Home వికారాబాద్ టిఆర్‌ఎస్ వైపు మాజీ మంత్రి చూపు?

టిఆర్‌ఎస్ వైపు మాజీ మంత్రి చూపు?

Some Political Leaders Wants Join In TRS Party

మనతెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలో తెరాసలో ఉత్సాహం ఉరకలేస్తుండగా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఢీలా పడింది. అందుకు నాయకత్వలోపమే కారణమని చెప్పకతప్పదు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వికారాబాద్‌లో ఎమ్మెల్యే సంజీవరావులో మనుపటి ఉత్సాహం లేకపోవడం, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్‌గౌడు కేడర్ బలోపేతం చేయడంలో పెద్దగా సఫలీకృతులు కాలేకపోయారని అధిష్టానం భావిస్తున్నది. జిల్లా అంతటా ఊపుమీదున్న తెరాస శ్రేణులు వికారాబాద్‌కు వచ్చేసరికి నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. 2019లో మరోసారి అధికారం చేపట్టడమే లక్షంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం వికారాబాద్ వంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం యోచిస్తుండగా ఓ మాజీ మంత్రి తెరాస వైపు ఆసక్తిగా చూస్తున్నారని రాజకీయవర్గాల సమాచారం.  తన బంధువైన గాడ్‌ఫాదర్ తెరాసలో కీలకంగా కొనసాగడం, మరో గాడ్‌పాదర్ రేపోమాపో పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ తరుణంలో మాజీ మంత్రి కూడా వారి బాటనే అనుసరిస్తారని తెలుస్తున్నది. ఇటీవల సదరు మాజీ మంత్రి పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.

దాంతో గులాబీశ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.  మాజీ మంత్రి పార్టీలో చేరితే నాలుగేళ్లుగా ఢీలా పడిన కార్యకర్తల్లో నూతనేత్తజం వస్తుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నడిపించే నాయకుడు లేక నిస్తేజంగా మారారు. వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, మర్పల్లి, బంటారం మండలాల్లో తెరాస, కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థి లేకపోతే తెరాసకు అపార నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. 2001లో తెరాస ఆవిర్భావం నాడు పార్టీలో చేరిన నేతల్లో చాలామంది ప్రస్తుతం తెరమరుగు అయ్యారు. సీనియర్ నేతల్లో కొంతమంది కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 2004లో తెదెపా టిక్కెట్ ఇవ్వకపోవడంతో తెరాసలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ చంద్రశేఖర్ కూడా 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో  చేరారు. అయితే, అనూహ్యంగా తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగు దఫాల పాటు పోటీ చేసి ఓడిపోయిన సంజీవరావుకు వికారాబాద్ ప్రజలు ఒక అవకాశం కల్పించారు. నాలుగేళ్ల పాలనలో వికారాబాద్‌ను అనుకున్నంత రీతిలో తీర్చి దిద్దలేకపోయారు. పైగా వికారాబాద్ జిల్లా ఆవిర్భావం, ఇటీవల జోన్ల అంశంలో ఎమ్మెల్యే అనుసరించిన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉంది.  నామినేటెడ్ పోస్టుల భర్తీలో వికారాబాద్‌కు సీఎం కేసీఆర్ న్యాయం చేసినా అనుకున్నంత రీతిలో పార్టీ బలోపేతం కాలేదు.

విద్యామౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడు పరిగి సెగ్మెంట్‌లో టిక్కెట్ ఆశిస్తున్నారు.  కానీ అక్కడ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడటంతో తన రాజకీయ వారసుడును వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు.  వికారాబాద్‌ను మాత్రం నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. ఈ తరుణంలో ఓ మాజీ మంత్రి తెరాస వైపు ఆకస్తి కనబరుస్తున్నారు. సదరు నేత పార్టీలో చేరితే ఒంటి చేత్తో విజయం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న ఆయన వెంట వేల సంఖ్యలో పార్టీ మారే అవకాశాలు ఉంటాయి.  చిన్న లోపాలు అధిగమిస్తే మాజీ మంత్రికి ప్రతికూలత లేకపోవడం గమనార్హం. అధిష్టానానికి కూడా ఇలాంటి నాయకుడే అవసరం. జిల్లా అభివృద్ధికి మంత్రి మహేందర్‌రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా వికారాబాద్‌లో కేడర్ బలోపేతం కావడం లేదు. ఈ మాజీ మంత్రి పార్టీలోకి వస్తే మహేందర్‌రెడ్డికి భవిష్యత్తులో పోటీ అవుతారా.. అనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా ఉండగా సదరు మాజీ మంత్రి పార్టీ మారుతారనే ప్రచారాన్ని సొంత పార్టీ నేతలు ఖండిస్తున్నారు. తల్లిలాంటి తమ పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలో వికారాబాద్ నియోజకవర్గ రాజకీయాల్లో పలు పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.