Home దునియా దక్షిణాది స్వర్గం కోవలం

దక్షిణాది స్వర్గం కోవలం

ఎలా చేరుకోవాలంటే..

సుమారు 16 కిమీ దగ్గర్లో తిరువనంతపురం రైల్వే స్టేషన్ ఉంది.  త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Kerala

కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న సముద్ర తీర పట్టణం కోవలం. పక్కపక్కనే మూడు చంద్రాకారంలో ఉన్న బీచ్‌లను కలిగిన కోవలం అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచింది. ‘కొబ్బరిచెట్ల తోపు’ అనే అర్థం వచ్చే కోవలం అనే మలయాళ పదం ద్వారా ఈ పేరు వచ్చింది. తిరువనంతపురం ప్రధాన నగరానికి ఈ తీరం కేవలం 16 కిలోమీటర్ల దూరంలో వుంది. మెల్లగా అలలు ఎగసిపడుతుండగా వెచ్చని ఇసుక మీద తీరంవెంబడి నడవడం జీవితంలో ఎదురయ్యే అందమైన అనుభవం. అందమైన వస్తువు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుంది అనే నానుడిని అర్థం చేసుకోవాలంటే, కోవలం బీచ్‌లు చూడాల్సిందే. చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం హృదయానికి హత్తుకొనేంత ఆహ్లాదంగా ఉంటాయి. కోవలం లో మూడు ప్రధాన తీరాలు ఉన్నాయి.

వీటిని చూడడానికి తెల్లవారుఝామున కానీ, బాగా సాయంత్రం గానీ వెళ్ళాలి.- అలా అయితే ఇక్కడి అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలని ఆస్వాదించగలుగుతారు. కోవలంలోని తీరాలలో ఉండే ఇసుక రంగు చాలా విశిష్టతతో కూడినది. కాశ్మీర్ ‘భూమి మీద స్వర్గం’గా దీనికి ఒక ప్రత్యేక పేరు కూడా వుంది. ‘దక్షిణాది స్వర్గం’ గా కోవలంకు పేరు వచ్చింది. 1920లలో ట్రావెన్కోర్ ను పరిపాలించిన మహారాణి సేతు లక్ష్మీబాయి తన కోసం ఇక్కడ ఒక తీర విహారకేంద్రాన్ని నిర్మించుకుంది. హాల్సియన్ కాజిల్ గా పిలువబడే ఈ విహారకేంద్రం ఇప్పటికీ కోవలంలోనే ఉంది. మహారాణి మేనల్లుడు, ట్రావెన్కోర్ మహారాజు ఈ తీర నగరాన్ని నిత్యం సందర్శించి స్థానిక కళలకు పోషకుడయ్యాక కోవలం మరోసారి ప్రాముఖ్యంలోకి వచ్చింది. అయితే, ట్రావెన్కోర్ సంస్థానానికి వచ్చే యూరోప్ దేశాల అతిథుల వల్ల నగరం బాగా ప్రసిద్ధి చెందింది. యూరోప్ దేశాల నుండి వచ్చే యాత్రికులకు తీర విహారకేంద్రం అయింది. 1970 ప్రాంతాలలో హిప్పీలు తమ కార్యకలాపాలకు దీన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు.

శ్రీలంక లోని సిలోన్ కి వెళ్తున్న హిప్పీ యాత్రలో భాగంగా అనేకమంది హిప్పీలు దారిలో కోవలంలో దిగారు. నిదానంగా చేపలు పట్టుకునేవారి స్థావరంగా ఉండే కోవలం హఠాత్తుగా పెద్ద పర్యాటక కేంద్రంగా మారింది. ఇప్పటికీ ఈ నగరాన్ని యూరోపియన్, ఇజ్రాయలీ యాత్రికులు సందర్శిస్తున్నారు. ఇక్కడి ఇసుక కొద్దిగా నల్లగా వుంటుంది. మోనజైట్, ఇల్మేనైట్ ల ఉనికి వల్ల ఈ లక్షణం వచ్చిందంటారు అక్కడి ప్రజలు. ఇక్కడి మూడు తీరాలూ పక్కపక్కనే ఉండి 17 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఈ మూడు తీరాల్లో పెద్దపెద్ద రాళ్ళూ ఉండటంతో మూడు భాగాలుగా చీలినట్టు ఉంటాయి. ఒక్కడ వున్న లైట్ హౌస్ తీరం, హవా తీరం, సముద్రా తీరం అనే మూడు తీరాలు ఉంటాయి.

కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే. ఎందుకంటే దేని అందం దానిదే. ఈ మూడు తీరాలలో లైట్ హౌస్ బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ కురుమ్కల్ కొండమీద 35 మీటర్ల ఎత్తున్న లైట్ హౌస్ ఉండడం వల్ల ఈ తీరానికి ఆ పేరు వచ్చింది. లైట్ హౌస్ తీరానికి, హవా తీరానికి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. తీరానికి ఉత్తర భాగంలో బీచ్ ఉంటుంది. సన్ బాతింగ్, ఈత, హెర్బల్ బాడీ టోనింగ్ మసాజ్‌లు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, కాటమరాన్ క్రూసింగ్ వీటిలో కొన్ని ఇతర రెండు తీరాలలాగా ఉంటాయి. జాలర్లు ఈ తీరం వెంట చేపలు పడుతూ వారి జీవనం కొనసాగిస్తుంటారు. కోవలం తీరం వెంట ఈ మూడూ కాక అశోక బీచ్ అనే పేరుతో ఇంకో తీరం కూడా ఉంటుంది. హనీమూన్ కి వచ్చేవారు, గోప్యత కోరుకునేవారు ఈ తీరం వెంట తిరుగుతూ సరదగా గడుపుతుంటారు. సెప్టెంబర్ నుండి మే వరకు ఈ తీరాలలో యాత్రికుల సందడి కనిపిస్తుంది.