Home తాజా వార్తలు సభైఠాయింపు

సభైఠాయింపు

రైతు రుణమాఫీ బకాయిల ఏకకాల చెల్లింపుపై స్పష్టత కోరుతూ
వాయిదా పడిన తర్వాత సభలోనే బైఠాయించిన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ,
సిపిఎం, బిజెపి సభ్యులు, మార్షల్స్ సహాయంతో బయటికి తరలింపు

5757హైదరాబాద్: రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు శాసనసభ నుంచి కదలబోమని ప్రతిపక్ష పార్టీలన్నీ భీష్మించాయి. బుధవారం రాత్రి 8.50 గంటలకు శాసనసభ వాయిదా పడిన తరువాత కూడా ఎంఐఎం మినహా కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఐ (ఎం), వైసిపి శాసనసభ్యులు సభలోనే బైఠాయించారు. అనంతరం చాలా సేపటికి వారిని మార్షల్స్ బయటకు తీసుకుపోయారు. రైతులకు మిగిలిన 50 శాతం రుణ బకాయిలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు.లోపల ఏమి జరుగుతోందో చూడడానికి వీలులేకుండా కొద్దిసేపటికే మీడియా గ్యాలరీ నుంచి విలేకరులను బైటికి పంపారు. శాసనసభ లోపలికి వెళ్ళే ద్వారాలను కూడా మూసివేశారు. సభలోనే ఉండి పోయిన వారిలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టిడిపి శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిజెపి శాసనసభా పక్ష నేత లక్ష్మణ్, సిపిఐ ఎంఎల్‌ఎ ఆర్.రవీంద్రకుమార్, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య, వైసిపి ఎంఎల్‌ఏ పాయం వెంకటేశ్వర్లు సహా ఆయా పార్టీల ఎంఎల్‌ఏలు ఉన్నారు. “రుతు పవనాల వైఫల్యం-రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు” అనే అంశంపై చర్చ రెండు రోజులపాలు సుమారు 14 గంటలు సాగింది.

ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు పెంచిన రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ ఏర్పడి నప్పటి నుండి వర్తింపజేస్తున్నట్లు చర్చ ప్రారంభంలోనే ప్రభుత్వం చేసిన ప్రకటనను సభలో ప్రతిపక్షాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. దీంతో దాదాపుగా రెండు రోజుల చర్చల సాఫీగానే సాగింది. రుణమాఫీ కింద 50 శాతం బకాయిలను ఒకేసారి చెల్లించే విషయాన్ని సానుభూతితో పరిశీలిస్తున్నామని సిఎం కెసిఆర్ తన ప్రసంగంలో తెలిపారు. అనంతరం సభ వాయిదా పడి మధ్యాహ్నం మూడు గంటలు తిరిగి సమావేశమ య్యాక, విపక్ష పార్టీలన్నీ బకాయిలను ఒకేసారి చెల్లించాల్సిందేనని పట్టుబట్టాయి. దీనికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడి సమాధానమిస్తూ వీలైనంత త్వరలో బకాయిలు చెల్లిస్తామని చెప్పారే తప్ప ఎప్పటి వరకు అనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు. చివర్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకొని కేంద్రం నుండి బిజెపి సభ్యులు రూ.8వేల కోట్ల అడ్వాన్స్ ఇప్పిస్తే, తక్షణమే బకాయిలన్నీ మాఫీ చేస్తామనడంతో చర్చ మలుపు తిరిగింది.

బిజెపిని అడిగి లక్ష రూపాయల రుణమాఫీ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారా? అని ఆ పార్టీ ఎంఎల్‌ఎ జి.కిషన్‌రెడ్డి ప్రశ్నిం చారు. దానికి కడియం స్పందిస్తూ బిహార్ రాష్ట్రానికి అడ్వాన్స్ ఇచ్చారని, తెలంగాణకు కూడా బిజెపి-టిడిపి సభ్యులు అడ్వాన్స్ ఇప్పించాలని, ఇందుకు అవసరమైతే తీర్మానం చేద్దామన్నారు. మధ్యలో పలు మార్లు టిడిఎల్‌పి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిజెపి సభ్యులను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో చర్చ పక్కదారి పట్టింది. చివరలో ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పిందం తా ఓపిగ్గా విన్నామని, రైతాంగం ఆందోళనలో ఉందని, రుణమాఫీ బకాయిలను ఒకేసారి చెల్లించే విషయంలో ప్రభుత్వం సమాధానమిచ్చేంత వరకు సభలోనే కూర్చుంటామని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఎక్స్‌గ్రేషియా పెంపుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుం బాలకు ఊరట లభించిందని, అదే సమయంలో బతికున్న రైతులకు రుణమాఫీ ఒకేసారి చేస్తే ఊరట లభిస్తోందన్నారు. అయితే, దీనిపై మంత్రి పోచారం సమాధానమివ్వకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ అభ్యర్థించగానే స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీ, ఎంఐఎం సభ్యులంతా బైటికి వెళ్ళిపోయినప్పటికీ,మిగిలిన ప్రతిపక్ష సభ్యులు సభలోనే బైఠాయించారు. సభలోనే ఉండిపోయి నిరసన తెలియ జేసిన వారిలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు టి. జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, చిన్నా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భాస్కర్‌రావు, టి.రామ్మెహన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పువ్వాడ అజయ్‌కుమార్, దొంతి మాధవరెడ్డి, టిడిపి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌రెడ్డి గౌడ్, రాజేందర్‌రెడ్డి, వివేక్, అరికెపుడి గాంధీ, బిజెపి ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, రాజాసింగ్, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, మార్షల్స్ బలవంతంగా విపక్ష ఎమ్మెల్యేలందర్ని బయట కు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు వారిని ప్రత్యేక వాహనాల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి గెంటివేయడం సబబు కాదని విపక్ష సభ్యులు పేర్కొన్నారు.