Home జయశంకర్ భూపాలపల్లి మేడారంలో సమస్యల తిష్ట

మేడారంలో సమస్యల తిష్ట

Sammakka-Jatara

ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో ఈనెల 8 నుండి 11వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరను పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అలాంటివేమీ చేపట్టలేదు. సుమారు 10లక్షలకుపై చిలుకు భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం జాతర ప్రాంగణంలో అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

భక్తుల రద్దీని పురస్కరించుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను చేపట్టలేదు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు జంపన్నవాగు వద్ద కేవలం రెండు గదులను మాత్రమే ఏర్పాటు చేశారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు కేవలం నాలుగు ట్యాప్‌లను మాత్రమే అధికారులు అమర్చారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో స్నానం చేస్తేనే పుణ్య స్నానం ఆచరించినట్లుగా వారి నమ్మకం. అయితే ఈ మండమెలిగే జాతరకు ఇప్పటికి జంపన్నవాగులోకి చుక్క నీరు కూడా వదలలేదు. పై పెచ్చు కేవలం నాలుగు ట్యాప్‌లను మాత్రం ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.

భక్తులకు తాగునీటిని అందించేందుకు బోర్లను సైతం అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. గతంలోని బోర్లకు మాత్రమే నామమాత్రంగా మరమ్మతులు చేపట్టారు. జాతర సమీపంలోని మినీ వాటర్ ట్యాంకులకు సైతం మరమ్మతులు చేపట్టలేదు. ముఖ్యంగా జాతరకు వచ్చే మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాల లను ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇలా అయితే మండ మెలిగే పండుగకు వచ్చే భక్తులు తిప్పలు పడక తప్పదు. భక్తుల సౌకర్యార్థం సత్వరమే మేడారం పరిసరాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా జంపన్నవాగు లోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తున్నారు.