Search
Thursday 15 November 2018
  • :
  • :

30 ఏళ్ల ‘కళ్లు’

Sivaji Raja Emotional Speech At Kallu Movie

శివాజీ రాజా హీరోగా 1988లో వచ్చిన ‘కళ్లు’ 30 సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ‘కళ్లు’ నాటకం ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ఎం.వి.రఘు దర్శకత్వం వహించగా ఈవివి సత్యనారాయణ కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయడంతో పాటు ‘తెల్లారిందే…’ అనే పాట కూడా పాడారు. ఈ చిత్రంలో రంగడు అనే క్యారెక్టర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎంతో మంది కొత్త నటీనటులకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కళ్లు’  30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో శివాజీ రాజా మాట్లాడుతూ “కళ్లు చిత్రాన్ని దర్శకుడు రఘు సహజసిద్ధంగా తీశారు. ఈ సినిమాతో నాకు గుర్తింపు రావడానికి కారణమైన ఈవివి సత్యనారాయణకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంతో ప్లస్ అయింది. పలువురు గొప్ప వాళ్లతో ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది”అని అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటిది తొలి సినిమానే మంచి విజయం సాధిస్తే కథానాయకుడు ఆ చిత్రాన్ని ఎప్పటికీ మరచిపోడు. శివాజీరాజా హీరోగా చేసిన ‘కళ్లు’ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం”అని పేర్కొన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల సమయంలో నేను పాలకొల్లులో 9వ తరగతి చదువుతున్నాను. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, అనితా చౌదరి, బెనర్జీ, భిక్షపతి, కళ్లు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments