Home సినిమా అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక

అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక

 • ఉత్తమ నటుడిగా ఎన్‌టిఆర్‌కు పురస్కారం
 • ఉత్తమ నటిగా నిలిచిన సమంత
 • ఉత్తమ చిత్రంగా ‘పెళ్లిచూపులు’

Filmfare-Awards-Actors

సినీ తారల తళుకుబెళుకుల మధ్య 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక ఆద్యంతం ఉల్లాసంగా…ఉత్సాహంగా జరిగింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఈ వేడుక ఆడంబరంగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు ఈ వేడుకలో పాల్గొని సందడిచేశారు. స్టార్ బ్యూటీలు వయ్యారాలు ఒలకబోస్తూ ఆహుతులను మైమరపించారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, దిల్‌రాజు, రానా, సమంత, సూర్య, జ్యోతిక, కార్తిక్,  త్రిష, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, కేథరిన్, మంచులక్ష్మీ, ప్రగ్యా జైస్వాల్, లావణ్య త్రిపాఠి, నీక్కి గల్రాని, ప్రణీత,నివేదా థామస్, రుక్సార్ మీర్, రియా చక్రవర్తి, వామికా గబ్బి, సెజల్ జెన్‌షా, పాయల్ ఘోష్, సాక్షి అగర్వాల్, కృష్ణ, విజయనిర్మల, సుహాసిని, ఖుష్బూ, ఎ.ఆర్.రెహమాన్, మాధవన్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సుధీర్‌బాబు, అలీ, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొని కనువిందుచేశారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ‘అ..ఆ’ సినిమాకుగాను సమంత ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డుల్లో నటుడిగా అల్లు అర్జున్, నటిగా రీతూవర్మ అవార్డు లను అందు కోవడం విశేషం. ఉత్తమ చిత్రంగా ‘పెళ్లి చూపులు’ అవార్డును దక్కించుకోగా ఉత్తమ దర్శకుడిగా ‘ఊపిరి’ చిత్రానికిగాను వంశీ పైడిపల్లి ఫిలింఫేర్‌ను అందుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “అభిమానుల ఆదరాభిమానాల వల్ల, దర్శకులు నన్ను బాగా ఫోకస్ చేయడం, దేవుడి దయ వల్ల నాకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. నన్ను అభిమానించే అభిమానులకు నేనే పెద్ద అభిమానిని”అని చెప్పారు. ఇక ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా ఇది రెండవ ఫిలింఫేర్ అవార్డు కావడం విశేషం.

 • ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)
 • ఉత్తమ నటి : సమంత (అ…ఆ)
 • ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డు (నటుడు) :అల్లు అర్జున్ (సరైనోడు)
 • ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డు (నటి) : రీతూ వర్మ (పెళ్లి చూపులు)
 • ఉత్తమ చిత్రం : పెళ్లి చూపులు
 • ఉత్తమ దర్శకుడు : వంశీ పైడిపల్లి (ఊపిరి)
 • ఉత్తమ సహాయ నటుడు : జగపతిబాబు (నాన్నకు ప్రేమతో..)
 • ఉత్తమ సహాయ నటి : నందితా శ్వేతా (ఎక్కడికి పోతావు చిన్నవాడా)
 • ఉత్తమ నేపథ్య గాయకుడు : కార్తిక్ (అ..ఆ-ఎల్లిపోకే శ్యామల..)
 • ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (నేను శైలజ-ఈ ప్రేమకీ..)
 • ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్)
 • ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ : దేవిశ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో)