Home తాజా వార్తలు ప్రతి హీరోకు అదే చేస్తా

ప్రతి హీరోకు అదే చేస్తా

Director Boyapati Sreenuరామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయి న్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఇంటర్వూ విశేషాలు…

కుటుంబం పట్ల విధేయుడు..
వినయం, విధేయత ఉంది కాబట్టే రాముడు దేవుడయ్యాడు. ఇక మా సినిమాలో రాముడు కుటుంబం పట్ల విధేయుడు. ఈ విధేయత ఏ స్థాయిలో ఉంటుందనేది సినిమాలో చూస్తారు.

భావోద్వేగాలకే ప్రాధాన్యత..
నేను చేసిన ‘భద్ర’ నుండి మొదలుపెట్టి ‘వినయ విధేయ రామ’ వరకు కుటుంబ భావోద్వేగాలకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆతర్వాతే సమాజం గురించి. కథలో ఇంకా స్కోప్ ఉందనుకుంటే ఇతర విషయాల గురించి ఆలోచిస్తా.

ఇదే సరైన సమయం..
ఈ సినిమా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ను చూస్తే ఐరన్‌మ్యాన్‌లా కనిపిస్తాడు. ఆ బాడీలో ఈరోజు ఉన్న పర్‌ఫెక్షన్ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్ఫెక్షన్ కోసం సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు ఇదే సరైన సమయం. ‘వినయ విధేయ రామ’ విజన్ నుండి విజువల్ వరకు ఉన్న మెయిన్ కనెక్టివిటీ రామ్‌చరణ్. ఆయన లేకపోతే ఇది సాధ్యపడేది కాదు.

ఎదుగుతూనే ఉంటాడు..
నాకు రామ్‌చరణ్‌లో ఎక్కువగా నచ్చింది ఒక్కటే. ఆయనకు అస్సలు తృప్తి ఉండదు. ఎంత సాధించినా ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాడు. సినిమా సినిమాకు ఎదుగుతూనే ఉంటాడు. ఇంకా ఆశగా చూస్తూనే ఉంటాడు.

బాగా ఆలోచించి తీసుకున్నాం
మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు ఒక కొత్త పాయింట్‌ను ‘వినయ విధేయ రామ’లో చూపించాం. అది ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌కు సరిగ్గా సరిపోయే నటులను మాత్రమే తీసుకున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, హీరోకు పెద్దన్నయ్య అన్నప్పుడు… ఎవరిని తీసుకున్నా ఆ పాత్రకు పూర్తిగా సరిపోవాలి. అందుకే ఈ పాత్రకు ప్రశాంత్‌ను తీసుకున్నాం. అలా వరుసగా ప్రతి పాత్రకు బాగా ఆలోచించి నటులను తీసుకోవడం జరిగింది.

వెంటనే డేట్స్ ఇచ్చేశాడు..
ఈ సినిమా కోసం వివేక్ ఒబెరాయ్‌ను కలిసినప్పుడు ‘రక్త చరిత్ర’ స్థాయి సినిమా అయితేనే చేస్తానన్నాడు. అయితే తన క్యారెక్టర్ గురించి చెప్పగానే వెంటనే డేట్స్ ఇచ్చేశాడు. అదే కమిట్‌మెంట్‌తో సినిమా చేశాడు.

ఇది కూడా అలాంటిదే..
ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరోకు అభిమానినై చేస్తా. చరణ్ కోసం సినిమా రాసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చొని చూస్తున్నట్లుగా ఫీలై కథ రాసుకున్నా. ప్రతి హీరోకు అదే చేస్తా. ఇది కూడా అలాంటి సినిమానే.

కలర్‌ఫుల్‌గా ఉండాలి..
నా దృష్టిలో సినిమా అంటే కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే ఎక్కువగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో కథలను ఎంచుకుంటాను. అందుకే నా ప్రతి సినిమాలో రిచ్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కనిపిస్తుంది.

దమ్ము తప్పనిసరిగా..
నేను చిన్న సినిమాలు చేయలేను. నా నుండి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తున్నారో అది వంద శాతం ఇవ్వాలని అనుకుంటాను. అవతల అంచనాలు ఒకలా ఉండి… మన ప్రోడక్ట్ ఇంకోలా ఉంటే మ్యాచ్ అవ్వదు. అందుకే నేను చిన్న సినిమాలు చేయను. ఒకవేళ నేను బయోపిక్ చేసినా అందులో కూడా దమ్ము తప్పనిసరిగా ఉంటుంది.

Special Interview of Director Boyapati Sreenu