Search
Wednesday 26 September 2018
  • :
  • :

టైటిల్ వేటకు నాదల్

  • సెమీస్‌లో డెల్‌పొట్రో ఔట్
  • ఫైనల్లో అండర్సన్
  • యుఎస్ ఓపెన్

Nadal

న్యూయార్క్: స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ ప్రతిష్టాత్మకమైన యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ అర్జెంటీనా స్టార్, 24వ సీడ్ జువాన్ మార్టిన్ డెల్‌పొట్రోను 46, 60, 63, 62 తేడాతో ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ విజయం సాధించాడు. సెమీస్‌లో స్పెయిన్ ఆటగాడు కరెనా బుస్తాను ఓడించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. కాగా, డెల్‌పొట్రోతో జరిగిన పోరులో నాదల్ దూకుడుగా ఆడాడు. తొలి సెట్‌లో మాత్రం డెల్‌పొట్రో ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ షాట్లతో నాదల్‌ను హడలెత్తించాడు. అతని ధాటికి నాదల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన డెల్‌పొట్రో పైచేయి సాధించాడు. అంతేగాక నాదల్ ఒత్తిడికి తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న డెల్‌పొట్రో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో నాదల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రత్యర్థిపై నిర్దాక్ష్యిణ్యంగా విరుచుకు పడ్డాడు. డెల్‌పొట్రోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. ఈ క్రమంలో ప్రత్యర్థికి ఒక్క గేమ్ గెలిచే అవకాశం కూడా ఇవ్వకుండానే సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సెట్‌ను నాదల్ 60తో గెలవడం విశేషం. ఇక, మూడో సెట్‌లో కూడా నాదల్ ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. నాదల్ ధాటికి డెల్‌పొట్రో ఎదురు నిలువలేక పోయాడు. అంతేగాక ఒత్తిడికి తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నాదల్ సునాయాసంగా సెట్‌ను గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా నాదల్‌కు ఎదురు లేకుండా పోయింది. అద్భుత షాట్లతో చెలరేగిన నాదల్ అలవోకగా సెట్‌ను గెలుచుకొని టైటిల్ పోరుకు చేరుకున్నాడు.
అండర్సన్ జోరు…
కరెనా బుస్తాతో జరిగిన మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు చెందిన 28వ సీడ్ కెవిన్ అండర్సన్ విజయం సాధించాడు. సెమీస్‌లో అండర్సన్ 46, 75, 63, 64 తేడాతో స్పెయిన్‌కు చెందిన బుస్తాను ఓడించాడు. తొలి సెట్‌లో బుస్తా ఆధిపత్యం చెలాయించాడు. అద్భుత షాట్లతో చెలరేగిన బుస్తా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చూడచక్కని ఆటతో ముందుకు సాగాడు. అతని ధాటికి అండర్సన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిపత్యం చెలాయించిన బుస్తా 64తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇది తాత్కాలికమే అయ్యింది. తర్వాతి సెట్‌లో అండర్సన్ పుంజుకున్నాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. అయితే బుస్తా కూడా పోరాట పటిమను కనబరిచాడు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. దీనిలో ఆధిపత్యం చెలాయించిన అండర్సన్ సెట్‌ను దక్కించుకున్నాడు. తర్వాతి సెట్‌లలో మాత్రం అండర్సన్‌కు ఎదురు లేకుండా పోయింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. దూకుడైన ఆటతో వరుసగా రెండు సెట్‌లను సొంత చేసుకొని టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. టైటిల్ వేటలో దిగ్గజ ఆటగాడు నాదల్‌తో తలపడుతాడు.

Comments

comments