Home జోగులాంబ గద్వాల్ సమస్యల చెంత…. గద్వాల సంత

సమస్యల చెంత…. గద్వాల సంత

Bazar

గద్వాల న్యూటౌన్: జోగులాంబ గద్వాల జిల్లా కేంక్రదానికి వివిధ పనులపై వచ్చే గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో  జరిగే సంతలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తేరుమైదానంలో, ప్రధాన రోడ్ల మీద, రాజీవ్ చౌక్‌లో కొంత బాగంలో ఈ సంతను నిర్వహిస్తున్నారు. దశాబ్ధాల తరబడి ఈ సంత జరుగుతోంది. పాలకులు మారుతున్నా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. కనీస వసతులు కూడా కల్పించడం లేదని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా పరిధిలో ఉన్న వివిధ మండాలల నుంచి వచ్చే గ్రామస్థులు, రైతులు గద్వాల పట్టణానికి చేరుకొని తమకు కావలసిన వస్తువులను, సరుకులను కొనుగోలు చేస్తుంటారు. దీనిలో భాగంగా రైతులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా వస్తుంటారు. సంతలో కావలసిన వస్తువులు ఏర్పాటు చేస్తుంటారు. తేరుమైదానంలో చిన్న చిన్న అంగళ్లను, టెంట్‌లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తుంటారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా కూడా పలు వ్యాపారాలు సాగిస్తుంటారు. ముఖ్యంగా పంట పొలాలకు కావాల్సిన ఉత్పత్తులు, బట్టలు, కుండలు, కూరగాయలు, ఫ్యాన్సీ స్టోర్‌లు, కోళ్లు, గొర్రెలు, పశువులు, వంట సామగ్రి వంటివి చౌకగా దొరకుతుండటంతో అందరు సంతకు వెళ్లటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగే ఈ సంతకు వేలాది మంది వస్తూ వెళుతూఉంటారు. రకారకాల వ్యాపారాలను సాగించే వ్యాపారులు మున్సిపల్‌కు ఆదాయం వచ్చేలా దోహదం అవుతున్నా సంతలో కనీస అవసరాలు ఏర్పాట్లు చేయకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలలు ఏర్పాటు లేదు. తాగునీరు సదుపాయం లేదు. తమ వెంట తెచ్చుకున్న వస్తువులకు బధ్రత లేదు. ఎండ, గాలి, వానల నుంచి రక్షణ లేక ఇబ్బందులు ఏర్పడుతున్నవి. చాలా సందర్భాల్లో వర్షంలో తడిసి పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గద్వాల పాలకులు వెంటనే స్పందించి అవసరమగు సదుపాయాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.