Home ఆఫ్ బీట్ నొప్పించకుండా మాట్లాడ్డం

నొప్పించకుండా మాట్లాడ్డం

ప్రపంచంలో అనేక భాషలున్నా. ఎన్నో మాతృభాషలూ ఉన్నాయి. మాతృభాష అనేది కరెంటుకు రాగి తీగలాంటిది. పరభాషలు ప్టాస్టిక్ వైర్లు లాంటివి. లేదా పింగాణీ కప్పుల లాంటివి. ప్లాస్టిక్‌లో, పింగాణీలో విద్యుత్ ప్రవహించనట్లు మాతృభాషకాని భాషలో భావం కూడా ప్రసరించలేదు.

samyak1

భాష-వ్యక్తి-ప్రపంచం : ప్రపంచం అంటే సమాజం వ్యక్తికి భాషను నేర్పితే, వ్యక్తి ఆ భాషలో ప్రపంచాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాడు. అంటే వ్యక్తినీ, ప్రపంచాన్నీ ఒకే తాటిలో కట్టిపడేసే సాధనం భాష. ఆ భాష విజ్ఞాన వికాసాలకి వారధిగా నిలబడింది. భాష ద్వారా భావం ఒకరినుండి మరొకరికి ప్రవహించాలి. విద్యుత్తు ఏ విధంగా రాగి తీగల్లో వేగంగా ప్రవహిస్తుందో భాష కూడా ‘మాధ్యమం’ ద్వారా వేగంగా ప్రవహిస్తుంది. ప్రపంచంలో అనేక భాషలున్నా. ఎన్నో మాతృభాషలూ ఉన్నాయి. మాతృభాష అనేది కరెంటుకు రాగి తీగలాంటిది. పరభాషలు ప్టాస్టిక్ వైర్లు లాంటివి. లేదా పింగాణీ కప్పుల లాంటివి. ప్లాస్టిక్‌లో, పింగాణీలో విద్యుత్ ప్రవహించనట్లు మాతృభాషకాని భాషలో భావం కూడా ప్రసరించలేదు.
అందుకే బుద్ధుడు పండిత భాషల్లో కాకుండా ప్రజల మాతృభాషల్లోనే తన ప్రబోధలు చేశాడు. వ్యక్తికీ, ప్రపంచానికి ఉండే భాషా బంధాల్ని ఎంతో శాస్త్రీయంగా అర్థం చేసుకున్నాడు.
అలాగే…. మనలో ధార్మిక వికాసానికీ, నైతిక విలువలు పెరగడానికీ, దుఃఖ నిరోధం కలగడానికీ ఎలాంటి సామాజిక భాషా నియమాలు పాటించాలో చెప్పాడు. వాటినే సమ్యక్ వచనాలుగా నిర్దేశించాడు.
నొప్పించకుండా చెప్పడం:
మనిషి మనసుకు ఉండే సహజ లక్షణం పాజిటివ్‌గా ఉండే అంశాల్ని త్వరగా గ్రహించడం. ప్రతికూలంగా ఉండే వాటిని తోసెయ్యడం. కాబట్టి చెప్పే విషయాన్ని ‘అనుకూల వచనంగా’ చెప్పాలి.
అనుకూలంగా చెప్పడం అంటే…
“నొప్పించక, తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!” అన్నట్లు కాదు. నా అనుభవం ఒకటి చెప్తాను.  ఈ మధ్య నేను ఒక పత్రికకి బౌద్ధం మీద ఒక వ్యాసం పంపాను. అందులో…. “భార్యాబిడ్డల్ని, రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, సర్వసంపదల్ని త్యజించిన బుద్ధుడు, ఆరేళ్ళు శ్రమించి, తపస్సులు, ధ్యానాలు చేసి చివరికి జ్ఞానం పొందాడు, బుద్ధుడయ్యాడు. బుద్ధుడయ్యాక మొదటిగా రాజగృహకు వెళ్లాడు” అని రాశాను. ఆ వ్యాసాన్ని ప్రచురించే సమయంలో ఎడిటర్‌కు దానిలో తప్పు కనిపించింది. వెంటనే నాకు ఫోన్ చేసి “ఏమిటండీ! మీరు రాసిన దాన్లో నిర్దిష్టతలేదు. సర్వాన్ని త్యజించిన బుద్ధుడు, బుద్ధుడయ్యాక తిరిగి ‘రాజగృహకు’ ఎందుకెళ్లాడు. విలాసాలు వద్దనుకుని, జ్ఞానం పొందినవాడు తిరిగి విలాసాలున్న రాజగృహానికి వెళ్తాడా!” అన్నాడు. ఆయన ఉద్దేశంలో ‘రాజగృహ’ అంటే “రాజుల గృహం” అంటే రాజసౌధం అనుకున్నాడు.
నేను వెంటనే…. “సారీ సార్! నేను సరిగా రాయలేకపోయాను. ఆ వాక్యాన్ని ఇలా మార్చండి….” బుద్ధుడయ్యాక మగధ రాజధాని రాజగృహ అనే పట్టణానికి వెళ్లాడు” అని, అని చెప్పాను.
ఇది నేను సానుకూలంగా చెప్పిన సమాధానం. అదే, ప్రతికూలంగా చెప్పడం అంటే- “మీకు ఆ మాత్రం తెలియదా!” అని చెప్పడం. ఇది ఆయన్ని నొప్పించడం. ‘అందరికీ అన్నీ తెలిసి ఉండాలి’ అనే అజ్ఞానమే మనల్ని ఇలా ప్రతికూలంగా మాట్లాడిస్తుంది. ఎదుటివారిని హేళన చేయిస్తుంది.
పైన జరిగిన దాంట్లో ఆయనకు “తెలియలేదు” అనేది ఎంత నిజమో! “ఆయనకి తెలిసేట్టు నేను రాయలేదు” అనేది కూడా అంతకుమించిన నిజం.
రచనలో సందిగ్ధత ఉండకపోవడమే సరైన రచన. సందిగ్ధతకు తావు ఇచ్చిందంటే, ఆ రచన సరిగా లేదనే అర్థం.
కాబట్టి “ నా రచనని నేను సరిజేసుకున్నాను” తప్ప “నేను ఎలా రాసినా నీకెందుకు అర్థం కాలేదు. నా రచనల్ని అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు” అని అనుకోలేదు.
అలా అనుకోకపోవడమే సమ్యక్ ఆలోచన. ఆ ఆలోచన ఫలితమే ఆ సమ్యక్ వచనం!
ఆ ఎడిటర్‌గారు అలా మాట్లాడ్డం వల్ల నాకు మరో విషయం కూడా అర్థమైంది-
“ఆసియా జ్యోతిగా వెలుగొందిన బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో, రెండో బుద్ధునిగా కీర్తిగాంచిన ఆచార్య నాగార్జునుడు ప్రభవించిన ఈ తెలుగు నేల మీద- ఒకప్పుడు అడుగడుగున బౌద్ధం నడయాడిన ఇచ్చోట- ఇప్పుడా బౌద్ధం ఎంతగా కనుమరుగైపోయిందో! అనే అంశం కూడా నా స్మృతిపథంలో మెదలాడింది.
మన భావజాలం, మన మానవీయ సంస్కృతి మనకు ఎంతగా అందకుండా పోయిందో! అని అనిపించింది.
ఇలా చూడ్డం వల్ల ‘అది ఆ ఎడిటర్’గారి తెలియని తనంగా’ నేను భావించలేకపోయాను. అందుకే వారిని “నొప్పించకుండా సమాధానం’ చెప్పాను. దీన్నే “పాజిటివ్ అప్రోచ్‌”గా ఈనాడు వ్యక్తిత్వ వికాసాల్లో చెప్తున్నారు. ఈ పాజిటివ్ అప్రోచ్‌కి అసలైన ఆద్యుడు తథాగతుడే!
తప్పుని ఇతరుల మీదకు నెట్టకుండా, తానే సర్వజ్ఞుణ్ణని తలవకుండా ఉంటే చాలు ఈ అప్రోచ్ దానంతట అదే అలవడుతుంది.
ఒకసారి ఒక భిక్షువుల బుద్ధుని దగ్గరకు వచ్చి “భంతే! మీరు సర్వజ్ఞులు (సర్వం తెలిసినవారు) అని అంటున్నారు” అని చెప్పాడు.
“భిక్షూ! అని నేనెప్పుడు చెప్పాను. సర్వజ్ఞుడు అనేవాడు ఎప్పుడూ ఉండడు. ఎవ్వరూ ఉండరు. సర్వజ్ఞత అనేదే ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని విషయాలన్నీ మనకు తెలియవు. మారే ఈ ప్రపంచంలో విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సర్వం తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు, సర్వం ఆవరించి వ్యాపించిన వాడు ఎవ్వరూ ఉండడు. అది అసంభవం. అసత్యం” అన్నాడు- ఈ దృక్పథం ఉంటే మనం ఎవ్వరి మనస్సులూ కష్టపెట్టకుండా మాట్లాడగలం. బౌద్ధం మనకందించే సంస్కారాల్లో ఇది ఒకటి!

బొర్రా గోవర్ధన్

9390600157