Home నిజామాబాద్ అవ్వా… మీకెంత కష్టం ..!

అవ్వా… మీకెంత కష్టం ..!

Son Beat his Own Old Mother and Father

నిజామాబాద్: కాటికి కాలు జాపే వయసులో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కొడుకే కన్నవారి పాలిట యముడయ్యాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంలా పూజించాలనే  విషయాన్ని మరిచి  అష్టకష్టాలు పెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే… డిచ్‌పల్లి మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన రైతు సుంకె భూమయ్య, సుంకె లింగవ్వలకు సుంకె శ్రీనివాస్ అనే కొడుకున్నాడు. గత కొన్ని నెలలుగా తమ కొడుకు శ్రీనివాస్, అతని భార్య సుజాతతో కలిసి తమను నానా రకాలుగా వేధిస్తున్నారని, విచక్షణ రహితంగా కొట్టి బాధలు పెడుతున్నారని బాధిత వృద్ధ దంపతులు భూమయ్య, లింగవ్వలు వాపోయారు. మంగళవారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ఎదుట వృద్ధ దంపతులు దిగాలుగా కూర్చుని ఉండటాన్ని గమనించిన జర్నలిస్టులు పలకరిస్తే కొడుకు దాష్టికాన్ని ఏకరువు పెట్టారు. చేతకాని స్థితిలో ఆశక్తులుగా ఉన్న తమను వదిలేసి భార్య, పిల్లలతో తన కొడుకు వేరే కాపురం పెట్టాడన్నారు. ఇంట్లో ఏ వస్తువులు ఉంచకుండా అన్ని తనతో పాటే తీసుకెళ్లాడని తెలిపారు. 8 నెలల క్రితం తమను కొడుకు శ్రీనివాస్ తలపైన, వీపుపైన విఫరీతంగా కొట్టాడని, ఆ దెబ్బలు ఇప్పటికి తమను వేదిస్తున్నాయని వారు తెలిపారు. తాజాగా గ్రామంలో తమ పేరున ఉన్న భూమి తాలూకా రైతుబంధు డబ్బులు రూ. 8వేలు రాగా, ఆ డబ్బుల కోసం నానా ఇబ్బందులు పెడుతున్నారని, ఇంట్లో ఉండకూండా చేస్తున్నారని బాధిత దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు ఇన్ని బాధలు పెడుతున్నా కొడుకు పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్న ఆ తల్లిదండ్రులు మాతృ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు.  అధికారులు కల్పించుకుని తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.