Home లైఫ్ స్టైల్ ఆకుపచ్చ అందానికి వీరే దిక్సూచి

ఆకుపచ్చ అందానికి వీరే దిక్సూచి

వ్యవసాయం ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు, పురుగుమందులేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే హరిత విప్లవం తర్వాత ఆరు దశాబ్దాలుగా రసాయనాల వినియోగానికి అలవాటు పడిన రైతులోకం దాన్నుంచి బయట పడలేక పోతోంది. భూములు కూడా రసాయనాలను వినియోగిస్తేనే ఫలసాయం ఇచ్చే స్థితికి చేరుకున్నాయి. ఈ రసాయనాల వినియోగం బాటలోనే అడవి బిడ్డలు కూడా పయనిస్తున్నారు. అయితే ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్న కృషి కారణంగా ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలంలో కొన్ని గ్రామాల్లోని గిరిజనులు రసాయన వ్యవసాయాన్ని వీడి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. వారిలో కొందరు గోండు గిరిజన మహిళల విజయపథం ఇది.

Tribal-Women-Agriculture

రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏదో ఒకటే పంటను సాగు చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఎడతెగని సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చేస్తున్నది వ్యవసాయమే అయినప్పటికీ ఇంట్లోకి కూరగాయలు, పప్పులు కూడా కొనుక్కొని తినాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో పేదరికం, పౌష్టికాహార లోపం గిరిజన కుటుంబాలను కుంగదీస్తూ ఉంటుంది. ఇక రైతు ఆత్మహత్య పాలైన కుటుంబాల్లో కుటుంబ పోషణతోపాటు వ్యవసాయ బాధ్యతలు కూడా మహిళలపైనే పడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి ప్రాంత ఆదివాసీ మహిళలు ఏకలవ్య ఫౌండేషన్ సంస్థ తోడ్పాటుతో ఆర్థిక, పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మిశ్రమ పంటల సాగుతో పౌష్టికాహార, ఆదాయ భద్రతను సాధిస్తున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో సేంద్రియ సాగు చేపట్టిన గోండు గిరిజనమహిళలు ఆహార స్వావలంబన సాధించారు. కరువులోనూ కుటుంబాలకు ఆహార భద్రతను సాధించటమే లక్ష్యంగా సేంద్రియ పంటలను సాగుచేస్తున్నారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పత్తి వంటి ఏక పంటలను సాగుచేయడం అలవాటు. దీంతో, అప్పులపాలై ఏటా వందలాది మంది రైతులు ఆర్థికంగా చితికిపోయి దీన స్థితిలో ఉన్నాయి. సంక్షోభ పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతు కుటుంబాల్లో బరువు బాధ్యతలన్నీ మహిళల నెత్తినే పడతాయి. అలాంటి కుటుంబాలలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి, స్వల్ప ఖర్చుతో చేసే సేంద్రియ సేద్యం వైపు దృష్టి మళ్లించింది ఏకలవ్య ఫౌండేషన్ సంస్థ. రసాయన ఎరువులకు బదులు జీవన, సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఖర్చు తగ్గింది. సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు బిందు, తుంపర సేద్యాన్ని అనుసరించారు.
ఉట్నూరు మండలం మోతుగూడ గ్రామంలో నివసించే ఈ గోండు మహిళలు తమకున్న ఎకరం భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. కూరగాయలతోపాటు చిరుధాన్యాలను కూడా రసాయన ఎరువులుగానీ, పురుగు మందులు కానీ ఉపయోగించకుండా వ్యవసాయం చేస్తున్నారు.

ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ

“ గతంలో నేను కూడా పంటల కోసం రసాయనాలనే వాడేదాన్ని. అయితే ఏకలవ్య ఫౌండేషన్ ఆర్గానిక్ వ్యవసాయం మీద మాలో అవగాహన పెంచింది. దీనివల్ల ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ అని తెలుసుకున్నాం. మా పంటలు చూసి మా ఊళ్ళో చాలామంది సేంద్రియ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. నీటికుంటలు, బోరు బావుల రీచార్జి వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. మిశ్రమపంటలను సాగు చేయటంతో కుటుంబాలకు పోషకాహారం లభ్యమయింది. మరోవైపు భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చి నికరాదాయం పెరిగింది. మా దిగుబడులను అమ్ముకునేందుకు రైతుక్లబ్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంటున్నారు పుల్లాబాయి. మంగీబాయి, ఎల్లమ్మ.

సేంద్రియ ఎరువు తయారీ ఇలా..

  1. వేపాకు, కిలో పేడ, ఆవు మూత్రం బాగా రుబ్బి రెండ్రోజలు తర్వాత పిచికారి చేస్తున్నారు.
  2. వేపాకు, ఉమ్మెత్త ఆకులు, జిల్లేడు ఆకులు, బంతి పూల ఆకులు, తంగేడు ఆకులు, బాగా మిశ్రమం చేస్తే దశ పరణి కషాయం తయారవుతుంది,దీనిని మూడు రోజుల తరువాత స్ప్రే చేస్తున్నారు.
  3. పేడ, ఆవు మూత్రం, బెల్లం, సెనగపిండి కలిపి ఐదు రోజులు నిల్వ ఉంచిన తర్వాత జీవామృతం తయారవుతుంది దీనిని పొలంపై పిచికారి చేస్తున్నారు.
  4. కిలో పిప్పి ఆకు, లీటరు పాలు, వేపాకు కషాయం, ఆవు మూత్రం కలిపి నాలుగు రోజుల తర్వాత మురిపిండి కషాయం తయారవుతుంది. దీనిని పిచికారి చేస్తున్నారు.
    ఇవన్నీ పచ్చ పురుగు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణతో పాటు కాయ నాణ్యతకు, పూత రావడానికి ఎంతో ఉపయోగపడతాయంటున్నారీ గిరిజనులు.

జీవన ఎరువులే ఎంతో మేలు

“ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న పొలాలు ప్రకతి వైపరీత్యాలను తట్టుకోలేకపోతున్నాయని ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి చందాసింగ్ పడవాల్ అంటున్నారు. వాటితో పోలిస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలే ప్రకతి వైపరీత్యాల వల్ల సోకుతున్న అనేక చీడపీడలను తట్టుకుని నిలబడగలుగుతున్నాయన్నారు.
సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాలను ఇంద్రవెల్లి గిరిజనులు రైతులు స్వయంగా తయారు చేసుకుంటూ ఎరువుల ఖర్చును తగ్గిస్తున్నారు. పంటల సాగులో జీనవ ఎరువుల వినియోగం లాభదాయకం. ప్రతి ఒక్కరూ జీవన ఎరువులను వాడితే పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లవుతుంది. పంట దిగుబడి నాణ్యతగా ఉండడంతో పాటు రైతుకు లాభదాయకంగానూ ఉంటుంది” అని ఆయన అన్నారు.

శ్యాంమోహన్, 9440595858
ఫొటోలు. కె.రమేష్‌బాబు