Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మహిళలకు భరోసా.. ట్రుత్ ల్యాబ్

Special Interview of founder of Truth labs Dr. Gandhi PC Kaza

మహాత్మాగాంధీ ఆశయాలు ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాయి. సమాజానికి ఏదో చేయాలనే తపన ఆ కుటుంబసభ్యుల్లో కనిపిస్తుంటుంది. మూడు తరాలనుంచి ఆ కుటుంబ ఆస్తుల్లో సేవారంగానికి ఒకభాగం కేటాయించడం ఆనవాయితీ అయింది. దేశంలోని ఫోరెన్సిక్ నిపుణుడు కెసిపి గాంధీ కుటుంబ కథ ఇది. ఉమ్మడి పాలనలో పోలీసు శాఖలో ఫోరెన్సిక్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన గాంధీ  పదవీ విరమణ అనంతరం  సేవాభావంతో  సొంతంగా ప్రయోగశాల ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ పరిశోధనల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. నేరాలు లేని సమాజంకోసం ప్రభుత్వానికి సహకరిస్తూ అనేక పరిశోధనల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ట్రూత్ లాబ్ పేరుతో స్థాపించిన ఈ సంస్థ సేవలను దేశవ్యాప్తంగా అనేక నేరాల పరిశోధనకు ఉపయోగించుకుంటున్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించి లక్షల్లో వేతనం పొందుతున్న ఆయన కూతుళ్ళు కూడా తండ్రికి బాసటగా జీన్స్ పరిశోధన కేంద్రాన్ని స్థాపించి ప్రజలకు డిఎన్‌ఏ పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. ట్రూత్ లాబ్ ద్వారా అనేక  ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి ఆధునిక సేవలు అందిస్తున్న కెసిపి గాంధీ కుటుంబం మూడుతరాలనుంచి ప్రజాసేవకే అంకితమైన కుటుంబం. మహాత్మాగాంధీ  ప్రేరణతో సొంత ఆస్తులను సేవకు వినియోగిస్తున్న కెసిపి.గాంధీతో దునియా ప్రత్యేక ఇంటర్వూ…

కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం సౌభాగ్యంగా ఉంటుంది: ప్రసిద్ధ ఫోరెన్సిక్ నిపుణుడు డా.కెసిపి గాంధీ

ట్రూత్ ల్యాబ్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
ప్రజలకు ఆధునిక వైద్యం అందించడంతో పాటు నేరపరిశోధనల్లో ట్రూత్ ల్యాబ్ ముందుంది. ప్రజలకు సేవచేయాలనే తపనతోనే దీనిని స్థాపించాను. నేరాలు లేని సమాజంకోసం చేస్తున్న కృషిలో భాగమే ఈ ల్యాబ్ ఆవిర్భావం. నేరం జరగ్గానే ఆధారాలకోసం అన్వేషిస్తారు. అనేక నేరాలు ఆధారాలు లేక కోర్టుల్లోనే కేసులు మగ్గి పోతుంటాయి. కొన్ని కేసుల్లో బాధితులకు సరైన న్యాయం జరగకపోవచ్చు. అయితే శాస్త్రీయ పరీక్షలు చేస్తే అనేక ఆధారాలు లభ్యం అవుతుంటాయి. ప్రధానంగా ఫోరెన్సిక్ పరిశోధన తప్పనిసరి. ఇటీవల ఓ ప్రముఖ మహిళను యూట్యూబ్‌లో అసభ్యకరంగా పోస్టుచేసి ఆమె ప్రతిభను దిగజార్చే ప్రయత్నం చేశారు. ఈ కేసు ట్రూత్ ల్యాబ్ కు రాగానే శాస్త్రీయ పరిశోధనలు చేస్తే వీడియోలో ఉంది ఆమె కాదు. మార్ఫింగ్ చేసి కొంతమంది పోస్టు చేశారు. దీనిని నిరూపిస్తూ చేసిన శాస్త్రీయ పరిశోధనలను న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇచ్చింది. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల గుట్టును ఫోరెన్సిక్ ద్వారా విప్పేందుకు అనేక పరిశోధనలు అందుబాటులో ఉన్నాయి. నేరాలను శాస్త్రీయంగా పరిశీలిస్తే అనేక అంశాలు వెలుగులోకివస్తాయి. ప్రధానంగా మహిళలకు రక్షణగా ఫోరెన్సిక్ నిలుస్తుంది. మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది.

ఫోరెన్సిక్ పరిశోధనలకే ట్రూత్ ల్యాబ్ అంకితమవుతుందా? డిఎన్‌ఏ పరీక్షలు చేస్తుందా?
నా బాటలోనే నాకూతుళ్ళు వస్తున్నారు. విదేశాల్లో లక్షల వేతనాన్ని కాదని జీనో ల్యాబ్ నిర్వహణకు సిద్ధమయ్యారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి కుటుంబం డిఎన్ ఏ పరీక్షలు చేసుకుని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను ముందుగానే గమనిస్తున్నారు. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే డిఎన్‌ఏ పరీక్షలు అనివార్యం. రోగానికి మందు వాడే బదులు ఆరోగ్యంగా వచ్చే జీన్స్ ను గమనించాలి. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కుటుంబవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంటాయి. కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉంటేనే దేశం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆధునిక వైద్యసేవలకు డిఎన్‌ఏ తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది. లాభాపేక్ష లేకుండా కూతుళ్ళు అనుపమ, అన్నపూర్ణ జినో ఫౌండేషన్ ద్వారా డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి వ్యక్తిలోని డిఎన్‌ఏ ను కనుగొంటే వ్యాధుల నివారణ సులభం అవుతుంది. తరతరాలనుంచి జీన్స్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించే అవకాశాలు ఉన్నాయి.

జీన్స్ పరిశోధనలతో ఎలాంటి వ్యాధులను నివారించవచ్చు?
భారతీయ సంస్కృతి వేలసంవత్సరాల నాటిది. ఇక్కడి ప్రజల్లో తరతరాల జీన్స్ ను అన్వేషించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రాచీన సమాజం లో జరిగిన యుద్ధాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు వంశపారంపర్య జీన్స్ లో మిళితమై ఉంటాయి. వీటిని అన్నిటిని నిశితంగా పరిశీలిస్తేనే రోగనిర్ధారణ చేయవచ్చు. తెలంగాణ ప్రజల్లో పోరాటం చేసే జీన్స్ అధికంగా ఉంటాయి. అనేక రాజవంశాలు తెలంగాణ ను కేంద్రంగా చేసుకుని పరిపాలించడంతో పోరాటయోధుల జీన్స్ ఉన్నాయని పరిశోధకులు భావిస్తారు.

జీన్స్ ద్వారా వంశపారంపర్య వ్యాధులను గుర్తించవచ్చా?
ప్రధానంగా కుటుంబపరంగా జీన్స్ ద్వారా వచ్చే వ్యాధులను కనుగొని ముందస్తుగా నివారించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలను పట్టి పీడిస్తున్న తలసేమియా, కేన్సర్, కిడ్ని వ్యాధుల లక్షణాలను జినోమ్ ద్వారా ముందుగా పసిగట్టి వైద్యులకు వివరిస్తే వాటిని నియంత్రించే వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి వ్యక్తి కదలికపై శరీరంలో ఉండే జీన్స్ ప్రభావం ఉంటుంది. అలాగే ఆత్మహత్యలను ప్రేరేపించే జీన్స్ కూడా ఉంటాయి. ఈ నేపధ్యంలో జినోఫౌండేషన్ ద్వారా ప్రజలందరికి డిఎన్‌ఏ పరీక్షలు చేయాలనే తపన మా కుటుంబంలో ఉంది. అయితే పాలకవర్గం స్పందిస్తే కానీ ఇది సాధ్యం కాదు. సంపూర్ణ ఆరోగ్యమైన కుటుంబ వ్యవస్థను సమాజానికి అందించాలంటే డిఎన్‌ఏ పరీక్షలు అనివార్యం అవుతాయి. అప్పటివరకు రోగం వస్తే మందులు వేసుకోవడమే కానీ అనారోగ్యం ఎందుకు వస్తుంది. మూలాలు ఏమిటి, ఎన్ని తరాలనుంచివస్తుంది. ఇంకా ఎన్ని తరాలు ఈ బాధను అనుభవించాలి అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. అందుకే ఆరోగ్యకరమైన సమాజంకోసం నా కూతుళ్ళు సేవాభావంతో ముందుకు వచ్చారు.

మీకు గాంధీ పేరు ఎలావచ్చింది?
మా ముత్తాత పరుశురామదాసు. 1927లో శ్రీసీతారామాంజనేయ ట్రస్టును ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ట్రస్టును మహాత్మాగాంధీ సందర్శించి అభినందించారు. స్వాతంత్య్ర పోరాటాలకు మా తాత ఇంట్లోని బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆనాటినుంచి మహాత్ముని ఆశయాలు మా కుటుంబాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత పుట్టిన నాకు గాంధీ పేరును ముత్తాత పెట్టారు. తాత తన ఆస్తిలోని మూడవవంతు సేవకు వినియోగించారు. ఆ ప్రేరణతోనే నేను నా ఆస్తిని మూడు భాగాలుచేసి మూడవభాగాన్ని ట్రూత్ ల్యాబ్ పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. పోలీసు శాఖలో ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన నేను సత్యశోధనలో ఉత్తమ శిక్షణకోసం అమెరికా వెళ్ళాను, జపాన్, జర్మనీ,లండన్ తదితరదేశాల్లో పర్యటించి నేర పరిశోధనలపై అధ్యయనం చేశాను. పదవీ విరమణ అనంతరం ప్రైవేటు రంగంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఇటీవల నిమ్స్ ఆసుపత్రితో అవగాహన ఒప్పందం కుదిరింది. జినోఫౌండేషన్ ద్వారా డిఎన్‌ఏ పరీక్షల్లో సహకారం అందిస్తున్నాము. నేర పరిశోధనలకే ట్రూత్ ల్యాబ్ సేవలు పరిమితం కాకుండా కుటుంబసభ్యులు జీనోమ్ పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మీ ల్యాబ్ కుటుంబాలకు ఏ మేరకు సహాయకారిగా ఉంటుంది?
కుటుంబాల్లోని డిఎన్‌ఏను పరిశీలిస్తే వంశపారంపర్యంగా వచ్చేవ్యాధులను ముందుగానే గమనించవచ్చు. ప్రధానంగా అనేక కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చేవ్యాధులు ఉంటాయి. వాటిని నివారించే అవకాశాలు వైద్యరంగంలో ఉన్నాయి. ఆ వ్యాధులకు ప్రేరకాలైన జీన్స్‌ను పరిశీలిస్తే వాటిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు కిడ్ని, కేన్సర్, రక్తహీనత ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నివారణ జీన్స్ పరిశోధనతో వైద్యశాస్త్రంలో సాధ్యమవుతుంది.

మీ దగ్గర పరీక్షలు చేయించుకుంటే నివేదికలు రహస్యంగా ఉంటాయా?
కచ్చితంగా రహస్యాలను పాటిస్తాము. ప్రతి కుటుంబం డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఆధునిక వైద్యం అనేక సవాళ్ళను అధిగమిస్తుంది. జీన్స్ పరిశోధనతో మనమెవరము, మన పూర్వీకుల జీన్స్ ఎలా ఉండేవి, కుటుంబపరంగా ఎలాంటి వ్యాధులు తరతరాలనుంచి వస్తున్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికుటుంబం పరీక్షలు చేయించుకోవాలంటే ప్రభుత్వ నిర్ణయాలమేరకే సాధ్యం అవుతుంది.

మీ ల్యాబ్ నేర పరిశోధనలకే పరిమితమైందా?
ట్రూత్ ల్యాబ్ అన్నిరకాల పరీక్షలు చేస్తుంది. నేర పరిశోధనలకోసం ఫోరెన్సిక్ పరీక్షలు ట్రూత్ ల్యాబ్ చేస్తుంది. అలాగే కుటుంబసభ్యులు డిఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నారు. మా కుటుంబం పూర్తిగా ఈ రంగాన్నే ఎంచుకుంది. ప్రజలకు ఆధునిక సేవలందించాలనే తపన నాలో ఉంది. అందుకే నా ఆస్తిలో మూడవ వంతు సేవ, ధర్మం కోసమే కేటాయించాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆధునిక వైద్యసేవలను ఉపయోగించుకుంటే ఎలాంటి వ్యాధులనైనా నియం త్రించవచ్చు. డిఎన్‌ఏ పరీక్షలు చేయించుకుంటే తరతరాల సౌభాగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే ఆశా భావాన్ని కెసిపి గాంధీ వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ధీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడే బదులు ఆధునిక పరీక్షలద్వారా రాబోయే ప్రమాదాలను అధిగమించవచ్చని ఆశిద్దాం.

-వి.భూమేశ్వర్ మనతెలంగాణ ప్రతినిధి

Comments

comments