Home భద్రాద్రి కొత్తగూడెం ఖేల్ ఖతం!

ఖేల్ ఖతం!

క్రీడా పాఠశాలలో కానరాని ఆట,

నల్ల బజారులో దుస్తుల విక్రయం!

పుట్టకతోనే అడవి తల్లి ఒడిలో ఆటలాడుకునే గిరిజన పిల్లలు పాలు మాని పాకుడు పట్టి బుడిబుడి నడకలు వేస్తుండగానే వెదురు కర్రతో తయారు చేసిన విల్లంబు పట్టుకుని తమ గ్రామ అటవీ సమీపాల్లోకి వెళ్లి బాణం పట్టి వేట ప్రారంభిస్తారు. బడి ఈడుకు రాగానే పలక సంచిని తగలించుకుని నడుచుకుంటూ పాఠశాలకు వెళుతూ దారిలో చేతికందిన రాయిని తీసుకుని చెట్లమీద ఉండే పిట్టలను కొండుతుంటారు. ఇలాంటి సహజ సిద్ధ గురి నైపుణ్యం ఉన్న వారికి క్రీడల్లో చక్కటి తర్ఫీదు నందిస్తే వారు మట్టిలో మాణిక్యాలుగా రాణించడం ఖాయం. గిరిపుత్రుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనే గొప్ప లక్షంతో ఐటిడిఎ పాల్వంచలో క్రీడా పాఠశాలను నెలకొల్పింది. కానీ అక్కడ పరిస్థితి దీనికి విరుద్ధంగా జరుగుతోంది. క్రీడా పాఠశాలలో ఖేల్ ఖతమవుతోంది.

Residential

పాల్వంచ: గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యా లను పెంపొందించేందుకు ప్రభుత్వం ఐటిడిఎ ఆధ్వర్యం లో క్రీడా పాఠశాలలను
ఏర్పాటుచేసి అన్ని రకాల సదు పాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అందుకు ప్రత్యేకంగా ఇటీవల పాఠశాల ఆవరణలో రూ. 65 లక్షల ఖర్చుతో కోకో, రన్నింగ్ ట్రాక్స్, ఆర్చరీ, కబడ్డీ తదితర కోర్టులను నిర్మించారు. కానీ కొందరు ఉపాధ్యాయుల అలసత్వంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. విద్యార్థులకు క్రీడ ల్లో శిక్షణ ఇచ్చి క్రీడా నైపుణ్యాలను పెంచాల్సిన క్రీడా ఉపాధ్యాయులు నిర్లక్షంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మండల పరిధి కిన్నెరసాని గిరిజన బాలుర ఆశ్రమ క్రీడా పాఠశాలలో 3 నుండి తరగతు లకు వరకు 370 మంది విఉపాధ్యాయులు చదువుతున్నారు. వీరిలో మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఉండగా వారిలో ఆరుగురు పిఇటి లే ఉన్నారు. కానీ విద్యార్థులను సరిగా పట్టించుకోక విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఆడిందే ఆటగా సాగుతోంది.

కానరాని సమయపాలన..

ఉదయం 5 గంటలకు పిల్లలను ఆటలకు తీసు కెళ్లాల్సిన వ్యాయామ ఉపాధ్యాయులు 9 గంటలకు గాని పాఠశాలకు రాకపోవడం గమ నార్హం. పిఇటి రాకపోవడంతో పిల్లలే గ్రౌండ్‌కు వెళ్లి వ్యాయామాలు, రన్నింగ్ వంటివి చేసుకుని వస్తున్నామని వారి గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యా యులు ఆర్చరీతో పాటు పలు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారని ప్రస్తుతం ఉదయం నుండి సా యంత్రం వరకు చదువించడంతో సరిపెడుతు న్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.

నల్ల బజారుకు క్రీడా దుస్తులు…

ప్రభుత్వ గిరిజన పాఠశాల విద్యార్థుల కొరకు పలు కెటిపియస్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు విద్యార్థులకు క్రీడా దుస్తులు అందిస్తుంటారు. కానీ ఆ దుస్తులను సిబ్బంది నల్లబజారులో విక్రయిస్తున్నారని వినిపిస్తోంది. దుస్తులు ఇమ్మని విద్యార్థులు అడిగినప్పుడు మీట్‌లకు వెళ్ళినప్పుడు ఇస్తామని చెప్పి ఇంత వరకు కూడా ఇవ్వడం లేదని విద్యార్థుల నుండి వినిపిస్తుంది. స్థానికంగా ఉండని ఉద్యోగులు.. విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఉపాధ్యాయులకు క్వార్టర్లు నిర్మించింది. కానీ వాటి ల్లో సగం మందికి పైగా ఉండటం లేదని సమాచారం. పేరుకు క్వార్టర్లు తీసుకుని పాల్వంచ నుండే రాకపోకలు సాగిస్తున్నారని వినిపిస్తోంది.

అమలుకాని మెనూ…

విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దే శ్యంతో ప్రభుత్వం సన్నబియ్యంతో పాటు పలు సరుకులు అందిస్తుంది. కానీ హాస్టల్‌లో మెనూ అమలు కావడంలేదని తెలుస్తుంది. మెనూ ప్రకారం వడ్డించడం లేదని, అధికారులు తణి కిలకు వస్తున్నారనే సమాచారం ఉన్నప్పుడు మాత్రం మెనూ ప్రకారం పెడుతున్నారని మిగిలిన రోజుల్లో నీళ్లచారు, ఉడికీ ఉడకని అన్నం, తక్కువ ధరలకు దొరికే కూరగాయలను వడ్డిస్తు న్నారని విద్యార్థుల నుండి వినిపిస్తుంది.

హాస్టల్‌లోనే మద్యం…

రాత్రి వేళల్లో భోధనా, బోధనేతర సిబ్బంది హాస్టల్‌లోనే మద్యం సేవిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో మద్యం తెప్పించుకుని, సప్లయర్స్‌గా వాడుకుంటున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి.

విద్యార్థులకు బెదిరింపులు…

పాఠశాలలో జరిగే ఆగడాలను ఎవరికైనా చెబితే మీ భరతం పడతామని బెదిరింపులకు పాల్పడు తున్నారని 8,9 తరగతులు చదివే విద్యార్థులు. తమ పేర్లను మాత్రం బయటకు చెప్పవద్దని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా గిరిజన అభి వృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో జరిగే తతంగంపై దృష్టిసారించి గిరిబిడ్డల భవిష్యత్‌ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాగా ఈ విషయమై..

ఎటిడిఒ లక్ష్మణ్‌బాబును వివరణ కోరగా… పాఠశాలలో ఉన్న కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. విచారణ జరుపుతామని, నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.