Home దునియా దేవతాపక్షి

దేవతాపక్షి

God-Bird

నల్లని శరీరం, మెరుపులు చిందించే నెమలి కంఠం రెక్కలు, రంగు రంగుల ఈకలు..చూడ్డానికి అది ఈ లోకపు పక్షిలాగే అనిపించడంలేదు కదూ..! అందుకే అంతా దీన్ని సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్ అంటున్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే దేవతాపక్షి. దీన్ని చూడాలంటే న్యూగునియా అడవులకి వెళ్ల్లాలి. పది అంగుళాల పొడవుండే వీటిల్లో మగవే చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆడవాటిని ఆకర్షించడానికి చేసే విన్యాసాలు వింతగా..విచిత్రంగా..ఎంతో తమాషాగా ఉంటాయి. మగపక్షికి వెనక భాగాన మెరిసే ఈకలతో నల్లని రెక్కలుంటాయి. ముందు భాగంలో ఆకుపచ్చనీలం రంగులో మరో జత రెక్కల్లాంటివి ఉంటాయి. తలమీదా ఇదే రంగులో కిరీటంలా అనిపించే రెక్కలుంటాయి. ఇలా మగపిట్ట స్థూలంగా నల్లగా అందంగా, విచిత్రంగా ఉంటే ఆడపిట్ట కాస్త ముదురు గోధుమ రంగులో ఉంటుంది.

ఆడవాటిని వల్లో వేసుకోవడానికి మగవి గట్టిగా అరుస్తాయి. ఆడ పక్షులు అటుగా రాగానే ముందున్న రెక్కలు వెడల్పుగా చాచి, నెమ్మదిగా తలపైనున్న నీలం రంగు చిన్ని రెక్కలను పైకెత్తుతాయి. తర్వాత వెనుకున్న రెక్కలను పూర్తిగా విప్పుతాయి. అచ్చంగా నెమలిలా కనిపించడమే కాదు, ఆడవాటి చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా నాట్యం కూడా చేస్తాయి. ఇలా చేస్తున్నపుడు ముందు నుంచి చూస్తే దీని రెక్కలన్నీ వెడల్పాటి పింఛంలా కనిపిస్తాయి.

అదురుపాటుగా చూస్తే ఇది కార్టూన్ బొమ్మ స్మైలీలా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘స్మైలీ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్’ అని కూడా పిలుస్తారు. న్యూగునియా అడవుల్లో కనిపించే ఈ పక్షులలో 43 జాతులుంటాయని అధికారులు చెబుతున్నారు. మగవి ఎక్కువగా ఎత్తులో ఉండే చెట్లపై గడుపుతుంటాయి. ఆడవి మాత్రం ఎక్కువగా కిందే ఉంటాయి. ఎప్పుడో గానీ ఆడవి, మగవి కలుసుకోవు. చిన్న చిన్న కీటకాలు, పురుగుల్ని తింటూ బతికేస్తాయి. వీటికి పుట్టే పిట్టలను పెంచే బాధ్యతను ఆడపిట్టే స్వీకరిస్తుంది. ఈ పక్షి గుడ్లను పొదగడానికి ఇరవై రోజుల సమయం కావాలి. అందమైన రెక్కల కోసం ఈ దేవతా పక్షులను ఎక్కువగా చంపేస్తున్నారు. ప్రస్తుతం ఈ పక్షి జాతి అంతరించి పోయే దశకు
చేరుకుంది.