Home ఎడిటోరియల్ స్మృతి చెప్పిన అసత్యాలు… చెప్పని నిజాలు

స్మృతి చెప్పిన అసత్యాలు… చెప్పని నిజాలు

Smriti-Iraniహైదరాబాద్ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ సంక్షోభాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రతిపక్షదాడికి గురికావటంతో, మానవ వనరుల అభివృద్ధిశాఖామంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో చాలా దూకుడుగా సమాధానమిచ్చారు.
స్మృతి: దళిత స్కాలర్ రోహిత్ వేములను బహిష్క రించింది యు.పి.ఎ. ప్రభుత్వం నియమిం చిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.
వాస్తవం: ప్రొఫెసర్ ఆర్.పి.శర్మ తాత్కాలిక పదవీ కాలంలో 2015 సెప్టెంబర్‌లో, ఆయన కిందున్న ప్రోక్టోరల్ బోర్డు, రోహిత్‌ను బహిష్కరించాలని తొలిసారి నిర్ణయించింది. దర్యాప్తు జరుగుతున్నం దున దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత, బిజెపి నియ మించిన అప్పారావు పొదిలి కింద ఇసి ఉపసంఘం ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ తీసుకున్న తుది నిర్ణయం రోహిత్‌ను, మరో నలుగురిని హాస్టల్ నుంచి బహిష్కరించేందుకు దారి తీసింది.
స్మృతి: దళిత సభ్యుణ్ణి దర్యాప్తు కమిటీలోకి కో ఆప్టు చేసుకోవటం జరిగింది. (ఇది కమిటీలో దళిత సభ్యుడు ఎందుకు లేడన్న బిఎస్‌పి నాయకురాలు మాయావతి ప్రశ్నకు జవాబు).
వాస్తవం: ప్రకాశ్‌బాబు డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్‌గా కమిటీలో ఉన్నారేగాని, దళితునిగా కాదు. రోహిత్ మరణం, స్మృతి ఇరానీ పత్రికా గోష్టి దరిమిలా ఆయన అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతనుంచి తప్పుకున్నారు.
స్మృతి: తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, పోలీసులు సాయంత్రం 7.20కి రోహిత్ హాస్టల్ చేరుకున్నారు. రూం తెరిచి ఉంది, దేహం బల్లపై ఉంది. ఇది పోలీసులు చెప్పిన మాట. ఆ బిడ్డను బతికించే ప్రయత్నం చేయటానికి ఆ బిడ్డ వద్దకు డాక్టర్ని ఎవరూ అనుమతించలేదు. బదులు గా, ఆ మృతదేహాన్ని రాజకీయ పనిముట్టుగా ఉపయోగించుకున్నారు.
వాస్తవం: యూనివర్శిటీ హెల్త్ సెంటర్‌కు చెందిన డ్యూటీ డాక్టర్, పి.రాజశ్రీ సాయంత్రం 7.20కి రోహిత్ దేహాన్ని పరీక్షించారు. అతను మరణించి నట్లుగా 7.30కి ప్రకటించారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌నుంచి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపిన పోస్టుమార్టం దీన్ని పునరుద్ఘాటించింది; రోహిత్ సాయంత్రం 7.20కి చనిపోయినట్లు అందులో చెప్పబడింది.
మంత్రిణి ప్రకటనను యూనివర్శిటీ ఆఫ్ హైదరా బాద్ అధికారులు గురువారం నిరాకరించారు. జనవరి 17న రోహిత్ ఆత్మహత్య సమాచారం తెలిపిన వెంటనే డాక్టర్ హాస్టల్‌కు చేరినట్లు తెలిపారు.
డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి తన మెడికల్ రిపోర్టులో ఇలా చెప్పారు: “17-1-2016 సాయంత్రం 7.30 గంటలకు, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ రూం నెం.207లో ఒక విద్యార్థి సీలింగ్‌కు ఉరివేసుకున్నట్లు, ఫోన్‌కాల్ అందింది. స్టాఫ్‌నర్స్, అంబులెన్స్ డ్రైవర్‌తో వెంటనే హాస్టల్ చేరుకున్నాను. అప్పటికి దేహం బల్లపై ఉంచబడింది”. తాను ఐదు నిముషాల్లో హాస్టల్ చేరుకున్నట్లు, తాను కబురుపెట్టగా పోలీసులు 8 గంటలకు వచ్చారని డాక్టర్ రాజశ్రీ తనను వాకబు చేసిన మీడియాకు చెప్పారు.
స్మృతి: జెఎన్‌యులో కొందరు ఎస్‌సి/ఎస్‌టి విద్యా ర్థులు మహిషాసుర ఉత్సవం జరుపుకుంటూ కాళీ మాతను నీచంగా చిత్రించారు.
వాస్తవం: కొన్ని గిరిజన, ముఖ్యంగా సంతాల్ సాంప్రదాయంలో దుర్గ స్థానిక రాజు మహిషా సురుణ్ణి వలలో వేసుకున్న వేశ్య అనే భావం ఉంది. మహిషాసురుడు, రావణాసురుడు ఉత్సవాలు జరిపే చిన్న సాంప్రదాయాలు అసంఖ్యాకం ఉన్నాయి.
ఫిబ్రవరి 25న శ్రీమతి ఇరానీ రాజ్యసభలో ఇదే ప్రస్తావన తేగా, ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుళ్ళను జెఎన్‌యు చర్చలోకి తెచ్చేందుకు ఆమె ప్రయత్నానికి కాంగ్రెస్ ఎంపి ఆనంద్‌శర్మ నిరసన తెలిపారు.
మహిషాసురుడు కొందరికి ఆరాధ్యుడు
మహిషాసురునిపై మంత్రి స్మృతి ఇరానీ ప్రకటన పశ్చిమబెంగాల్‌లోని ఆదిమ తెగలకు రుచించలేదు. ఆర్యుల దండయాత్రనుంచి దేశాన్ని రక్షించటంలో అసురుల పాత్ర తెలుసుకోవటానికి మంత్రిగారు “చరిత్ర చదువుకోవాలి” అన్నారు ఆంత్రోపాలజిస్ట్ పశుపతి ప్రసాద్ మహతో. ప.బెంగాల్‌లోని గిరిజన జనాభాలో సంతాల్‌లు 50శాతంపైగా ఉన్నారు. ఈ తెగకు ప్రస్తుత మాఝి (అధిపతి) హెబ్రామ్. ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి. రక్షణమంత్రిత్వశాఖలో చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసి రిటైరైన, 80సంవత్సరాల హెబ్రామ్ ఇలా చెప్పారు ః పశ్చిమ బెంగాల్‌లో, ఒడిశా, జార్ఖండ్ ల్లోని కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులకు గొప్ప ఆరాధ్యుడు మహిషాసురుడు. అతను పౌరాణిక పాత్ర కాదు, చరిత్ర పురుషుడు. క్రీస్తు జనానికి పూర్వం ఇతర దేశస్తులను, అనగా ఆర్యులను ప్రతి ఘటించాడు. అతడు ఆర్యులను పలుమార్లు ఓడించగా, అతన్ని దగా చేయటానికి వారు (ఆర్యు లు) ఒక స్త్రీని పంపారు. దాంతో సమాజం ఓటమి పాలైంది. లేనట్లయితే, బెంగాల్ సహా తూర్పు భారత్ దేశీయసమాజాల నియంత్రణలో ఉండేది, అది ‘బోంగీదిశు’గా పిలవబడేది. శ్రీమతి ఇరానీ ప్రకటన ఖండనార్హం. వచ్చే ఎన్నికల్లో అది బిజెపిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
(ది హిందూ సౌజన్యంతో)
రెండు తప్పులు ఒకరైట్ కావు
రోహిత్ ఘటన తర్వాత కేంద్రప్రభుత్వం కనీసం విచారం వ్యక్తం చేస్తుందని భావించాను. అయితే ఎదురుదాడికి దిగింది. అది ఆత్మహత్య అని తొలుత అంది. ఆ తర్వాత రోహిత్‌ను అప్రతిష్ట పాల్జేస్తూ, అతడు దళితుడు కాదంది. అంతకన్నా ప్రమాదకరం గా పోటీవాదం ముందుకు తెస్తోంది. రోహిత్ సమస్యను ప్రశ్నిస్తే పశ్చిమబెంగాల్‌లో విద్యార్థులకు ఏమి జరిగిందో చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్నపుడు రాహుల్‌గాంధీ వారితో ఎందుకు మమేకం కాలేదు అని ఎదురు ప్రశ్నిస్తోంది. కశ్మీర్‌లో 2008లో అశాంతి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను కాల్చిచంపింది. అయితే అది ఈ ఘటనలో బిజెపి ప్రభుత్వ బాధ్యతను తప్పించదు – రెండు తప్పులు ఒకరైట్ కాజాలవు. అంతకన్నా దారుణంగా, ఈ సమాంతర వాదనను కొన్ని ఎంచుకున్న అంశాలకు ఉపయోగిస్తున్నారు. నిరసనలో భాగంగా ఇచ్చిన నినాదాలను దేశానికి సవాలుగా తీసుకుని, రోహిత్ వేముల ఆత్మహత్యలో సంస్థాగత పాత్రను విస్మరిస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు.

రోహిత్ వేముల తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయలేదని ఆమె అంటున్నారు.దళితుల దుర్భర స్థితిని ఎత్తిచూపుతూ అతను వైస్‌ఛాన్సలర్‌కు రాసిన తొలి ఉత్తరాన్ని ఆమె పరిగణనలోకి తీసుకో దలచలేదు. రోహిత్ ఘటన మంచి రాజకీయ లబ్దికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. అసలు ఆమె చర్యే రాజకీయం అవటానికి చింతిస్తున్నాను. యూరోపియన్ తత్వవేత్త సిసిరోను ఉట్టంకించి తమ విద్యావిషయక పరిజ్ఞానాన్ని ప్రదర్శించిన స్మృతి ఇరానీ, ఆయన ప్రసిద్ధ రచన ‘డ్రీమ్ ఆఫ్ సీపియో’ చదివి ఉంటారని నమ్ముతాను. అందులో ఆయన ఇలా చెప్పారు ః “ప్రజలమనే పేరు, ముసుగు తగిలించుకున్న గుంపునుమించిన ఆటవికమైన భూతం మరొకటి ఉండదు’ ఆమె దాన్ని చదివి వుంటే, కన్హయకుమార్‌ఫై దాడిచేసిన గుంపు ఆమెకు గుర్తుకొస్తారు. సిసిరో గాఢంగా విశ్వసించిన సూత్రా ల్లో ఒకటి కూడా ఆమెకు తారసపడి ఉండాలి ః “పదవిలో ఉన్న ఎవరూ దాని గూర్చి గాఢమైన భావం లేకుండా సఫలీకృతుడు కాలేరు…న్యాయం అనే దానిలో తోటి మనుషులకు ఎటువంటి హాని చేయకపోవటం, వారిని దూషించకుండా మర్యాద ఇవ్వటం ఉంటాయి.”
– లతీఫ్ అహ్మద్ దార్
(యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లోపొలిటికల్
సైన్స్ డిపార్టుమెంటులోపిహెచ్‌డి స్కాలర్)
(మూలం:  వైర్)

(“రోహిత్ వేములకు న్యాయం” ఉద్యమంలో నేనూ భాగం. కశ్మీర్‌కు చెందిన వాడినయినందున, దళిత ఉద్యమంతో నా సంబంధం హైదరాబాద్ యూని వర్శిటీలో ఉన్న ఆరేళ్లలో అడపాదడపాయె. అయితే రోహిత్ కేసు దాన్నంతా మార్చివేసింది. రోహిత్ సూసైడ్ నోట్ నా అంతరాత్మను కదిలించింది” అని అంటారాయన.)