ్గులు వేయడం, పి ండి వంటలు చేయడంలో నిమగ్నులవుతే, చిన్నారులు పతంగులు ఎగురవేస్తారు. పురుషులు కోడి పందాలతో సరదాగా గడుపుతారు.
రైతుల పండుగ కనుమ…
భోగి, సంక్రాంతి పండుగల తర్వాత రోజు జరుపుకునే ప ండుగ కనుమ. దీనిని రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు.కొత్త ధాన్యాలతో పొంగలి వండి దేవుడికి ప్రసాదంగా నివేదిస్తారు. కనుమ రోజు గ్రామీణ ప్రాం తాల్లో ఎద్దుల బండ్లతో ఊరేగింపులు జరుపుతారు.
మార్కెట్లో సందడి…
సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లన్నీ రంగులు సంతరించుకోనుండడంతో మార్కెట్లో రంగుల విక్రయాలు ఊపందుకున్నాయి.రంగులతో పాటు రేగుపండ్లు, బంతి పూలు, గ రక పోసలు, ముగ్గులు, మామిడి ఆకులు సేకరించి తెచ్చిన గ్రామీణులు వీటిని విక్రయిస్తున్నారు. దీంతో శనివారం సా యంత్రం మార్కెట్ ప్రాంతమంతా వినియోగదారులతో స ందడిగా మారింది.