Search
Wednesday 21 November 2018
  • :
  • :

వాయు కాలుష్యాన్ని నిరోధించే స్మాగ్ టవర్

Smaug Tower that prevents air pollution

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కలుషిత వాయువును శుద్ధి చేయడానికి ఢిల్లీకి చెందిన అంకుర పరిశ్రమ 40 అడుగుల పొడవైన శుద్ధి టవర్‌ను డిజైన్ చేసింది. దీని చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో 75 వేల మందికి శుద్ధి అయిన వాయువును అందిస్తామని ఆ సంస్థ చెబుతోంది. ప్రపంచం మొత్తం మీద పెద్ద వాయుశుద్ధి సంస్థగా కురిన్ సిస్టమ్స్ ఇటీవలనే పేటెంట్‌ను సంపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం… ప్రపంచం మొత్తం మీద పది కాలుష్య నగరాల్లో ఆరు నగరాలు మన దేశం లోనే ఉన్నాయి. ఆ ఆరు నగరాల్లో ఢిల్లీ ప్రధమ స్థానంలో ఉంది. వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 1.2 మిలియన్ జనం చనిపోతున్నారని గ్రీన్‌పీస్ నివేదిక గత ఏడాది వెల్లడించింది. ఈ శుద్ధి పరికరాన్ని సిటీ క్లీనర్‌గా కురిన్ సంస్థ పిలుస్తోంది. 40 అడుగుల ఎత్తు ఉండే ఈ క్లీనర్ 20 అడుగులు అటూ ఇటూ వెడల్పు కలిగి ఉంటుంది. రోజుకు 32 మిలియన్ ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది.ఈ సాధనం 360 డిగ్రీల కోణంలో గాలిని గ్రహించే సామర్థం కలిగి ఉంది. గంటకు 13,00,000 ఘనపు మీటర్ల శుద్ధియైన గాలిని అందిస్తుంది. ఈ భారీ శుద్ధి సాధనానికి గాలిని పంపించడానికి 48 ఫ్యాన్లు ఉంటాయి. సౌరఫలకాల ద్వారా ఉత్పత్తయిన శక్తితో ఈ సాధనం పనిచేస్తుంది. దీనికి ఎలెక్ట్రిక్ గ్రిడ్స్ అక్కర లేదు. ఇది ఎంతో వ్యయంతో కూడుకున్నప్పటికీ పర్యావ రణానికి అనుకూలమైనది.
చైనా ముందంజ…
కాలుష్య వాయువులను శుద్ధి చేయడంలో చైనా ముందంజ వేసింది. జియాన్‌లో భారీ స్మాగ్ టవర్‌ను నెలకొల్పింది. దానివల్ల రోజూ 10 మిలియన్ ఘనపు మీటర్ల వాయువులు శుద్ధి అవుతున్నాయి. అయితే ఢిల్లీలో నెలకొల్పనున్న టవర్ చైనా టవర్ కన్నా మూడు రెట్లు శుద్ధి చేయగల సామర్థం ఉన్నట్టు సంస్థ కురిన్ వెల్లడించింది. చైనా టవర్ కన్నా ఢిల్లీ టవర్ సాంకేతికంగా భిన్నమైనది. ఢిల్లీ టవర్ ఐయొనైజేషన్ టెక్నిక్ పై ఆధార పడదు. గాలిని ఐయొనైజేషన్ చేయడం వల్ల కాలుష్య కారకాలు నిర్మూలించ బడవు. ఆక్సిజన్ నుంచి కాలుష్య కారకాలను మాత్రం వేరు చేస్తాయి. దీనివల్ల సమస్యలు కొన్ని ఎదురవుతాయి. గాలి నుంచి 99.9 శాతం కాలుష్య కారకాలను వేరు చేసి శుద్ధి చేయడానికి కురిన్ తొమ్మిది దశల్లో పిల్టర్లను ఉపయోగిస్తుంది. నగర స్థాయిలో గాలిని శుద్ధి చేసే ఈ ప్రక్రియ కేంద్రం తోపాటు రాష్ట్రాలు కూడా అనుసరిస్తే చాలా మేలు జరుగుతుంది. ప్రభుత్వ వర్గాలు ఈ వ్యవస్థకు అంగీకారం తెలిపితే నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామని కురిన్ సంస్థ చెబుతోంది. ఈ టవర్లకు ఒక్కొక్కదానికి 1.75 కోట్లు నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ప్రపంచం లో ఇతర దేశాల్లోని టవర్ల కన్నా ఈ టవర్లకు తక్కువ ఖర్చు అవుతుందని సంస్థ పేర్కొంది. ఇతర దేశాల్లో 300,000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.
– పరిశోధన విభాగం

Smaug Tower that prevents air pollution

Telangana Latest News

Comments

comments