Home సినిమా వారి నమ్మకమే మంచి అవకాశాలనిచ్చింది

వారి నమ్మకమే మంచి అవకాశాలనిచ్చింది

సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో సుధీర్‌బాబు తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ నటించారు. ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… 

naresh

నేను అన్నట్లుగానే…
సుధీర్‌బాబు కెరీర్‌లోనే ‘సమ్మోహనం’ ది బెస్ట్ అవుతుందని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే చెప్పాను. నేను అన్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం పెద్ద దర్శకులతో పాటు చిన్న దర్శకులు చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. హెల్దీ మూవీస్ వస్తున్నాయి. అన్ని చిత్ర పరిశ్రమలు టాలీవుడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఎపిక్ మూవీ అంటున్నారు…
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు కథ చెప్పగానే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను. నా మాట నిజమైంది. అందరూ దీన్ని ఎపిక్ మూవీ అంటున్నారు. ప్రేమ కథను కొత్త కోణంలో చూపిస్తూ వినోదం, డ్రామాను జతచేసి ఇంద్రగంటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
అతను తప్ప మరొకరు చేయలేరనేలా…
సినిమాలో సుధీర్‌బాబు బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పాత్రను అతను తప్ప మరొకరు చేయలేరనేలా నటించాడు. అలాగే అదితిరావు హైదరీ చక్కగా నటించింది. పవిత్రా లోకేష్ కూడా చాలా చక్కగా నటించారు.
నేను గర్వపడుతున్నా…
సినిమాను సినిమాగా తీస్తే సక్సెస్ కావు. సామాన్య ప్రేక్షకుడి దృష్టితో తీస్తే సక్సెస్ ఖాయమని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఇలాంటి సినిమాలో నేను భాగమైనందుకు నటుడిగా గర్వపడుతున్నాను.
‘దృశ్యం నుండి విభిన్న పాత్రలు…
నటుడిగా ఎస్.వి.రంగారావు, కమల్‌హాసన్‌లను ఇష్టపడుతుంటాను. అందుకే విలక్షణమైన పాత్రలను నా కెరీర్ ప్రారంభం నుండి చేస్తూ వస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘దృశ్యం’ నుండి విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను.
అందుకు కారణం దర్శకులే…
ఈ ఏడాది రంగస్థలం, మహానటి వంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ఇంత మంచి పాత్రలు రావడానికి కారణం దర్శకులే. వారు నాపై పెట్టుకున్న నమ్మకమే మంచి అవకాశాలనిచ్చింది. అలాగే నా గురువు జంధ్యాల ప్రభావం కూడా నాపై ఎంతో ఉంది.
మంచి పాత్రలో ఒక సీన్ ఉన్నా…
నేను పెద్ద, చిన్న సినిమాలు అని కాకుండా మంచి సినిమాలు చేయాలని చూస్తాను. కాబట్టి మంచి పాత్రలో ఒక సీన్ ఉన్నా కూడా చిన్న సినిమాలో నటిస్తాను. చిన్న సినిమాలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను.