Home లైఫ్ స్టైల్ వద్దంటే పెళ్ళిసంబంధాలు

వద్దంటే పెళ్ళిసంబంధాలు

Vaddante-Pelli

బెంగళూరులో కృష్ణమోహన్ అనే ఒక పెద్దమనిషి 25సంవత్సరాల క్రితం పెళ్ళిసంబంధం కావాలని ఒక మ్యారేజీ బ్యూరోలో పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. అందగాడు, జేబునిండా జీతం వచ్చే ఉద్యోగి, మంచి కుటుంబ నేపథ్యం, సంస్కారం సంప్రదాయం ఉన్న పెంపకం అన్నీ ఊరించే అంశాలే కావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఎగబడ్డారు. అప్లికేషన్లమీద అప్లికేషన్లు వచ్చిపడ్డాయి ఆయనగారి బాక్స్‌కు. అందినవాటిలో మంచి సంబంధాన్ని తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్నారు. ఆయనగారి పెళ్ళి ఘనంగా కూడా జరిగిపోయింది. అనుకున్న పని అయిపోయాకా ఇంకా మ్యారేజిబ్యూరోతో పనేముంటుంది? అందుకే తన పేరును తీసేశాడు. సభ్యత్వాన్ని రద్దుచేసుకునిమూటాముల్లె కట్టేశాడు.
అయినా బ్యూరోవాళ్ళు ఆయన పేరును చిట్టాలోంచి తీయకపోవడంతో పెళ్ళయి పాతికేళ్ళవుతున్నా ఆయనకు సంబంధాలు వస్తూనే ఉన్నాయి. నిజం చెప్పొద్దూ… పెళ్ళికాక ముందు కన్నా పెళ్ళయ్యాకే మంచి సంబంధాలు ఎక్కువగా వచ్చిపడ్డాయి. సంబంధాలు బాగున్నాయి. పెళ్ళి కూతుళ్ళు కూడా బాగున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్న ఆ ఫొటోలను చూస్తే ఆయనగారి కన్ను చెదిరింది. ఒట్టు..! మంచి చదువు, నాలుగంకెల జీతం ఉన్న సంబంధాలు అనేకం ఉన్నాయి. నిజానికి ఈ క్వాలిఫికేషన్లేవీ ఆయన పెళ్ళి చేసుకున్నావిడికి లేవు. గతం తలచుకుని బాధపడడం తప్ప అన్‌డూ చేయలేను కదా అని మనసులో మూలిగిన సందర్భాలనేకం. పాపం పూర్ ఫెలో ఏం చేస్తాడు. ఆవిడగారు చూస్తే కొంపలంటుకుంటాయని భయపడ్డాడు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు.. ఇలా ఎన్నిసార్లు తుడిపేస్తున్నా అదే డెలిట్ కొట్టేస్తున్నా ఫొటోలు, వాటి వివరాలు ఇ-మైల్‌లోకి తుఫాన్ మైల్‌లా వచ్చిపడుతున్నాయి.
ఆయన భయపడినంతా అయింది. ఈ మధ్య ఆవిడగారు ఆయన ఇ-మైల్‌ను ఎందుకో చూసింది. ఆ సీన్ ఈయన అల్లంత దూరం నుంచి చూశాడు. ఇంకేముంది గుండె గుభేల్‌మంది. ఫినిష్.. కొంప కొలంబో అయిపోయిందనుకున్నాడు. ఇ-మైల్‌లో కుప్పలు తెప్పలుగా కనిపించిన సంబంధాలు, ఆడపిల్లల ఫొటోలు చూసి ఆవిడగారు మండిపడకపోగా ఎంతగానో ఆనందపడిపోయింది. ‘యావండోయ్..మన అబ్బాయికి ఎంత మంచి సంబంధాలొస్తున్నాయో..’ అంటూ ఓ కేక పెట్టింది. అది విన్న ఆయన గారికి నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదు. అవి నాకొచ్చిన సంబంధాలే..అంటే ఏం కొంపలంటుకుంటాయో అని ‘అవును అవును’ అంటూ వంతపాడాడు. వాటిని ఆవిడగారు అర్జెంటుగా షార్ట్‌లిస్ట్‌చేసి ఒక ఫోల్డర్‌లో పడేసింది. ఇంతలో వాళ్ళ అబ్బాయి రానే వచ్చాడు. ఒరేయి చిన్నకన్నా నీకు పెళ్ళిసంబంధాలొస్తున్నాయిరా..అంటూ గారంగా, గారాబంగా పిలిచింది. బ్యూరోలో చూడు నీ కోసం ఎంత మంది అమ్మాయిలు క్యూకట్టారో..అంటూ మిటికెలు విరిచింది. అబ్బాయిగారు మొహం ఎడమకు తిప్పాడు. అదేమిట్రా బుర్రలో ఎవరైనా ఉన్నారా యేంటి? అని అడిగింది. బుర్రలో కాదే నా మనసు బ్యూరోలో..అని ఫ్లోలో అనేయబోయి నాలుక్కరుచుకున్నాడు. మనసు బ్యూరో అంటే అందులో ఎందరున్నారంటుందని ఉలిక్కిపడ్డాడు. మొత్తానికి నానాహైరానా పడి తన ప్రేమ వ్యవహారం చెప్పాడు. చూస్తూ చూస్తూ మంచి సంబంధాలు వదులుకోలేక ఆవిడా, ఆయనా ఎంతగానో తెగబాధపడ్డారు. ఏం చేస్తాం..ఎవరి బాధ వారిది..!