Home లైఫ్ స్టైల్ తీపి పండుగ

తీపి పండుగ

south indian special sweets recipes for diwali

హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగ అనగానే  గుర్తుకు వచ్చేవి కొత్త బట్టలు, పిండి వంటలు, స్వీట్స్ వీటితో పాటు ముఖ్యంగా… సాయంత్రం వేళ అందమైన దీపాల కాంతిలో ప్రతి ఇల్లు  టపాసుల వెలుగులతో విరజిమ్ముతాయి. ఈ పండుగను  చిన్న, పెద్ద, ధనిక, పేద, అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ సందర్భంగా  కొన్ని తీపి రుచులు మీకోసం..

 డ్రైఫ్రూట్ శ్రీఖండ్

కావలిసిన పదార్ధాలు: పెరుగు -2 కప్పులు, పంచదార – 1+1/4 కప్పు,క్రీం -1/4 కప్పు, బాదాం పప్పులు -10, పిస్తా పప్పులు -15, యాలకుల పొడి – 1/4 టీస్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు.
తయారీ విధానం: ముందుగా పెరుగులో పంచదార వేసి, పంచదార కరిగి మెత్తగా అయ్యేంత వరకు మెల్లగా గిలకొట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సర్వింగ్ బౌల్‌ల్లోకి తీసుకుని క్రీం కలిపి, పిస్తా పప్పు, బాదం పప్పు పలుకులు, కుంకుమపువ్వు చల్లి అలంకరించుకోవాలి. దీన్ని 3-4 గంటలు ఫ్రిజ్‌లో పెట్టి బాగా చల్లబడ్డాక తింటే చాలా రుచిగా ఉండే డ్రైఫ్రూట్ శ్రీఖండ్ తయార్.

ఆల్మండ్ డేట్ బాల్స్

కావాల్సిన పదార్ధాలుః
ఖర్జూరాలు -1 కప్పు, నువ్వులు – 1/2 కప్పు
కొబ్బరి పొడి- 1/4 కప్పు, బాదం -1/2కప్పు
తేనె -తగినంత,
తయారీ విధానంః ముందుగా బాదం పప్పు, కొబ్బరిపొడి, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత అందులో గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత తేనె కలిపి లడ్డూలుగా చేసుకోవాలి. తర్వాత ఈ లడ్డూలను బాదాం పప్పు పలుకుల్లో అన్నివైపులా పట్టేటట్లు అద్దాలి. ఎంతో సులువుగా, చాలా తక్కువ సమయంలో తియ్యగా ఉండే షుగర్ లెస్ ఆల్మండ్ డేట్ బాల్స్ తయారయిపోతాయి.

  కేసర్ సందేశ్ 

కావలిసిన పదార్ధాలు: 
పాలు-1 లీటర్, పంచదార పొడి- 1/4 కప్పు, నిమ్మకాయలు-2, పిస్తా పప్పులు-10 , యాలకుల పొడి-1/4 టీస్పూన్ , కుంకుమ పువ్వు- చిటికెడు
తయారీ విధానం: ముందుగా లోతుగా ఉన్న కళాయి తీసుకుని, అందులో పాలు పోసి మరిగించాలి. తర్వాత మంట, తగ్గించి, నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి కొద్ది కొద్దిగా పోస్తూ పాలను విరగొట్టాలి. పాల విరుగుడు, నీళ్ళు వేరయ్యాక దించేసి పలచని బట్టలో వడకట్టి చల్లని నీటిలో ముంచి మరో సారి నీరంతా పిండేసేయాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలు చుట్టుకుని కుంకుమ పువ్వు రేకలు, పిస్తా పప్పులతో అలంకరించకుంటే ఎంతో సులువుగా కేసర్ సందేశ్ రెడీ.

సీతాఫల్ బాసుంది

కావాల్సిన పదార్ధాలు: పాలు-1+ 1/4 లీటర్, సీతాఫలం గుజ్జు -1 కప్పు , పంచదార -1/2 కప్పు, పిస్తా పప్పులు-10, బాదాం పప్పులు -10, చిరంజి పప్పు-1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి -1/2 టీస్పూన్, గులాబీ రేకులు -5-6,
తయారీ విధానం: ముందుగా మందపాటి గిన్నెలో పాలు పోసి, పొంగు వచ్చిన తర్వాత సన్న మంట మీద మరో 1/2 గంట కాయాలి. పాలు అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు సగమయ్యేంత వరకూ కాచి దానిలో పంచదార వేసి మరో 10నిముషాలు మరిగించి తీసేయాలి.
పాలు చల్లారాక దానిలో సీతాఫలం గుజ్జు, యాలకుల పొడివేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సర్వింగ్ బౌల్‌ల్లోకి తీసుకుని తరిగిన పిస్తా, బాదం పప్పు పలుకులు, చిరంజి పలుకులను, గులాబీ రేకులతో అలంకరించుకుంటే పసందైన సీతాఫల్ బాసుంది రెడీ.

స్వీట్ పోటాటో జామూన్

కావలసిన పదార్ధాలు: చిలగడ దుంపలు- 1/2 కేజీ,పంచదార- 1/2 కేజీ, మైదా – 1/2 కప్పు;యాలకులు -6 , నీళ్లు- 1/2 లీటర్, నెయ్యి-1/4 కప్పు నూనె- తగినంత,
తయారీ విధానం: చిలగడ దుంపలు ఉడికించి తొక్క తీసి, మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో మైదా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కళాయిలో నెయ్యి, ,నూనె కలిపి సన్న మంట మీద ఉండలు దోరగా వేయించి పెట్టుకోవాలి. మరో కళాయిలో పంచ దార,యాలకులు, నీళ్ళు కలిపి పాకం తయారు చేసుకోవాలి. తర్వాత వేయించిన చిలగడ దుంప ఉండలను ఆ పాకంలో వేసి చల్లారనివ్వాలి.

                                                                                                                                 – కంట్రి చెఫ్ డా. సుస్మిత చౌదరి
                                                                                                                             సుస్మిత స్కూల్ ఆఫ్ కుకరి                                                                                                                                     www.countrychef.in

south indian special sweets recipes for diwali

Telangana Latest News