Home తాజా వార్తలు బడ్జెట్ 2019లో పన్ను సంస్కరణలు

బడ్జెట్ 2019లో పన్ను సంస్కరణలు

FM Nirmala Sitharaman
సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన ఆర్థికవేత్తలు

న్యూఢిల్లీ : బడ్జెట్ 2019లో పన్ను సంస్కరణలు చేపట్టాలని ఆర్థికవేత్తలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం ముందస్తు బడ్జెట్‌పై ఆమె పలువురు ఆర్థికవేత్తలతో సమావేశమై.. వారి సలహాలను అడిగి తెలుసుకున్నారు. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) సులభతరం, ప్రత్యక్ష పన్ను కోడ్ అమలు, ఉద్యోగాల పరంగా వృద్ధికి చర్యలు, ఆర్థికంగా మెరుగైన పాలన వంటి అంశాలపై ఆర్థికవేత్తలు సూచనలు చేశారు. ఆర్థికమంత్రి ఇప్పటికే పరిశ్రమ, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇది ఆరో ముందస్తు బడ్జెట్ సమావేశం, అయితే జులై 5న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో నిర్మలా సీతారామన్ కసరత్తు తీవ్రతరం చేశారు. వచ్చే ఐదేళ్లకు ప్రతీక నిలిచే ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల ను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు, పబ్లిక్ సెక్టార్ అప్పులు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఆర్థిక కార్యదర్శి సుబాష్ గార్గ్ కూడా ఈ సమావేశంలో కీలకంగా నిలిచారు. ఆర్థికవేత్తలుగా ఎన్‌ఐపిఎఫ్‌పి సిఇఒ రితిన్ రాయ్, ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలర్‌మెంట్ రీసెర్చ్ వైస్ చాన్స్‌లర్ ఎస్ మహేంద్ర దేవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Sitharaman was asked to make tax reforms in budget