Home ఆఫ్ బీట్ అరవై మందికి ఆరుగురు అమ్మలు

అరవై మందికి ఆరుగురు అమ్మలు

Sixty people to six mothers

మానసిక వ్యాధికి ప్రేమతో చికిత్సనందిస్తున్న మదర్‌థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ

వారెవరో వారికే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో అస్సలు గుర్తుకులేదు. నిత్యం ఆకాశానికేసి చూస్తూ ఆలోచిస్తుంటారు. వారిలో వారే ముసిముసిగా నవ్వుకుంటారు. అంతలోనే ఏదో గుర్తుకువచ్చి ఏడుపు మొదలెడతారు. ఆకలేస్తే మాత్రం ఏడుస్తారు. కోపమొస్తే గట్టిగా కేకలేస్తారు. గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ఒక్కసారిగా బెదిరిపోతుంటారు. అరవై మంది ఒక్కచోట ఉన్నా ఎవరికి వారే తిరుగాడుతుంటారు. ఒకరికొకరికి పరిచయం లేదు. పలుకరించుకోరు. అసలు వారి పేర్లేమిటో వారికే తెలియదు. వారందరూ ఎవరో కాదు మానసిక వికలాంగులు. మానసిక ఒత్తిడికి తాళలేక గతం మరిచిపోయారు. అయిన వారు అక్కున చేర్చుకోకపోవడంతో ఏకాకులైనారు. వారిని మనుషులుగా తయారుచేస్తున్నారు ఆరుగురు అమ్మలు. ఈ అమ్మలకు తెలిసిందల్లా మానసిక రోగులను ప్రేమించడమే. ప్రేమ అనే ఔషధాన్ని నిత్యం రోగులకు అందిస్తారు. ఈ క్రమంలో వారిని కోపగించుకున్నా ఏవగించుకోరు. జీవశ్ఛవాలుగా ఉన్న వారికి తిరిగి సరికొత్త జీవితాలను ప్రసాదిస్తున్న సేవకులు ఈ అమ్మలు.

రెండేళ్ల క్రితం సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లోని రైలు పట్టాలపై నిండు గర్భిణి మగబిడ్డనుప్రసవించింది. మానసిక రోగంతో బాధపడుతున్న ఆ మహిళను పోలీసులు మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలో చేర్పించారు. కాగా ఏడాది అనంతరం ఆమె ఎవరో గుర్తుకు వచ్చింది. తన పేరు మృదుల అని, తనది గోహటి అని నిర్వహకులకు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను గోహటిలో వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా వందలాది మంది మానసిక రోగులు వారికి గతం గుర్తుకు వచ్చిన వెంటనే వారిని వారి ఇళ్లకు చేరుస్తున్నారు

మతిస్థిమితం లేని వారు ఎదుట పడితే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. వందలాది మంది మానసిక వికలాంగులను ఒకే చోట చూస్తే ఏడుపొస్తుంది. దీర్ఘకాలిక గాయాలతో బాధపడుతున్న మానసిక రోగులను చేరదీసి వారిని తిరిగి మామూలు మనుషులుగా తీర్చిదిద్దే యత్నం చేస్తున్న వారిని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. రహదారులపై అనాథలుగా పడివున్న మానసిక వికలాంగులను చేరదీసి సేవవలందిస్తోంది న్యూ బోయగూడలోని మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ.

మానసిక వికలాంగుల శరణాలయం నిర్వహిస్తూ వేలాది మందిని మామూలు మనుషులుగా మార్చి మానవత్వాన్ని చాటిచెబుతున్నారు. ఈక్రమంలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీలో దాదాపు 75 మంది బుద్ధిమాంద్యులకు ఉచిత సేవ చేస్తున్నారు. నిత్యం వారి బాగోగులు చూడటమే వారి పని. ఇందులో ఉండే 75 మందికి గాను 60కి పైగా మానసిక రోగులున్నారు. ఈ క్రమంలో ఆరుపదుల సంఖ్యలో ఉన్న మానసిక రోగులకు అన్నీ తామై ఆరుగురు అమ్మలు సపర్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతం గుర్తుకు వచ్చిన వారిని వారి స్వస్థలాలకు పంపుతారు. నగరంలో ఏదైనా ప్రాంతంలో రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో అచేతనంగా పడివున్న వారిని పోలీసులు గుర్తించి వారిని ఇక్కడికి తరలిస్తారు.

సంస్థ స్థాపన ఎప్పుడంటే… మదర్‌థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను 1979లో స్థాపించారు. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా మానసిక రోగులకు వైద్య సేవలందించారు. ఈ నేపథ్యంలో తిరిగి కోలుకున్న వారిని వారి స్వస్థలాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డవారిని వారి వారి సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు. శరణాలయంలోని మానసిక రోగులకు డాక్టర్ జార్జ్‌రెడ్డి (న్యూరో, సైక్రియాటిస్ట్), త్యాగరాజు, సరళ, మహేష్‌లు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. మానవత్వం ఉన్న వాళ్లు ఇతోధికంగా వారికి తోచిన మేరకు ఆదుకుంటున్నారు.

వీరి సేవను మరువలేము : మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ తెలుగు రాష్ట్రాలలో 13 కేంద్రాలలో సేవాకార్యాక్రమాలు చేపడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మానసిక రోగులకు సంబంధించిన వివిధ విభాగాలున్నాయి. సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 5,167 మంది సేవకులున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారికి వేతనాలుండవు. 10 సంవత్సరాలకు ఒకసారి 15 రోజులు సెలవిస్తారు. ఆ సెలవుల్లో వారు తమ కుటుంబ సభ్యులతో గడుపుతారు.

దినచర్య : ప్రతిరోజూ ఉదయం 6గంటలకు నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం వారికి ఒక గ్లాసు పాలిస్తారు. అనంతరం 7గంటలకు టిఫిన్ పెడతారు. తిరిగి 10 గం. లకు స్నాక్స్, మధ్యాహ్నం 12.30లకు భోజనం. తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి సేవకులే అన్నీ దగ్గరుండి చేయిస్తారు. వెరసి సేవకుల స్వరం వినగానే ఎక్కడివారక్కడ నిలిచిపోతారు. వారు చెప్పింది వినేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. వివిధ రకాల మానసిక రోగులుంటారు. తొలుత వారి రోగనిర్ధారణ అయ్యాక చికిత్స ఆరంభింస్తారు. వారికి అందిచాల్సిన వైద్యం విషయంలో ఇక్కడున్న సేవకులు వైవిధ్యంగా అందిస్తారు. వారికి సకాలంలో మందులు వేసేందుకు ఒక దశలో అహర్నిశలు శ్రమిస్తారు.

నేనెవరో తెలిసింది : నేనిక్కడకి ఎలా వచ్చానో, ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు. కానీ ఇక్కడ అందుతున్న వైద్యం, ఆపై ప్రేమానురాగాలు తిరిగి నన్ను మనిషిని చేశాయి. ఇటీవల కాలంలోనే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం అని తెలుసు. మా నాన్న పేరు రాజు అని గుర్తుకొచ్చింది. అయితే అనంతపురంలో ఎక్కడ ఉండేవాళ్లమన్నది సరిగ్గా తెలియడం లేదు. ఒకవేళ మే మున్న ఏరియా గుర్తుకు వచ్చినా ఇక్కడి నుంచి వెళ్లను. నా తోటి మానసిక రోగులకు సేవ చేసుకుంటా. ఎప్పటకీ ఇక్కడే ఉంటా. 4ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. నన్ను ఇక్కడి నుంచి పంపించ వద్దని వేడుకుంటున్నా అంటోంది గతం గుర్తుకొచ్చిన ఓమహిళ.

వేడుకలు : కొందరు దయార్ద్రహృదయులు తమ పెళ్లి, పుట్టినరోజు వేడుకలను ఈ సంస్థలో జరుపుకుంటున్నారు. ఈక్రమంలో వారు ఇక్కడ ఉన్న రోగులకు తమకు తోచిన విధంగా సహా యం చేస్తున్నారు. స్వీట్స్, పండ్లు, బిస్కెట్స్ తదితర తినుబండారాలను రోగులకు అందజేస్తున్నారు. మరికొందరు వస్త్రాలు అందిస్తున్నారు. పాత బట్టలు ఇచ్చినా తాము తీసుకుంటామని, వాటిని ఉతికి రోగులకు అందజేస్తామంటున్నారు నిర్వాహకులు. ఇక్కడ ఉన్న రోగులకు బయటకు తీసుకుపోలేరు. దీంతో బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో వారికి చూపించే యత్నాలు మాత్రం చేస్తుం టారు. ఒక హాల్‌లో షాపింగ్ మాల్ మాదిరిగా ఏర్పాటు చేసి, వాటిని రోగులు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. కరెన్సీ వారి చేతికి ఇచ్చి అవీఇవీ కొనుక్కో మంటారు. ఆ రోజు వారి ఆనందానికి అవధులు వుండవు. వారి ఆనందమే మాకు మహదానందమని సంస్థలోని సేవకులు పేర్కొంటున్నారు. ఈ సంస్థ నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు లేవని, కేవలం మనసున్న దాతల విరాళాల వల్లే ముందుకుసాగుతోందని నిర్వాహకులు వివరిస్తున్నారు.

                                                                             – చెన్నూరి నాగ శ్రీధర శర్మ,  ఫొటోలు : బాష