Home తాజా వార్తలు తేజ నా గురు, నా మెంటర్, గైడ్

తేజ నా గురు, నా మెంటర్, గైడ్

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక గీతంలో నటించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ “సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్‌మేకర్‌ను నేను జీవితంలో ఇప్పటివరకు కలవలేదు. నా ఆరవ సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ‘సీత’ సినిమాలో నేను చేసిన రఘురామ్ అనే పాత్ర ఛాలెంజింగ్ రోల్. సినిమా చూశాక నా క్యారెక్టర్‌కు తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా నాకు నటుడిగా మంచి గౌరవం తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే… మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. అలాంటి కథతో ‘సీత’ సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు”అని అన్నారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ “సీత సినిమాతో చాలా నేర్చుకున్నా. ఇదొక బ్రిలియంట్ జర్నీ. తేజ నా గురు, నా మెంటర్, గైడ్. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్‌పై ఉండేదాన్ని కాదు. తేజ స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నాను. సీత సినిమాతో పీహెచ్‌డి చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణ పడి ఉంటాను”అని తెలిపారు. దర్శకుడు తేజ మాట్లాడుతూ “ఈ సినిమాలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. హీరో యాక్షన్, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ బాగా చేస్తాడు. అతన్ని కొత్త స్టయిల్‌లో చూపించాను. హీరోయిన్ కాజల్ కూడా చాలా బాగా చేసింది. సోనూసూద్ నేను అనుకున్నదాని కంటే చాలా బాగా చేశారు. అనూప్ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేశాడు”అని చెప్పారు.
సోనూ సూద్ మాట్లాడుతూ “ఇటీవల ఒక ఫంక్షన్‌లో నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కదా.. మీ ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగారు. నేను వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది తెలుగు భాషనే. తెలుగు ఇండస్ట్రీ నా ఫేవరెట్ ఇండస్ట్రీ. నా డేట్స్ ఖాళీ లేకపోయినా నా కోసం నెలరోజులు ఎదురు చూసి నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చిన తేజకు ధన్యవాదాలు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నారా చోప్రా, అనిల్ సుంకర, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.

SITA movie Pre Release event