Home లైఫ్ స్టైల్ గణపతి మహాగుణపతి

గణపతి మహాగుణపతి

మేమేది కోరితే మామేలు కలుగునో ఆమేలు మాకిచ్చి మమ్మేలుకోవయ్య..
ఓబొజ్జ గణపయ్య, నీబంటు నేనయ్య మేలైన వాటినే కోరేటి వానిగా
నాబుర్రలో నీవు బజ్జుండవయ్యా….

Maha-Ganapathi9

సిద్ధి బుద్ధులను భార్యలనుగా కలిగి మూలాధారానికి అధిష్టానమైన గుణపతి గణపతి. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే… అని సృష్టి చేయకముందు బ్రహ్మ గణపతిని పూజించి సృష్టి చేయడం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. మనం విన్న కథకు ఈ పురాణ కథకు ఇంత తేడా ఉందేంటి? సృష్టికి ముందే గణపతి ఉంటే పార్వతి దేవి ప్రాణంపోసిన గణపతి ఏమయ్యాడు? గణపతి పార్వతీ తనయుడు కాడా? కాకపోతే మరి ఈయన ఎవరు? మూలాధారశక్తికి అధిష్ఠానంగా ఉన్న గణపతి వేరు ఈయన వేరా?

  • సృష్ట్యాదిలో పూజలందుకున్న గణపతి అవతారమే అసలు గణపతి. ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. మూలాధారుడైన గణపతికి ప్రకృతి స్వరూపమైన పార్వతి ప్రాణంపోసింది. గణపతిని ప్రకృతిలో లభించే వేరువేరు ఔషధగుణాలు ఉన్న ఏకవింశతి పత్రితో పూజ చేస్తున్నాం. ఆ పత్రిలోని ఔషధగుణాలతో ఆరోగ్యం కలుగుతుంది. ఆ ఔషధాలను గుర్తించే జ్ఞానం పొందాలంటే ప్రకృతితో సన్నిహితంగా ఉండాలి. ప్రకృతిని కాపాడుకోవాలి.
  • లక్ష్మీ స్వరూపమైన డబ్బుని లక్ష్మీ స్వరూపంగా పూజించాలి. మంగళద్రవ్యాలైన పూలు మొదలైన వాటిని భగవంతుని అలంకరణలకు వినియోగించాలి. రూపాయినోట్లతో అలంకరణచేస్తే పూజించవలసిన డబ్బును తక్కువచేసినట్టే అవుతుంది. లక్ష్మీ దేవికి గణపతికి ఉన్న సంబంధం జ్ఞానానికి ధనానికి ఉన్న సంబంధం. లక్ష్మీగణపతి రూపం వెనక ఉన్న మర్మం ఇదే! ధనాన్ని, జ్ఞానాన్ని సద్వినియోగంచేస్తే రెండింటికీ అధిదేవతలుగా ఉన్న లక్ష్మీ గణపతులు ప్రసన్నమవుతారు. పూజానంతరం లక్ష్మీ దేవిని ఆవిడ నివాసస్థానమైన హృదయంలోకి చేరబిలుచుకోవాలి. కాబట్టి ‘హే లక్ష్మీ మమ హృదయే ప్రవిశ’ అంటూ మన మనసులోకి ప్రవేశిస్తున్న భావన చేయాలి. గణపతిని ఇతర దేవతలను ‘యధాస్థాన ముద్వాసయామి‘ అని వారి వారి స్థానాలకు పంపిస్తాము.
  • వినాయక చవితినాడు పూజించే గణపతిని, బంగారంతో కాని, వెండితో కాని, ఇత్తడితో కాని వారి వారి సామర్ధ్యాన్ని అనుసరించి పూజించుకోవచ్చు. ఇది శాస్త్రసమ్మతమే! అంత స్తోమతలేనివారు నదీ తీరాన, చెరువులు, సరస్సులు ఉండే తావున పవిత్రమైన ప్రదేశాలనుండి, ఎవరూ నడవని ప్రాంతంలోని మట్టిని తీసుకుని వినాయకుణ్ణి చేసుకోవచ్చు.
  • లోహాలతో గణపతి ప్రతిమను చేసి పూజించిన వారు మండపంతో సహా దేవుని దానం చెయ్యాలని శాస్త్ర వచనం . పూజానంతరం పూజలో వినియోగించిన ద్రవ్యాలు పవిత్రమైనవి కనుక ఆ ద్రవ్యాలు పాదాలకు తాకితే దోషము కాబట్టి వాటినీ ప్రవాహంలో కలపడం శ్రేష్ఠం అని శాస్త్రం చెబుతుంది. ఈ వినాయకుని ప్రతిమ చేసే టప్పుడు లోపల డొల్లగా ఉండకూడదు. డొల్ల విగ్రహాలను అలంకరణకే తప్ప పూజకు వినియోగించకూడదు.
  • మట్టితో చేసిన గణపతిని దానం చేయదలుచుకుంటే నిర్మాల్యంతో సహా గణపతిని జలంలో నిమజ్జన చేయడం అనే విధానం ఆచరణలోకి వచ్చింది. వినియోగం, అనుభవించడం అనే లక్షణాలు మట్టికి లేవు. మట్టిగణపతి పాదాలకు తగలకూడదు కనుకనే నిమజ్జనం చేయాలన్నారు.
  • 1930 ప్రాంతంలో దేశ సమైక్యతకోసం అందరూ కలిసి జరుపుకునే పండుగగా వినాయక చవితి కీర్తికెక్కింది. స్వాతంత్య్ర సంగ్రామం కొత్త పుంతలుతొక్కడానికి గణపతి ఎంతగానో సాయపడ్డాడు. విగ్రహానికి ప్రాణ పతిష్ఠ చేసే విధానాలలో అచల ప్రతిష్ఠ, చల ప్రతిష్ఠ అని రెండు రకాలు. ఆలయాలలో చేసే ప్రాణప్రతిష్ట అచల ప్రతిష్ఠ. స్వల్పకాలం పూజలు చేసి మళ్ళీ కదపవలసి వచ్చే సందర్భాలలో జరిగేది చల ప్రతిష్ఠ.
  • నిజానికి నిమజ్జనం నిర్మాల్యానికే తప్ప విగ్రహానికి కాదు! మట్టి గణపతిని పవిత్రంగా కాపాడుకోవడం కోవాలి. యేడాది పొడువునా కాపాడడం కష్టంతో కూడుకున్న పని కనుక ప్రకృతి మాత ఒడికి తిరిగి చేరుస్తున్న భావనతో నిమజ్జనం చేయాలని పెద్దలు సూచించారు.
  • సామూహిక ఆరాధన ఆలయాలలో జరుగుతూంటుంది. అక్కడకూడా మూలవిరాట్టుకు పూజచేసి ఉత్సవ మూర్తిని ఊరేగిస్తారు. దేవీ నవరాత్రులు మొదలైన వాటిలో కుడా లోపల భాగం ఖాళీగా ఉంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను పూజించడం, పూజానంతరం నిమజ్జనం చేయడం గమనిస్తూ ఉంటాము.ఇటువంటి విగ్రహాలను తయారు చేసుకోవడం, పూజానంతరం నిమజ్జన చేయడం వెనుక సంప్రదాయానుగుణంగానే తప్ప తప్ప శాస్త్రోక్తంగా సాగడంలేదు.
  • మట్టితో చేసిన గణపతిని నిమజ్జనంచేసే ఉద్దేశంలేకపోయినా, లోహ గణపతిని దానంచేయాలనిపించకపోయినా విగ్రహం కొలతను అనుసరించి గాదె నిండుగా ధాన్యాన్ని పోసి అందులో ఉంచవచ్చు.
  • ఇంట్లో నిత్యపూజ చేసుకునే వారు ఊరు వెళ్ళవలసి వచ్చినప్పుడు నివేదనచేయడానికి మరో ప్రత్యామ్నాయం లేకపోతే , ఊరువెళ్ళినన్నిరోజులకు సరిపడా బియ్యము స్వయంపాకానికి వాడే పదార్ధాలను దేవుని దగ్గర ఉంచి వెళ్ళవచ్చని చెబుతారు. అలాగ గాదెలో లేదా ధాన్యంతో నింపిన పాత్రలో ఉన్న ధాన్యము/బియ్యాన్ని నిత్యమూ వినియోగించుకోవచ్చు. అలా వినియోగించుకుంటూ మళ్ళీ ఆ పాత్రను ధాన్యం/బియ్యంతో నింపుకోవాలి. మట్టితో చేసిన గణపతి విగ్రహం భిన్నం కానంతసేపు పూజించుకోవచ్చు. ఒకవేళ కనుక భిన్నమయ్యే పరిస్థితి ఉంటేమాత్రం దానిని నిమజ్జన చేయడమే శ్రేష్ఠం.

Ananth-photo-(1)

– చిఱ్ఱావూరి అనంత్