Home హైదరాబాద్ గంజాయిపై ఉక్కుపాదం

గంజాయిపై ఉక్కుపాదం

police

పోలీసుల ప్రత్యేక నిఘా
కార్లు, లారీల్లో సరఫరా
క్వింటాళ్ళుగా స్వాధీనం
నిఘా పెంచిన ఎస్‌ఓటి, టాస్క్‌ఫోర్స్‌లు

మనతెలంగాణ/ సిటీబ్యూరో
గడ్డమీది రవీందర్, లోత తమ్మినాయుడు, అనుపోజు సాయి శివకుమార్‌లు ముగ్గురు కలిసి రహస్యంగా గంజాయిని నగరంలోని ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారు. చిన్నచిన్న పాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు. వీరు గత కొన్నేళ్ళుగా ఈ వ్యాపారాన్ని సాగిస్తూ అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు తమ కార్లలోనే గంజాయిని నగరానికి చేరుస్తున్నారు. ఇటీవల పోలీసులు వీరిని అరెస్టు చేసి 110 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగర శివారు ఎల్‌బినగర్ ప్రాంతంలోనే ఉండే బచ్చు రవికుమార్ కూడా ధూల్‌పేట్ నుంచి గంజాయిని తీసుకువచ్చి అవసరమైన వారికి ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తూ తన వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇతని ఇంటిపై దాడి చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నగరంలో చిరు వ్యాపారులు గంజాయి రహాస్య వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కిలో కాదు రెండు కిలోలు కాదు ఏకంగా క్వింటాళ్ళుగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధానంగా నగర శివారులోనే ఈ నిషేధిత గంజాయి పట్టుబడుతోంది. ముఖ్యంగా నగర విద్యార్థులను, యువతనే లక్షంగా చేసుకుని ఈ గంజాయి నగరానికి చేర్చుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. రహాస్యంగా సాగించే ఈ వ్యాపారానికి ప్రధానంగా అటవీ ప్రాంతాల నుండి నేరుగా వాహనాల్లో నగరంలోని పలు ప్రాంతాల డీలర్లకు చేర్చుతున్నారు.

ఇలా సరఫరా చేస్తుంటారు
పలువురు నిందితులు కారుల్లో, లారీల్లో, ప్రైవేట్ బస్సుల్లోనూ ఈ నిషేధిత గంజాయిని నగరానికి చేర్చుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల అటవీ ప్రాంతాల నుండి ఈ సరుకును నగరానికి సరఫరా చేస్తున్నట్టు పట్టుబడిన నిందితులు వెల్లడిస్తున్నారు. అటవీ ప్రాంతంలో చాలా చౌకగా తీసుకుని, వీరు నగరంలోని సరఫరాదారులకు చేరవేస్తున్నారు. చాలా మంది ఎవరికీ అనుమానాలు రాకుండా తమ స్వంత కారుల్లోనే చిన్నచిన్న సంచులుగా ప్యాక్‌చేసి నగరానికి తీసుకువస్తున్నట్టు ఇటీవల పోలీసులకు పట్టుబడుతున్న నిందితుల తీరుతో వెల్లడవుతోంది. కొందరు లారీల్లోని ఇతర సరుకులుపైన వేసి మధ్యలో, కిందివరుసలో గంజాయిని ఏర్పాటుచేయడం, మరికొందరు ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు, తనిఖీలు చేసినా బయటపడకుండా ఉండేందుకు లారీ డ్రైవర్ వెనుకవైపు రెండు అడుగుల వెడల్పుతో బాక్స్‌ను తయారుచేయించి అందులో గంజాయిని పేర్చి నగరానికి తరలిస్తున్నారు. ఇలా నగరానికి చేరిన ముడి సరు కు గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా చేసి విద్యార్థుల కు, యువతకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ధూల్‌పేట్, జియాగూడ, ఎల్‌బినగర్, హయత్‌నగర్, లాలాగూడ, బొల్లారం వంటి ప్రాంతాల్లో వీటి విక్రయాలు సాగుతున్నాయి.

పోలీసుల ప్రత్యేక దృష్టి
నగరం, శివారు ప్రాంతాలకు చెందిన పోలీసులు ముఖ్యం గా టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటి పోలీసులు గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విక్రయదారుల నుండి అందుతున్న సమాచారంతో వారికన్నా.. సరఫరాదారులపైనే దృష్టిసారించారు. నగర శివారు మార్గాల ద్వారానే గంజాయి చేరుతున్నట్టు నిర్ణయానికి వచ్చిన పోలీసులు ముందుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలపై లక్షం చేసుకున్నారు. ఏదేని పార్శిల్‌లు ఉన్న స్వంత కార్లను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రవాణా జరుగుతున్న ఇతర సరుకుల వాహనాలను తనిఖీలు చేయకుండా వదలడం లేదు. దీంతో ఇటీవల గంజాయి విక్రయదారులు వరుసగా పట్టుబడుతున్నారు.