Search
Wednesday 17 October 2018
  • :
  • :

వీరశైవ సిద్ధ క్షేత్రం కొలనుపాక..

Somesvarasvami-image

పూర్వచరిత్ర..
ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు. 1. సోమేశ్వరస్వామి – కొలనుపాక 2. సిద్దేశ్వర స్వామి – ఉజ్జయిని 3. భీమనాథస్వామి – కేదారనాథ్ 4. మల్లికార్జునస్వామి – శ్రీశైలమ్ 5. కాశి విశ్వేశ్వరస్వామి

క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రం. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది. క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్‌చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది. మధ్య యుగం – క్రీ.శ. 1008 – 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం – నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడిందని స్థానికులు అంటున్నారు.

చూడాల్సినవి, విశేషాలు:
ఈ గ్రామం చాలా చరిత్రాత్మక ప్రదేశం. సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. కోటొక్క లింగము నూటొక్క చెరువుకుంటలు ఉన్నాయి. ముఖ్యంగా స్వయంభూ లింగం వెలసి శ్రీ శ్రీ సోమేశ్వరస్వామిగా అవతరించాడు. రేణుకా చార్యుని జన్మ స్థలం. సోమేశ్వర ఆలయం. వీరనారాయణస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయం. వివిధ కులాలకు చెందిన 22 రకాల మఠాలు, వీరశైవ ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం ప్రత్యేకత. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యం పొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో రాసి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 – 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.

ఎలా వెళ్లాలి…
హైదరాబాదుకు 65 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాదు నుండి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్, నుండి వరంగల్ లేదా హన్మకొండ జనగాం వెళ్ళే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయం కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రెయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మీ ప్రయాణిస్తే కొలనుపాక గ్రామము చేరుకుంటారు. ఆలేరుకు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది.

Comments

comments