Home లైఫ్ స్టైల్ మహా విషవలయంలో రైతు

మహా విషవలయంలో రైతు

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)  ద్వారా, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అమెరికా, యూరప్ దేశాలు ఈ పరిస్థితినే మన దేశంలో కోరుకుంటున్నాయి. మన వ్యవసాయ రంగానికి ఉన్న  కొద్ది పాటి సబ్సిడీలను, మద్దతు వ్యవస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను నామ రూపాలు లేకుండా చేసి పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టడమే ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైనది. 

  Farmer-Suicideతెలంగాణా రాష్ర్టం ఏర్పడినప్పటినుండీ 2017 మే10 వరకూ 2836 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు . ఇందులో 157 మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. (NCRB మరియు వార్తా పత్రికల కథనాల ప్రకారం) ప్రతి సంవత్సరం వేలాది మంది వ్యవసాయం వదిలేస్తున్నారు. వ్యవసాయ కుటుంబాలలోని యువతీ, యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. మొత్తం రాష్ర్టం లో 85 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. కుటుంబ సగటు అప్పు 93 వేల రూపాయలు (NSSO నివేదిక ). సాగుభూములు ఆహార ఉత్పత్తికి ఒక ప్రధాన వనరు. కోట్లాదిమంది గ్రామీణ ప్రజలకు జీవనోపాధికి మూలం. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏమిటంటే, గ్రామంలో ఉండి వ్యవసాయాన్ని కొనసాగించాలనుకుంటున్న, వృత్తిగా ఎంచుకుందామనుకుంటున్న చాలా మంది చేతిలో సాగు భూములు లేవు.

నిజంగా వ్యవసాయం చేద్దామనుకుంటున్న గ్రామీణ ప్రజల చేతిలో భూమి మిగలడం లేదు. అందుకే కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. కౌలు రేట్లపై నియంత్రణ కూడా లేదు. రైతు ఆత్మహత్యలలో 70 శాతం కౌలు రైతులవే. తెలంగాణ గ్రామీణ ప్రాంతం లో 57,06,101 కుటుంబాలు ఉంటే అందులో 32,88,938 కుటుంబాలకు (58 శాతం) అసలు భూమిలేదు. మరీ ముఖ్యంగా 3 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు .రాష్ర్ట జనాభాలో 15. శాతం దళిత జనాభా వుంటే, ఆ ప్రజలు సాగు చేస్తున్న భూమి విస్తీర్ణం 9.6 శాతం మాత్రమే. దళితులకు అసైన్డ్ చేసిన భూములను, ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందక ఆ వర్గాలు సాగుచేసుకోలేని, నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాయి.

6,81,169 ఆదివాసీ కుటుంబాలు ఉంటే, అత్యధికులు యిప్పటికీ పోడు వ్యవసాయం మీద ఆధారపడడం తప్ప వారికి సమగ్ర భూమి హక్కులు కల్పించబడలేదు . ఆదివాసీ ప్రాంతాలు ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య ఆదివాసీయేతరులు, చట్ట వ్యతిరేకంగా భూములను కొల్లగొట్టడం. రాష్ర్టంలో మహిళల చేతిలో ఉన్న కమతాలు 21.46 శాతం కాగా. వాళ్ళు సాగుచేస్తున్న విస్తీర్ణం 19. 54 శాతం మాత్రమే ( SECC నివేదిక) సాగుభూములను వ్యవసాయేతరులు కొనకుండా నిషేధం పెట్టి, గ్రామీణ భూమిలేని నిరుపేదలకు సాగుభూములు పంచితే తప్పకౌలు భారం తగ్గదు. కౌలు భారం తగ్గితే తప్ప రైతుకు మిగులు ఉండదు.

భూమి కోసం సాయుధ పోరాటం జరిగిన రాష్ర్టం లో పేదలకు భూమి కావాలనే ఉద్యమాలే ఆగిపోవడం విషాదం. రైతులకు పంట సాగు కోసం పెట్టుబడి బ్యాంకు రుణాల రూపంలో అందాలి. కానీ యిప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు లేవు. దళితులు, ఆదివాసీలలో ఈ సంఖ్య అధికం. 30 శాతం గ్రామీణ కుటుంబాలకు రుణ పరపతిలేదు. సంస్థాగత రుణాలు 45 శాతం కుటుంబాలకే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా వాణిజ్య బ్యాంకుల ద్వారా 16 శాతం, సహకార బ్యాంకుల ద్వారా 9.3 శాతం కుటుంబాలకు మాత్రమే రుణాలు దొరుకుతున్నాయి. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తున్న కుటుంబాలు 50.6 శాతం. అవసరమైన రుణ మొత్తంలో వీరు ఇస్తున్న అప్పులు 51 శాతం. ( తెలంగాణ సామాజిక ఆర్ధిక నివేదిక – రాష్ర్ట ప్రభుత్వం) కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్న దశలో వీరికి బ్యాంకు రుణాలు అందడం లేదు. 2011 లో చట్టం తెచ్చినా వీరికి గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు.

ప్రతి సంవత్సరం బ్యాంకులు స్కేల్ అఫ్ ఫైనాన్స్‌ను అట్టహాసంగా ప్రకటి స్తున్నా ఆమేరకు బ్యాం కుల నుండి రుణాలు రైతులకు చట్టబద్ధంగా అందడం లేదు. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల లో వచ్చిన మార్పుల కారణంగా వ్యవసాయం చేయని వాళ్ళు కూడా భూములపై తమకున్న హక్కు కారణంగా పంట రుణాలు పొందుతున్నారు. వ్యవసాయ కాలిక (టర్మ్) రుణాలు, అనుబంధ రుణాలు ఎక్కువగా వ్యాపారులకు, కంపెనీలకు అందుతున్నాయి . దీనివల్ల బ్యాంకులు రుణ పంపిణీలో తమ లక్ష్యాలను చేరుతున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ వాస్తవ సాగుదారులకు మాత్రం బ్యాంకు రుణాలు అందడం లేదు. పైగా ఈ రుణాలు పంటలకు అవసరమైన నెలల్లో ఇవ్వడం లేదు. ( SLBC నివేదికలు).

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సీజన్లన్నీ అతలాకుతలమైపోతున్నాయి. పంటల పొందికలో వచ్చిన మార్పులు, వ్యవసాయ విస్తర ణ వ్యవస్థ వైఫల్యం, మార్పులకు అనుగుణంగా స్పందించాల్సిన వ్యవసాయ పరిశోధనా సంస్థల నిష్క్రి యాపరత్వం, అన్నీ కలిసి రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమా పధకం యింకా ప్రయోగ దశలలోనే ఉంటున్నది. ప్రభుత్వాలు బీమా పధకాల గురించి ఎంత అట్టహాసంగా ప్రచారం చేసుకున్నా, క్షేత్ర స్థాయిలో యిప్పటికీ అది రైతులకు ధీమా ఇవ్వలేకపోయింది. సర్వే నంబర్ ప్రాతిపదికన అన్ని పంటలకూ పంటల బీమా వర్తించే విధానాలు రానంతకాలం బీమా పధకాల వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రాష్ర్టం కరువు బారిన పడిన సందర్భాలలో కూడా ప్రభుత్వం వేగంగా స్పందించి కరువు మండలాలను ప్రకటించడం లేదు . 2014లో తీవ్ర కరువు వున్నా కరువు మండలాలు ప్రకటించలేదు. 2015 ఖరీఫ్ లో కరువు మండలాలను ప్రకటించినా 2017 వరకూ ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లించలేదు. 2016-2017 రబీ లో తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితులు వున్నా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించలేదు. కౌలు భారంతో పాటు, అధిక దిగుబడి ఆశతో రైతులు విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులు, పురుగు విషాలు, కలుపు విషాలు, హైబ్రిడ్ విత్తనాలు, సాగునీటి కోసం బోర్లు, బావులపై పెడుతున్న ఖర్చులు, నిర్వహణా వ్యయాలు , యంత్రాల కిరాయిలు – అన్నీ కలిసి పంటల ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా పెంచుతున్నాయి.

రసాయనాల వినియోగంతో భూములు నిర్జీవమయ్యాయి. పర్యావరణం విషపూరితమయ్యింది. పంటల దిగుబడులు పడిపోతున్నాయి. రసాయనాల వినియోగం తగ్గించుకోకుండా, సేంద్రియ పద్ధతులతో భూములకు సత్తువ అందించకుండా, కంపెనీలపై ఆధారపడడం మానేసి స్థానిక విత్తన రకాలను కాపాడుకుని తమ విత్తనాలను తామే పండించుకోకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు. పంటల దిగుబడులు పెరగవు. జీవజాతుల, ప్రకృతి వనరుల ఆరోగ్యాలు బాగు కావు . బడా కంపెనీల కొమ్ముకాసే ప్రభుత్వాలు ఈ మాట రైతులకు ఎప్పుడూ చెప్పవు. కానీ రైతుల పక్షాన పోరాడే రైతు సంఘాలైనా ఈ విషయాలను గుర్తించి , తాము పని చేస్తున్న గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించకపోతే రైతుల పంట ఉత్పత్తి ఖర్చులు తగ్గవు. రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్చుకుని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలి. రైతులకు ఈ విషయాలన్నీ చెప్పి సరైన మార్గంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషిచేయవలసి ఉంటుంది.

కానీ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నర్తించే ప్రభుత్వాలు ఆ బాధ్యత వదిలేశాయి. ప్రజలకు అవసరమైన విద్య వైద్యం లాంటి ప్రాధమిక అవసరాలనుకూడా ప్రభుత్వం ఉచితంగా అందించకుండా ప్రయివేట్‌పరం చేయడంవల్ల గ్రామీణ ప్రజల జీవన వ్యయం బాగా పెరిగింది. ఇంటి రిపేర్లు /నిర్మాణం, ప్రతిష్టకు పోయి చేసే ఆడంబరపు వేడుకలు, మగవాళ్ళలో బాగా పెరిగిన మద్యం అలవాటు కూడా ఒక మేరకు గ్రామీణ కుటుంబాలు చితికిపోవడానికి కారణమ య్యాయి.దశాబ్దాలు గడిచినా, తమ వేతనాలు ఎంత పెరిగినా యింకా తమకు రూపాయికే బియ్యం రావాలని, 10 రూపాయలకే టమాటాలు, ఉల్లిగడ్డలు రావాలని కోరుకునే వినియోగదారుల మనస్తత్వం కూడా యిందుకు కారణం . రైతుల పంటలకు నిర్ణయించే కనీస మద్దతు ధరల విషయంలో తెలుగు రాష్ట్రాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. దానికి కారణం యిక్కడ పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉండడం. కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల ఖర్చుల నిర్ణాయక కమీషన్ ( CACP ) భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఆయా పంటలకు అయ్యే ఉత్పత్తి ఖర్చులను సేకరిస్తుంది. కేంద్రానికి మద్దతు ధరలను సిఫారసు చేసే ముందు 12 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

ఈ 12 రకాలలో 4 అంశాలు తప్ప మిగిలిన 8 అంశాలూ రైతులకూ, వ్యవసాయానికి ఎటువంటి సంబంధం లేనివి. కానీ ఆ అన్ని కారణాలనూ కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నది. పైగా CACP జాతీయ సగటు తీస్తుంది . ఫలితంగా తక్కువ ధరలు నిర్ణయించబడి, తెలుగు రాష్ట్రాల రైతులకు నష్టం జరుగుతుంది. ఉదాహరణకు తెలంగాణా రాష్ర్టంలో వరి పంట ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు 2083 రూపాయలని రాష్ర్ట ప్రభుత్వమే లెక్కించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది . కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1510 రూపాయలు మాత్రమే. మొక్కజొన్న క్వింటాలుకు ఉత్పత్తి ఖర్చు 1550 రూపాయలని రాష్ర్టం తేల్చింది. కంది పంట క్వింటాలు ఉత్పత్తి ఖర్చు 9805 రూపాయలని, పత్తి క్వింటాలు ఉత్పత్తి ఖర్చు 6299 రూపాయలని కేంద్రానికి నివేదించింది . కానీ కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ధర 1365 రూపాయలుగా, కందికి ధర 5050 రూపాయలుగా, పత్తికి 4160 రూపాయలుగా కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతి సంవత్సరం నివేదిక పంపి చేతులు దులుపుకుంటుంది తప్ప రాష్ర్ట స్థాయిలో బడ్జెట్ కేటాయించి ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు లాభసాటి ధరలను బోనస్ రూపంలో అందించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు.

అన్ని పంటల విషయంలోనూ యిదే జరుగుతున్నది. పైగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పంటల సేకరణ నుండి పూర్తిగా తప్పుకుంటున్నాయి . FCI ఇప్పటికే రంగం నుండి తప్పుకుంది. రాష్ర్ట ప్రభుత్వం కూడా మార్క్ ఫెడ్, పౌరసరఫరాల శాఖ, సహకార సంఘాల ద్వారా వడ్లు, కంది లాంటి కొన్ని ఉత్పత్తులను సేకరించింది తప్ప వాణిజ్య పంటలను క్వింటాలు కూడా కొనలేదు . దీనితో మార్కెట్‌లో వ్యాపారులు పసుపు, మిర్చి పంటల ధరలను పూర్తిగా పడేశారు . ప్రభుత్వాలు రంగంలోకి దిగి కొంత సరుకునైనా కొనగలిగితే పరిస్థితి యింత దారుణంగా ఉండేది కాదు. పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వాలు పనిగట్టుకుని ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని అర్థమవుతుంది, విద్య, వైద్య రంగంలో ఎలా ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలను ధ్వంసం చేశాయో , ప్రస్తుతం వ్యవసాయ రంగంలోనూ అదే పరిస్థితి కొనసాగు తున్నది.

ఈ స్థితిని ఆసరా చేసుకుని దేశ, విదేశీ బహుళ జాతి రిటైల్ సంస్థలు పంటల సేకరణకు రంగంలోకి దిగుతాయి. చిన్న వ్యాపారులను రంగం నుండి తప్పించి తామే మార్కెట్లపై గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ద్వారా, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అమెరికా, యూరప్ దేశాలు ఈ పరిస్థితినే మన దేశంలో కోరుకుంటున్నాయి. మన వ్యవసాయ రంగానికి ఉన్న కొద్ది పాటి సబ్సిడీలను, మద్దతు వ్యవస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను నామ రూపాలు లేకుండా చేసి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడమే ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైనది. విత్తనాలు, పురుగు మందులు, యంత్రాలు తదితర అంశాలను ఇప్పటికే ఈ కార్పొరేట్లు నియంత్రిస్తున్నాయి.

ఇప్పుడు సింజంటా, మొన్ సాంటో లాంటి సంస్థలు, ఆదానీ లాంటి బడా కంపెనీలు హెరిటేజ్ ,రిల యన్స్, మోర్, వాల్ మార్ట్, మెట్రో లాంటి రిటైల్ సంస్థలు మన వ్యవసాయ రంగ ఆర్ధిక స్థితిని శాశిస్తు న్నాయి.

కన్నెగంటి రవి
కన్వీనర్, తెలంగాణ రైతు జెఎసి,
9912928422.