Home కలం తెలంగాణ దేశ్యపద సౌరభం

తెలంగాణ దేశ్యపద సౌరభం

“అచ్చు” అనే దేశ్యపదానికి అనేక అర్థాలున్నాయి. అందులో ఒకటి “ముద్ర”. తెలంగాణలో “అబ్బా వాడు అచ్చు గుద్దినట్లే రాస్తడు. వాని అక్షరాలు ముత్యాలే!” అంటారు. ఇంకా “కార్బన్ పేపర్‌”ను “అచ్చుకాయిదం” అనే వ్యవహరిస్తారు. కార్బన్ పేపర్ ఆంగ్లపదం. కానీ “అచ్చుకాయిదం” అచ్చంగా తెలుగు దేశ్యం. “అట్లు”, “ఇట్లు’ అనే అవ్యయాలు తెలంగాణ పల్లె ప్రజల వ్యవహారంలో “అట్ల”, “ఇట్ల”, “ఎట్ల” అనే విధంగా పేర్కొనబడుతున్నాయి. అవి “అలా”, “ఇలా”, “ఎలా” అనే రూపాల్లో లేకపోవడం తెలంగాణ విశిష్టత. “అట్లు” మొదలైన మాటల్లోని “ట” కారం తెలంగాణలోని “అట్ల” మొదలైన  వాటిల్లో నిక్షేపంగా వుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం “అట్ల”ను “గట్ల” అనీ, “ఇట్ల”ను “గిట్ల” అనీ అనడం వుంది.

poetry

ప్రపంచంలో పలు భాషలున్నాయి. ఈ భాషల్లోంచి ఏ భాషను తీసుకొని సూక్ష్మంగా పరిశీలించినా అనేక ప్రత్యేకతలు గోచరిస్తాయి. అటువంటి ప్రత్యేకత పదాల్లో కనిపించవచ్చు. కొన్ని భాషలకు పదబంధాల్లో అగుపించవచ్చు. మరికొన్ని భాషలకు సామెతల ద్వారా ఆ విశిష్టత సాక్షాత్కరించవచ్చు. వాక్య నిర్మాణ పద్ధతులు కూడా భాషలకు వైశిష్టాన్ని కలగజేస్తాయి. ఇంకా కొన్నిభాషల్లోని పొడుపు కథల్లో ఆ విలక్షణత పొటమరించవచ్చు. అయితే తెలుగు భాషకుపై ప్రత్యేకతలన్నింటితో పాటు నాదసౌందర్యం కూడా వుంది.

ఈ విశిష్టతలు అన్నీ కూడా దాదాపుగా తెలంగాణ భాషలో నూటికి నూరు పాళ్లు వున్నాయి. పైగా మరో ప్రత్యేకత ఏంటంటే తెలుగులోని దేశ్యపదాల సౌరభం చెక్కుచెదరకుండా తెలంగాణ తెలుగులో నిలిచి వుండటం. “త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు” అని చిన్నయ్య సూరి వారి సూత్రం. నిజానికి అసలు సిసలు తెలుగంతాఈ దేశ్యాల్లోనే వున్నది. తత్సమ, తద్భవాలు వరుసగా సంస్కృత ప్రాకృతాల సమాలూ, భవాలూ. అన్యదేశ్యాలు తెలుగులోనికి ఇతర భాషల నుండి వచ్చి చేరిన బాపతు. నిజమైన తెలుగు అంటే దేశ్యాలకు సంబంధించిందే! ఈ దేశ్యపదాలు తెలంగాణ భాషలో ఈనాటికీ వ్యవహారంలో అద్భుతంగా ప్రయుక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో మరీ ముఖ్యంగా చదువు పెద్దగా రాని వారి నొళ్ళల్లో చక్కగా నానుతున్నాయి.

“ఈసారి వస్తే వచ్చినవ్ గని ఇటాంకల మల్ల గిట్ట వస్తివా నీ ఈపు ఇమానం మోత మోగుతది. అటాంకల ఎల్లిపో’ అనే వాక్యాలు తెలంగాణలో వున్నాయి. వీటిల్లో “ఇటాంకల”, “అటాంకల” ప్రత్యేక పరిశీలనార్హాలు. “ఇటాంకల” అంటే ఇటువైపు, ఇటు ప్రక్క. అట్లాగే “అటాంకుల’ అంటే “అటువైపు” అని అర్థం. మరి ఈ ఇటాంకలను ఎలా విడదీసుకోగలం ఆ పిదప ఎలా వివరించుకోగలం? ఇటు+ అంకల = ఇటాంకల. “అంక” అంటే ప్రక్క, పార్శము అని చక్కగా తెలుగు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. ఈ నైఘంటిక పదాలు నిఘంటువులు తెలియజేస్తున్న అర్థాల్లోనే తెలంగాణలో ప్రయోగించబడటం ఒక ప్రత్యేకతే! పండ్ల అంగట్లో కనిపించే “అంగూర్ల”ను ఇటీవల తెలంగాణలో ద్రాక్ష పళ్ళు అంటున్నారు గానీ పల్లెల్లో జనం మాత్రం “అంగూర్లు” అనే పలుకుతారు. “ద్రాక్ష” సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదం. “అంగూరు” శబ్దరత్నాకర కారుడి అభిమతం ప్రకారం దేశ్యం. “అందుపాటు” అనే దేశ్య పదం తెలంగాణలో. “అందుబాటు”గా మారిన రూపంలో వుంది. ఇతర తెలుగు ప్రాంతాల్లో “అందుబాటు”గా అగుపిస్తున్నది.

ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్లి రోజే అత్తవారింటికి అమ్మాయిని పంపుతారు. దీన్నే “అప్పగింతలు” అని కూడా అంటారు. అయితే తెలంగాణలో ప్రత్యేకంగా ఈ ఘట్టాన్ని “అంపుకాలు” అని సైతం వ్యవహరిస్తారు. “అంపకం” అంటే పంపుట, ప్రేషణము అని అర్థాలు. అటువంటి అంపకమే బహువచన ప్రత్యయాతమై “అంపకాలు” అయ్యింది. తెలుగులో “అటు” అనే ఒక అవ్యయం ఉంది. ఇది వృత్తాంతాన్ని చెప్పడానికి ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకు “ఒక రాజుట. ఆయనకు ఏడుగురు కొడుకులట” ఇట్లా. అయితే చిత్రంగా ఈ “అట” తెలంగాణలో “అట” రూపంలోనూ, ఇంకా “అంట” రూపంలోనూ ప్రయోగించబడుతున్నది. “ఇగో ఒక రాజంట. ఆయనకు ఏడ్గురు కొడుకులంట” ఇత్యాది. తెలంగాణలోని “అంట”లో నిండుసున్న ఉన్నది. అంటే “అంట” కన్న చాలా ముందరి రూపం ఈ “అంట”.

“అచ్చు” అనే దేశ్యపదానికి అనేక అర్థాలున్నాయి. అందులో ఒకటి “ముద్ర”. తెలంగాణలో “అబ్బా వాడు అచ్చు గుద్దినట్లే రాస్తడు. వాని అక్షరాలు ముత్యాలే!” అంటారు. ఇంకా “కార్బన్ పేపర్‌”ను “అచ్చుకాయిదం” అనే వ్యవహరిస్తారు. కార్బన్ పేపర్ ఆంగ్లపదం. కానీ “అచ్చుకాయిదం” అచ్చంగా తెలుగు దేశ్యం. “అట్లు”, “ఇట్లు’ అనే అవ్యయాలు తెలంగాణ పల్లె ప్రజల వ్యవహారంలో “అట్ల”, “ఇట్ల”, “ఎట్ల” అనే విధంగా పేర్కొనబడుతున్నాయి. అవి “అలా”, “ఇలా”, “ఎలా” అనే రూపాల్లో లేకపోవడం తెలంగాణ విశిష్టత. “అట్లు” మొదలైన మాటల్లోని “ట” కారం తెలంగాణలోని “అట్ల” మొదలైన వాటిల్లో నిక్షేపంగా వుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం “అట్ల”ను “గట్ల” అనీ, “ఇట్ల”ను “గిట్ల” అనీ అనడం వుంది.

“వాడు అత్తర బుత్తర పనులు చేస్తడు” అనే తెలంగాణ వాక్యంలోని “అత్తర” పదం “అత్తరం’ నుండి వస్తే, “బుత్తర” అనే మాట “బిత్తరం” నుంచి ఏర్పడింది. మరి అత్తరము అంటే తొందర. బిత్తరము అంటే చంచలము. ఇప్పుడు అత్తరబుత్తర పనులకు అర్థం బాధపడుతుంది. వాడెవడో త్వరత్వరగానూ, నిలకడ లేకుండానూ పనులు చేస్తాడన్నమాట. తెలుగులోని “బుత్తరమే” కొన్ని సందర్భాల్లో “బిత్తరపోయాడు బిత్తర చూపులు చూశాడు” వంటి వాక్యాల్లో నిలుచుంటే, తెలంగాణలోని “బిత్తిరి పోరడు బిత్తిరి సత్తిగాడు బిత్తిరి బిత్తిరి చేస్తడు” మొదలైన వాక్యాల్లో ఈ పదం నిలిచి వుంది.

ఇక “అదురు” అనే దేశ్య పదానికి అర్థం “చలించు” అని. ఈ అర్థమే తెలంగాణలో “భూమి అదిలింది” అనే వాక్యంలో చక్కగా అమరి వుంది. “భూకంపం”, “భూమి కంపించింది” అనే మాటలకు బదులు “భూమి అదులుడు”, “ భూమి అదిలింది” అనే విధంగానే తెలంగాణలో వ్యక్తపరుస్తారు. “అదురు” పదమే “అదులు” అయ్యింది. అదురులోని “రు” క్రమంగా చలించి కదిలి “లు” అదులులో ఉంది.

“అన్న” మరో దేశ్యపదం. దీనికి ‘అయ్య” చేర్చి ‘ అన్నయ్య’గా పలకడం ఇటీవల పరిణామం. అయితే తెలంగాణలో ఇప్పటికీ గ్రామీణుల భాషలో “అన్న” అన్న పదమే ప్రయోగంలో వుంది. ఇక “అరయు” అనే దేశ్య క్రియను అరయ వలసివున్నది. “అరయు” అంటే విచారించు, వెదకు అనేవి శబ్దరత్నాకర కర్త. అర్థాలు చెప్పినా ఆ పదానికి మరికొన్ని వివరణలు చెప్పుకోవలసి వుంది. అరయు అంటే తెలుసుకొను, మర్యాదచేయు, దేహశుద్ధి చేయు యిత్యాది అర్థాలు సైతం తెలంగాణలో వున్నాయి. “వాన్నిమంచిగ అర్సుకోండ్రి” అంటే ఎన్ని అర్థాలు స్ఫుర్తిస్తాయో మరి! నిఘంటువుల్లోని “విచారించు” అనే క్రియలోనూ అన్యాపదేశంగా ఈ అర్థాలన్నీ తోచకమానవు. ఇవాళ అందరూ “గది” అనే మాటను వాడుతున్నారు గానీ తెలంగాణలో మాత్రం పల్లీయులు “అర్ర” అనే అంటుంటారు. దేవునర్ర దొంతులర్ర ఇట్లాంటి మాటలన్నీ తెలంగాణవే! నిజానికి ఈ “అర్ర” తమిళంలోని “అపై” నుంచి వచ్చింది. తెలుగు లేదా తెలంగాణ భాషలోని దేశ్యపదాలకూ, సోదర ద్రావిడ భాషల్లోని కొన్ని పదాలకూ ఇలాంటి సామీప్యం వుంది.

కౌగిలించుకొను, పరిష్వంగములోనికి తీసుకొను, ఆశ్లేషించుకొను, వాటేసుకొను మొదలైవన్నీ ఏకార్థ బోధకాలు కదా! మరి ఈ అర్థంలో తెలంగాణలో ఏమి వుంది? “అలుముకొను” అనేది ఉంది. నిజానికి ఈ అలుముకొను చక్కని దేశ్యం. ఇది “అలుముకొను” నుండి ఉత్పన్నమైన పదం. కౌగిలించుకొను” అనేది వైకృతం. అది తెలంగాణలో “కావలిచ్చుకు” అనే రూపంలో వుంటుంది. తెలంగాణలోని అలాయిబలాయి తీసుకునుడు మరో సందర్భానిది. తెలంగాణ ప్రాంతంలో పెండ్లి అయినంక పెండ్లి పిల్లవాడు “అలుగపోతాడు”. మరి ఈ “అలుగ పోవుడు” ఏమిటి? “అలుక” అంటే కోపం. మామగారు పెండ్లిలో తనకు పెట్టిన కట్నకానుకలు సరిపోలేదని ప్రత్యేకంగా యిలా అలుగపోతాడు. అది పెండ్లిలో ఓ ఆచారం. ఎదుర్కోళ్ళు, మైలపోలు, మంగళసూత్రధారణ, సప్తపది వంటి ఒక తంతు, ఈ “అలుగ పోవుడు”. పూర్వం సత్యభామ లాంటి వాళ్ళు కోపగృహాల్లో అలకమంచం ఎక్కేవాళ్ళు మరి!

“అవిటి” అంటే అంగవిహీనుడు, దివ్యాంగుడు. చాలా చక్కగా తెలంగాణలో “ ఆ పిల్లగానికేంది ఎంత మంచిగున్నడు. ఓ కన్నవిటా, చెవ్వి అవిటా” అని అంటూ వుంటారు. అంటే, ఆ అబ్బాయి ఎంచక్కా వున్నాడు, అతడేమైనా అంధుడా, బధిరుడా అని అర్థం. అంధత్వానికీ, బధిరత్వానికి కన్నవిటి, చెవ్వవిటి మంచి దేశ్య పదాలు వరుసగా.

సాధారణంగా పుండ్లు అయినప్పుడు గానీ, బొబ్బలు శరీరం మీద లేచినప్పుడు గానీ, పొక్కులు వంటివి పొటమరించినప్పుడుగానీ వాటికి చీము పట్టడం సహజం. ఆ చీము ఉన్నంతసేపూ తడతడమనే నొప్పి సల్పుతూ వుంటుంది. ఆ నొప్పి పోవడానికి సూదిని తీసుకొని పుండ్లు బొబ్బల్ని గుచ్చి అవియింపజేస్తారు. నిజానికి “అవియు” అంటే పగులు అని అర్థం. బొబ్బల్ని పగుల చేయడం తెలంగాణలో ఈ “అవియించడం’.“అవ్విచ్చుడు” రూపంలో వుంది. సూది వంటి వాటితో వ్రణాదుల్ని “అవ్విస్తేనే” నొప్పి పోతుంది. చీము కారిపోయి ఈ “అవ్విచ్చుడు” దేశ్య క్రియ “అవియు” ఒక్క ప్రేరణార్థకం. ప్రామిసరీ నోటును తెలంగాణలో “రోకకాయిదం” అని పేర్కొంటారు.ఈ కాగితంలో నెల వొక్కంటికి ఇంత వడ్డీ (మిత్తి) చొప్పున నిర్ణీత కాలానికి “అసలు”తో సహ అప్పు తీర్చగలనని అప్పు తీసుకున్నవాడు షావుకారుకి రాసిస్తాడు. ఇక్కడ “అసలు అన్నది మూలధనం. పెట్టుబడి అదే “మొదలు” అదే “షావుకారి ముల్లె” దాని మీద వచ్చేది వడ్డీ. ఈ “అసలు” పదం అసలు సిసలు దేశ్యపదం.

ఈనాటి తెలుగులో చాలామంది “ఆడపడుచు” అనే మాటను ఆయా అవసరమైన సందర్భాల్లో వాడుతూ వున్నారు. నిజానికి “ఆడపడుచు” అంటే కూతురు అని అర్థం. కానీ, వీళ్ళు మగనితోడ పుట్టినది అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం నూటికి తొంబై మంది “ఆడ బిడ్డ” అని వ్యవహరిస్తారు ఈ అర్థంలో. అందుకేనేమో శబ్దరత్నాకర నిఘంటుకారుడు సైతం “ ఆడబిడ్డ” అంటే కూతురు , మగనితోడ పుట్టినది అని రెండు అర్థాలు ఇచ్చాడు. ఆ నైఘంటిక పదమే తెలంగాణలో ఉండడం విశిష్టత. మొత్తం మీద చూసినప్పడు తెలుగు భాషల్లోని దేశ్య పదాల్లో వందలూ, వేలు ఈనాడు తెలంగాణలో యుక్తంగా ప్రయుక్తం కావడం విశేషమే మరి.

ఈ దేశ్య పదాలు ఇతర తెలుగు ప్రాంతాల్లో దాదాపు యుక్తమైన తెలంగాణలో ప్రజల వ్యవహారంలో నిక్షిప్తమయ్యాయి. దాదాపు తెలుగుదనమంతా చిన్నయసూరి చెప్పిన దేశ్యపద సూత్ర వివరణలో ఇచ్చిన ఊరు, పేరు, ఇల్లు, ముల్లు, కోట,పేట, దూడ, మేడ, కోత, లేత, తావి, మోవి ఇత్యాది పదాల్లోనే వుంది. అందుకే ఆయన “ఇత్యాదులరయునది” అని ముగించాడు సూత్రాన్ని. “అరయునది” అంటే విచారించునది, వెదకునది అని అర్థాలు. మనం ఎంత వెతికితే, విచారిస్తే తెలుగు ప్రజల దైనందిన భాషా వ్యవహారాల్లో ఈ దేశయ పదాలు అంతగా కనిపిస్తాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె సీమల్లో ప్రజల నోళ్లల్లో వందలాది దేశ్య పదాలు నూటికి నూరుపాళ్ళ తెలుగుదనంతో అలవోకగాఅలరారుతుంటాయి. “ చేసుకున్నోడికి చేసుకున్నంత” అన్నట్లు “తోడుకున్నవాళ్లకు తోడుకున్నంత”గా తెలంగాణ భాషా కూపంలోంచి దేశ్యపదాలు తియ్య తేనియ జలాలై దోసిట్లోకి వస్తాయి.

డా.నలిమెల భాస్కర్ 9704374081