Home తాజా వార్తలు అటవీశాఖ ప్రయత్నాలు భేష్

అటవీశాఖ ప్రయత్నాలు భేష్

protection-of-wildlife భారీగా అడవి దున్నల దర్శనమే నిదర్శనం
కిన్నెరసాని అభయారణ్యంలో కెమెరాకు చిక్కిన దృశ్యం
వన్యప్రాణుల సంరక్షణకు వేసవిలో ప్రత్యేక చర్యలు
నీటి చెలమలు, సహజ నీటి వనరుల రక్షణ
అటవీ పునరుజ్జీవన చర్యలతో సమృద్ధిగా జంతుజాలం

మన తెలంగాణ/ హైదరాబాద్: వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ చేపట్టిన సఁదక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నీటి చెలమలలు, సహజ నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అడవుల్లో వన్యప్రాణులతో పాటు జంతుజాలం సమృద్ధిగా ఉంటుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్తి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యాల్లో ఒకేచోట పదిహేను అడవి దున్నలు కనిపించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని అధికారులు తెలిపారు.

కిన్నెరసాని పరిధిలోని చాటకొండ అటవీ రేంజ్ చింతోని చిలక వద్ద అడవి దున్నల మంద సేద తీరుతున్న దృశ్యం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కిందని అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభ్యయారణ్యం పరిధిలో ఏడు వందల పదహారు హెక్టార్ల అటవీభూమి కొన్నేళ్ల కిందట ఆక్రమణలకు గురైంది. ఐదేళ్ల కిందట ఈ భూమిని అటవీశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న భూమిలో అటవీ పునరుద్దరణ కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతాన్ని వన్యప్రాణులకు అవాసంగా మార్చేందుకు అటవీశాఖ అధికారులతో పాటు సంబంధిత సిబ్బంది విశేషమైన కృషి చేశారు. ఈ కృషికి తగిన ఫలితం లభించడానికి తాజాగా లభించిన అడవి దున్నల మందే అనడంలో ఎలాంటి సందేహం లేదని అధికారులు తెలిపారు. ఆక్రమణలను తొలగించిన తర్వాత అడవితో పాటు వన్యప్రాణులకు అవాసంగా మార్చేందుకు అటవీశాఖ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందన్నారు.

ఇందుకోసం కంపాతో పాటు బయోశాట్ నిధులను వినియోగించి పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా అటవీ ప్రాంతం తిరిగి ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు చుట్టూ కందకాలను (ట్రెంచ్), చైన్ లింకు ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మనుష్యులతో పాటు పశు సంపద, పెంపుడు జంతువుల కదలికలు కూడా అటవీ ప్రాంతంలో లేకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు బేష్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు నీటి వసతులను కాపాడేందుకు అవసరమైన చర్యలను సైతం తీసుకున్నారు. కొన్ని చోట్ల సోలార్ బోర్లను ఏర్పాటు చేసి శాఖహార జంతువుల కోసం సహజమైన గడ్డి మైనాలను పెరిగేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు.

నిరంతర నిఘాతో పాటు తరచుగా ఉన్నతాధికారులు అటవీ ప్రాంతంలో పర్యటించడం మంచి ఫలితాలను ఇచ్చిందని ఖమ్మం రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ రాజారావు తెలిపారు. ఆక్రమణలకు గురై భూమితో పాటు అన్యాక్రాంతమైన భూములను అటవీశాఖ తన ఆధీనంలోకి ఆయా భూములను తెచ్చుకున్న తర్వాత కూడా అనేక సార్లు ఆక్రమణదారులు సదరు భూములను ఆక్రమించుకునేందుకు దాడులు చేశారని తెలిపారు. బేష్ క్యాంపును సిబ్బందిని బెదిరించడంతో పాటు బోర్‌వెల్స్‌ను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. అయినా ఏ మాత్రం బెదిరింపులకు లొంగకుండా పటిష్టమైన వ్యూహాంతో అటవీభూమిని కాపాడుకున్నామని వివరించారు. తాము ఐదేళ్లు పడిన శ్రమకు తాజాగా వచ్చిన అడవి దున్నల గుంపుతో తగిన గుర్తింపు లభించిందనిఆనందాన్ని వ్యక్తం చేశారు.

చుక్కల దుప్పి, జింకలు, అడవి పందులు, నీల్లాయి లాంటి ఇతర జంతువులు కూడా గణనీయంగా పెరిగాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుత పులుల సంచారంపై సమాచారం ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఇంకా నిర్థారణ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కిన్నెరసాని అటవీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికార యంత్రాంగం వివరించింది. పర్యాటకుల కోసం ఏకో టూరిజం ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తీసకువస్తామని తెలిపారు.

63,540 హెకార్ట విస్తీర్ణంలో ఉన్న కిన్నెరసాని అభయారణ్యం 1999లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై అయ్యిందన్నారు. గోదారికి ఉపనదిగా ఉన్న కిన్నెరసాని ద్వారా అటవీ ప్రాంతానికి అదే పేరు వచ్చిందని అధికారులు తెలిపారు. తమ అరణ్యవాసంలో భాగంగా సీతారాములు ఈ అటవీ ప్రాంతంలో కొంతకాలం పాటు గడిపారని పురణాలు చెబుతున్నాయని అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Special activities in summer for protection of wildlife