Home ఎడిటోరియల్ కోయ బెబ్బులి

కోయ బెబ్బులి

 Soyam Gangulu Dora a man who fight for Tribes
                                                                (మే 12న సోయం గంగులు దొర వర్ధంతి)

ప్రపంచ చరిత్రలో ఆదివాసీ పోరాటాల అనన్యమైనవి. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీదారుల పీడన శక్తుల నుండి విముక్తి కోసం, ఆదివాసీలు చేసిన స్వయం పాలన ఉద్యమాలు చరిత్రలో విస్మరించబడటం నేటి పాలకుల, చరిత్రకారుల దౌర్భాగ్యస్థితిని గుర్తు చేస్తున్నాయి. ఇంకా చరిత్ర పుటల్లో చివరి మజిలీగా ఆదివాసీల త్యాగాలు మిగిలాయి. అనామకంగా మిగిలిన వారిలో రాంజీ గోండ్, కుమ్రం సూరు, గుండాధర్, గంటం దొర, మల్లు దొర, సింగన్న, పడాలు, కుపార్ లింగ్ వంటి యోధుల వరుసలో సోయం గంగులు దొర ఒకడు. నాటి రజాకార్ల కాలం నుండి కొనసాగుతున్న ఫ్యూడల్ భూ సంబంధాల సమూల మార్పు కోసం 1946 నుండి 1951 వరకు సాగిన మహోజ్వల తెలంగాణ సాయుధ పోరాటం గంగులు లాంటి సామాన్యుడిని సాహస యోధుడిగా మార్చింది. కోయబెబ్బులిగా ప్రసిద్ధి చెందిన గంగులు నిజాం రాజ్యంలోని దట్టమైన పాల్వంచ (పాత తాలూకా) అడవిలో తిరుగులేని నాయకుడు.

ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర అనే కోయ గూడెంలో జన్మించాడు. గంగులు వ్యక్తిత్వంగాని, పోరాట నాయకత్వంగాని, శౌర్య పరాక్రమాలుగాని, కోయ ప్రజల్లో ఆయనపై గల అపార ఆదరాభిమానాలుగాని అపారం. గంగు లు ఉద్యమ (రహస్య) జీవితం 3 దశలు. మొదటి దశలో గోదావరి తీరాన పేరంటాలపల్లి వద్ద ఆశ్రమం నిర్మించుకున్న బాలానందస్వామి కనుసన్నల్లో సింగరాజు నాయకత్వంలో నడిచిన నిజాం వ్యతిరేక పోరాటంలో గంగులు దళ నాయకుడిగా కీలక బాధ్యత వహించాడు. రెండవ దశలో కమ్యూనిస్టుల ప్రవేశం (1948)తో పాల్వంచ అటవీ ప్రాంతాన్ని వారి ముఖ్య స్థావరంగా మార్చడంలో కీలక భూమిక పోషించాడు. మలిదశలో జలియన్ వాలాబాగ్ దురంతం లాంటి ‘పోలీసు చర్య’ ముసుగులోనూ ఐదు రోజుల్లోనే నిజాం నవాబుపై తిరుగుబాటు చేసి మూడేళ్లపాటు కమ్యూనిస్టుల ఏరివేత, వందల మందిని ఊచకోత సాగించిన యూనియన్ సైన్యంపై పటిష్టమైన వ్యూహంతో మెరుపు దాడులు చేస్తూ, ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు గంగులు.

గంగులు యవ్వనంలో గోదావరి తీరంలోని వేలేర్‌పాడు మండలం పేరంటాల పల్లిలో సోమేశ్వర స్వామి, అక్కడి కొండరెడ్డి, కోయ జనులకు విద్యా బుద్ధులు నేర్పుతూ, తిండి గింజలు పంచి ఆదుకుంటున్నాడని విన్నాడు. ఆ స్వామి అనుచరుడైన సింగరాజు కోయ యువకులను సమీకరించి నిజాం రజాకార్లతో పోరాడుతున్నాడు. సాంప్రదాయక శిస్తులను (పుల్లరి), అక్రమ లేవీ సేకరణ, వర్తక మోసాలను నిరసిస్తూ బాణం, కత్తి, వడిసెల వంటి ఆయుధాలతో నిజాం వ్యతిరేక పోరాటానికి పూనుకున్న సింగరాజు దళంలో గంగులు సహా కోయ గిరిజనులు చేరారు. కాని సింగరాజు పేదల ఆస్తులు దోచుకోవడం, భూస్వాముల నుండి చందాలు, దొంగచాటు కలప వ్యాపారం చేస్తూ, చివరికి యూనియన్ సైన్యంలోకి పారిపోయాడు. అనతికాలంలోనే కమాండర్‌గా ఎదిగిన గంగులు నాటి ఉద్యమంలోని అపూర్వ సంఘటిత శక్తిని అంచనా వేశాడు. 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోకి ప్రవేశించిన కమ్యూనిస్టు దళంలో చేరిపోయాడు గంగులు. పార్టీలో చేరిన తర్వాతే కాస్త చదువుకొని సిపిఐ కమిటీలతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ గ్రామ కమిటీల నిర్మాణం చేశాడు. కూలీరేట్లు పెంపు, పాలేర్ల జీతాల పెంపుకు, అక్రమ లేవీ సేకరణకు, అటవీ శాఖ కాజేసే పుల్లర్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నడిపాడు. పార్టీలో సెంట్రల్ కమాండర్‌గా ఎదిగిన గంగులు గెరిల్లా దళాల నిర్మాణంలో కీలక బాధ్యత పోషించాడు. పాల్వంచ జంగల్ కమ్యూనిస్టుల స్థావరంగా మారడం గంగులు చలువే.

గంగులు పోరాట ఫలితంగా సువిశాల పాల్వంచ రూపు రేఖలే మారిపోయాయి. దమ్మపేట కేంద్రంగా ఒక చెట్టు వద్ద ఉద్యమ జెండాను పాతాడు. రుద్రాక్షపల్లిలో ఒక ప్రజాకంటక భూస్వామిని అంతమొందించాడు. దీంతో భూస్వాములు గూడెలను వదిలి పారిపోయారు. అటవీ, రెవెన్యూ శాఖల జులుం నశించింది. అన్ని శిస్తులు బంద్ అయ్యాయి. భూమి, అడవిపై గిరిపుత్రులకు హక్కు లభించింది. స్వాతంత్య్రానంతరం తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ భారత యూనియన్‌లో విలీనం కాలేదు. ఈ నేపథ్యంలోనే 1948 సెప్టెంబర్ 13న యూనియన్ ప్రభుత్వం ‘పోలీసు చర్య’ పేరిట నిజాం ప్రభుత్వంపై సైనిక దాడికి దిగింది. ఆధునిక ఆయుధాలతో 50 వేల మంది సైనిక బలగాలు జనరల్ చౌదరి నేతృత్వంలో నిజాం భూభాగాన్ని చుట్టుముట్టడంతో సెప్టెంబర్ 17న నిజాం సర్కార్ లొంగిపోయింది. తెలంగాణాలో వెల్లోడి నేతృత్వంలో సైనిక పాలన విధించబడింది. ఏజెన్సీ నుండి భూస్వాములు పారిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని కొందరు తిరిగి ప్రత్యక్షమయ్యారు. 1948 నుండి 1951 వరకు యూనియన్ సైనికులు పాల్వంచ, ఇల్లందు, దమ్మపేట, భూర్గంపాడు, వేలేర్‌పాడు ప్రాంతాల్లోని విప్లవకారులను, సానుభూతి పరులను, సామాన్యులను చిత్రహింసలకు గురిచేశారు.

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో సామాన్య ప్రజానీకంపై ఆదివాసీలపై భారత సైన్యం విశృంఖలంగా, వికృతంగా దాడులు చేసింది. గంగులును మట్టుబెడితే తప్ప పాల్వంచ అటవీ ప్రాంతాల్లో ఉద్యమాన్ని అణచలేమని భూస్వాములు, కాంగ్రెస్ నాయకులు, పోలీసు, మిలిటరీ నిర్ణయానికొచ్చింది. అందుకు సరిహద్దులోని జీలుగుమిల్లి (తూ.గో)ని ఆనుకొని ఉండే పాలచర్లకు చెందిన సమీప బంధువైన ఒక స్త్రీని ఉపయోగించుకున్నారు. ఆమె ఇచ్చిన జీలుగు కల్లు తాగిన మైకంలో గంగులు స్పృహ కోల్పోయాడు. సైన్యం అతన్ని బంధించిన తర్వాత పార్టీ రహస్యాలు చెప్పమని ఘోరమైన చిత్రహింసలు పెట్టింది. ఐనా ఏ రహస్యము పొక్కలేదు. దమ్మపేటలో గంగులు కట్టిన జెండాను విప్పడానికే దమ్ముచాలని సైనికులు పిరికిగా బంధించి రుద్రాక్షపల్లిలోని రావిచెట్టుకు కట్టివేసి, ఆ వీరున్ని 1951, మే 12న కాల్చి చంపి ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు. నేడు పోలవరం, కంతనపల్లి నిర్వాసిత సంక్షభంలో చిక్కుకుంటున్న కోయ గిరిజనులను అన్ని విధాల ఆదుకుంటే మహోజ్వల సమాజాన్ని స్వప్నించిన మహాయోధుడైన సోయం గంగులు దొరకు ఘన నివాళి అర్పించినట్లే అవుతుంది. (మే 12న సోయం గంగులు దొర వర్ధంతి).

– గుమ్మడి లక్ష్మీనారాయణ