Home జాతీయ వార్తలు జవాను మృతదేహం ముక్కలు

జవాను మృతదేహం ముక్కలు

పాక్ సైనికుల అండతో సరిహద్దుల్లో రెచ్చిపోయిన ముష్కరులు
భారత్‌లో ఆగ్రహావేశాలు

Soldiers

శ్రీనగర్/కురుక్షేత్ర : నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ యధేచ్ఛగా కాల్పులకు పాల్పడుతోంది. ఒకవైపు పాక్ ఉగ్రవాదులు, మరోవైపు పాక్ సైన్యం విచక్షణారహితం గా భారత సైనికశిబిరాలపై, జనావాసాలపై జరుపుతున్న కాల్పుల్లో తాజాగా నలుగురు భారత సైనికులు, ముగ్గు రు బిఎస్‌ఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆర్‌ఎస్‌పురా, కథువా, పూంచ్, రాజౌరి, కుప్వారా జిల్లాల్లో పాక్‌సైనికులు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పాక్ సైనికుల అండతో కుప్వారా జిల్లా మచిలీ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు డ్యూటీలో ఉన్న భారత సైనికుడు మనదీప్‌సింగ్‌ను హత్య చేసి అతడి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు. అనంతరం పాక్ సైనికుల అండతో మళ్లీ పాక్‌లోకి తప్పించుకుపోయారు. దీనిపై భారత్‌లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఇక మచిలీ సెక్టార్‌లో శనివారం శత్రుసైనికులను ఎదుర్కొంటున్న క్రమంలో ఆయుధం పేలి బిఎస్‌ఎఫ్ జవాను నితిన్ సుభాష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరణించాడని బిఎస్‌ఎఫ్ ఐజి వికాస్ చంద్ర తెలిపారు. నితిన్ మహారాష్ట్రలోని సాంగ్లికి చెందినవాడు. శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒక మిలిటెంట్ కూడా చనిపోయాడని ఆయన చెప్పారు. జనావాసాలపై పాక్ మోర్టార్ షెల్స్‌తో దాడి చేయగా ఇద్దరు పౌరులు మరణించారని ఆయన వివరించారు. పాక్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన అన్నా రు. గత కొద్దిరోజులుగా నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లం ఘనలను భారత్ తిప్పికొడుతోందని, 15 మంది పాక్ సైనికులు మరణించడంతో పాక్ మరింత రెచ్చిపోయిందన్నారు.
ఒక తలకు పదితలలు తీసుకోవాల్సిందే
ఉగ్రవాదుల చేతులో చిత్రవధకు గురైన వీరసైనికుడు మన్‌దీప్‌సింగ్ స్వగ్రామమైన కురుక్షేత్ర సమీపంలోని ఆంధేరిలో ప్రజల ఆగ్రహావేశాలకు అంతులేదు. పాకిస్తా న్‌కు ధీటైన జవాబు చెప్పాల్సిందేనని స్థానికులు డిమాం డ్ చేశారు. మన్‌దీప్ కుటుంబసభ్యులను, ముఖ్యంగా అతని భార్య ప్రేరణను ఓదార్చడం ఎవరితరమూ కాలే దు. వార్త వినగానే పెద్దసంఖ్యలో జనం, అధికారులు, నాయకులు వారి ఇంటికి చేరుకున్నారు. రెండేళ్ల కిందటే వివాహమైన మన్‌దీప్‌కు ఇద్దరు కుమారులున్నారు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చిన అతడు మళ్లీ దీపావళికి రావల్సి ఉంది. సరిహద్దులో ఉద్రిక్తంగా ఉండడంతో సైన్యం అతడి సెలవులను రద్దు చేసింది. ఇంతలోనే ఈ దుర్వార్త వినవలసి వచ్చిందని ప్రేరణ కన్నీరుము న్నీరుగా విలపిస్తుంటే ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆమె హర్యానా పోలీసు విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.తన భర్తను దారుణంగా చంపినవారిపై ప్రతీకార తీర్చుకోవాల్సిందేనని ఆమె అంటోంది. తన కుమారుడు దేశం కోసం చేయాల్సింది చేశాడు. ఇక ప్రభుత్వం చేయాల్సిన ప్రతీకారం మిగిలే ఉందని అతడి తండ్రి వ్యాఖ్యానించాడు.

గట్టిగా బదులిస్తాం ఎవరికీ తలవంచేది లేదు : రాజ్‌నాథ్
న్యూఢిల్లీ : పాక్ సైన్యం కవర్ ఫైరింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వచ్చి భారత సైనికుడు ఒకరిని చంపి, అతడి దేహాన్ని ముక్కలుముక్కలుగా నరికిన ఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ఈ ఘటన కు భద్రతాదళాలు పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తాయని చెప్పారు. ఎవరి ముందూ తలవంచేది లేదని స్పష్టం చేశారు. దేశవాసులంతా దీపావళి పండుగ జరుపుకొంటుంటే.. భద్రతాదళాలు మాత్రం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడటంలో నిమగ్నమయ్యాయని, వారివల్లే ఈ పండుగను జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. శత్రువుల కుటిల వ్యూహాలను భగ్నం చేస్తున్న సైనికదళాల పట్ల ప్రజలంతా విశ్వాసం ఉంచాలని కోరారు. భారత సైనికుడిగ తలనరికివేతపై సైన్యం కూడా స్పందించింది. తగిన స్థాయిలో సమాధానం ఇచ్చి తీరుతామని హెచ్చరించింది.