Home హైదరాబాద్ సెటిల్‌మెంట్లకే ప్రాధాన్యం!

సెటిల్‌మెంట్లకే ప్రాధాన్యం!

police

పోలీసు శాఖకు మచ్చ తెచ్చే విధంగా కొందరి పోలీసుల నిర్వాకం
స్నేహహస్తం ఓవైపు… చేయిచాపుడు మరో వైపు
కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలితో విస్తుపోతున్న ఉన్నతాధికారులు

మన తెలంగాణ/ సిటీబ్యూరో: స్నేహపూర్వకంగా ఉంటూ, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశానికి నీరుగారుస్తున్నారు నగరం, సైబరాబాద్, రాచకొండ పోలీసులు. పోలీసు స్టేషన్‌లకు వెళ్ళేందుకు ఫిర్యాదుదారులే పునరాలోచన చేస్తున్నారు. సమాజంలో పోలీసులపై ఉన్న అభిప్రాయాన్ని చెరిపేసే క్రమంలో ఉన్నతస్థాయి అధికారులు పీపుల్స్, ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా క్రిందిస్థాయి అధికారులు మాత్రం తమ అధికారాలకు ప్రాధాన్యతనివ్వడంలేదనే ఆరోపణలు బలంగాఉన్నాయి. స్వార్ద ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్టు ఇటీవల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. నగరం, శివారుల్లోని పోలీసులు సెటిల్‌మెంట్లు, అక్రమార్జనలు, భూవివాదాల్లో తలదూర్చడం వైపు దృష్టిసారిస్తున్నారనేది బహిరంగ రహాస్యం. ఈ విషయాల్లో తలదూర్చి బహిరంగంగా ప్రచారంలోకి వచ్చిన పోలీసు అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు బదిలీ వేటు వేస్తున్నారేగానీ, విభాగపరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భూతగాదాల్లో : నగర శివారు ప్రాంతాల్లో తరుచూ వస్తోన్న భూవివాదాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ‘భూ సంబంధిత వ్యాజ్యాలను విచారించే ప్రామాణిక కార్యాచరణ విధానం(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)’ను అమలులోకి తీసుకువచ్చారు. దీనిని ఆసరాగా చేసుకున్న క్రిందిస్థాయి పోలీసు అధికారులు భూవివాదాల్లో తమ తెలివితేటలను ప్రయోగించి అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ క్రమంలోనే గతంలో మియాపూర్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి భూవివాదాల్లో చిక్కుకున్నట్టు విస్తృతంగా ప్రచారం కావడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.

అనంతరం ఆ క్రమంలోనే నేరేడ్‌మెట్‌కు చెందిన ఓ అధికారి భూవివాదంకు సంబంధించి ఓ వ్యక్తి అపహరణతో సంబంధం ఉన్నట్టు ప్రచారం జరగడంతో బదిలీవేటు వేశారు. ఇటీవల జవహార్‌నగర్‌లో ఇద్దరు పోలీసులు భూతగాదాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్టు విమర్శలు రాగానే వారిని అక్కడి నుండి కుషాయిగూడకు అటాచ్డ్ చేశారు. అలాగే, కుషాయిగూడ, ఘట్‌కేసర్‌లకు చెందిన పోలీసు అధికారులు కూడా కేసుల విషయంలో నిర్లక్షంగా వ్యవహరించి బదిలీ వేటుకు గురయ్యారు. నగరంలోని పలు పోలీసు స్టేషన్‌లకు చెందిన పోలీసులు ముఠాగా ఏర్పడి వసూలు దర్జాగా చేయడం మొదలుపెట్టారు. ఓ స్పా కేంద్రం యజమాని ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ అధికారులు వారిని అరెస్టుచేశారు. ఈ విధంగా వెలుగులోకి వచ్చినవి కొన్నేనని, బయటకురాని ఎన్నో తతంగాలు పోలీసు స్టేషన్‌లలో చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

మహిళల విషయాల్లో : ఫిర్యాదుదారులైన మహిళలపట్ల, ఇతర మహిళల వ్యవహారాల్లోనూ నగరం, శివారు ప్రాంతాలకు చెందిన పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనేది బహిరంగ రహాస్యం. ఇటీవల జవహార్‌నగర్ అధికారిపై బదిలీ, కుషాయిగూడలో ఓ మహిళా ఫిర్యాదుకు సెక్షన్‌లను నమోదు చేయకుండా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలా చాలా ప్రాంతాల్లోనూ పోలీసులు మహిళలతో అక్రమ సంబంధాలు నెరపడం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసులుగా ఉండటంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అక్రమార్జనలు చేసే, అక్రమసంబంధాలు నెరపడంపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారించి విధి నిర్వాహణలో పారదర్శకతకు జవాబుదారీతనంకు ప్రాధాన్యత లభించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.