Home లైఫ్ స్టైల్ ఉస్మానియా పాటల ఉద్యమ కెరటం..

ఉస్మానియా పాటల ఉద్యమ కెరటం..

 అన్ని మతాలకు అన్ని కులాలకు విభిన్న భావజాలాలకు ఎన్నో ఆలోచనలకు నిలయం ఎన్నో చర్చలకు వేదిక.  దాని పాత్ర అద్వితీయం అక్కడ ఉద్యమాలతో పాటు చదువు, పరిశోధనలు విలువలు నేరిస్తుంది. తెలంగాణకి  గుండెకాయలాంటిది ఓయూ. ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఒక వేదిక. ఆ వేదిక నుండి ఎందరో మహానుభావుల్ని  ఉద్యమకారుల్ని డాక్టర్లను టీచర్లను రాజకీయ నాయకులను ఇలా  జార్జిరెడ్డి, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, విద్యసాగర్‌రావు, మారోజు వీరన్న లాంటి వారందరినీ తయారు చేసిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. అదే వారసత్వంతో  తెలంగాణ ఉద్యమంలో “వీరులార వందనం” అంటూ తెలంగాణ పల్లెపల్లెన  తన పాటతో ఉద్యమానికి ఊపిరిలూదిన కళాకారుడు డా॥ దరువు ఎల్లన్న. ఉస్మానియా యూనివర్సిటీలో తన ప్రస్థానాన్ని ఆయన మనతెలంగాణ యువతో పంచుకున్నారు.. 

lf

దరువు ఎల్లన్న అని పిలుస్తారు. దరువు మీ ఇంటి పేరా?
ఇంటి పేరు కాదు నిజానికి బొడ్డు ఎల్లయ్య నా పేరు. కాని దరువు అంటే సంఘం పేరు. దరువు అని నన్ను ఎందుకు పిలుస్తారంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1999 డిసెంబర్ 20న సిద్దిపేట డిగ్రీ కాలేజిలో దరువు కళా బృందం స్థాపించాం. ఆ సంఘంలో నేను ముఖ్య పాత్ర పోషించి చాల కార్యక్రమాలు చేశాను. మా దరువు సిద్దిపేటకే అంకితం కాకుండా తెలంగాణ ప్రాంతం అంతటా పల్లె పల్లెనా మా డప్పు దరువు కళా బృందాన్ని విస్తరించాం. అలా నాకు దరువు ఎల్లన్న అని పేరు వచ్చింది.
వీరులార వందనం పాట గురించి…
ఈ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, ప్రజలను ఐక్యం చేయడానికి ఉపయోగపడ్డది. 1969నాటి అమరవీరుల గురించి రాసిన పాట ఇది. నాకు గొప్ప పేరు గుర్తింపు తెచ్చిపెట్టిన పాట. 2007లో ఈ పాట రాయడానికి కారణం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు వచ్చాయి. కాని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 369 విద్యార్థుల మరణాన్ని ఎత్తి పడుతూ పూర్తి స్థాయిలో ఒక్క పాట కూడ లేదుకదా. ఆ సమయంలో ఓ పాట రాయాలని అనిపించింది. 2009 తెలంగాణ ఉద్యమంలో ఈ పాట నన్ను నా పేరును తెలంగాణ పల్లె పల్లెకు తెలిపింది.
మీకు గుర్తింపు తెచ్చినవి రాసి పాడినవి ఇంకా ఏమైనా అల్బమ్స్…
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను జైలుకు పోయాను. అక్కడ చంచల్ గూడ జైలులో ‘చంద్రవంకలార, ఓ ఎంఏ చేసే సమ్మన్న’ వంటి పాటలు గుర్తింపు నిచ్చాయి. ఇంకా మా ఊరి గురించి ఒక పాట కూడ రాశాను. ‘అత్తెరుగుట్ట చాపల మడుగు ఆగమైపోతున్నాయి, అత్తెసరుపంట ఆకలిమంట పల్లెల్లో కనబడుతుంది’ అంటూ రాశాను. అలా మా ఊర్లో గొప్ప స్థానాన్ని సంపాదించాను. ‘వీరులార వందనం’ పాట నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. పాటలకు వచ్చే స్పందన పాట పాడినపుడు ప్రజలు కొట్టే చప్పట్లు గోల్డ్ మెడల్ వచ్చిన దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. ఒక వందకుపైగా పాటలు రాసి పాడాను. తెలంగాణ గుండె చప్పుడు, కొట్లాట, దళిత రత్నాలు వంటి అల్బమ్స్ చేశాను. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా “వలపోత” అనే సిడిని అల్బమ్ చేసి అమ్మి దానికి వచ్చిన పైసలు వరద బాధితులకు ఇచ్చాను.
మీ దరువు కళా బృందం గురించి ..
ప్రజల కోసమే కళలు. దళిత బహుజనులకు కళలు ఉన్నాయి. ఆ కళలు వృథాకా కూడదు. కళలను ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాను. నేను చదువుకుంటున్నప్పుడు అప్పటికే బిఎస్‌పి, తెలంగాణ చైతన్య వేదికలు ఉన్నాయి. వాటి ప్రభావం నా మీద ఉంది. విద్యార్థి దశలో ఉన్న చైతనాన్ని నిర్వీర్యం కానివ్వకూడదని, ఇంత అద్భుతంగా డప్పు కొడుతూ దరువు వేస్తూ.. ఇన్ని కళలు మాలో ఉన్నప్పుడు ఈ కళకారులందరిని ఐక్యం చేయాలనుకున్నాను. అలా దరువు కళాబృందాన్ని ఏర్పాటు చేశాను.
కళాకారుడిగా ఎదగడానికి మీ పై వేసిన ప్రభావం….
మా అమా, అక్క బతుకమ్మ పాటలు పాడేవారు. మా అన్నయ్యలు వేషాలు వేసి ఊర్లో రామాయణం, బాగోతాలు చెప్పేవారు. వారి ప్రభావం నాపై ఉంది. నేను డిగ్రీ చదువుతున్నపుడు మా కాలేజిలో స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణభారతి అనే ప్రోగ్రాంలో ఒక పాట పాడాను. అప్పుడు మా గురువు నందిని సిధారెడ్డి ఆ పాటకు నాకు ఆవార్డు ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఏ ప్రోగ్రాంలో నేను పాడినా నాకే మొదటి బహుమతి వచ్చేది.
2004లో ఉస్మానియా యూనివర్సిటీలో టాగూర్ ఆడిటోరియంలో యక్షగానం, గంగిరెద్దుల ఆటలతో దాదాపు 2000 మందితో పెద్ద ఎత్తున దరువు జాతర జరిపాం.ఇప్పటి వరకు దరువు కళా బృందంచేత చాల కార్యక్రమాలు చేశాం. వచ్చే డిసెంబర్‌లో 20వ వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహిం చబోతున్నాం.
మీ కలాంతర వివాహం గురించి…
నేను సాధారణ వ్యవసాయ కూలి కుటుంబంలో జన్మించాను. 5గురు అన్నలు ఒక అక్క . నేనే మా ఇంట్లో చిన్నవాడిని. నేనొక్కడినే మంచిగా చదువుకున్నాను. మాది పాత జిల్లా కరీంనగర్ ఇప్పుడు రాజన్న సిరిసిలా ్ల జిల్లా లో ఎల్లరెడ్డి పేట మండలంలోని బండలింగం పల్లి గ్రామం.. భారత దేశానికి కింద శ్రీలంక ఎలా ఉంటుందో మా ఊరు మా వాగు అవతల మారుమూల గ్రామం అలా ఉంటుంది.మా ఊర్లో నా పదో తరగతి మాతో మొదలయింది. ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకుని మా అన్న పిల్లలు మంచి చదువులు చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. నా జీవిత సహచరికి నాకు కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. ఆమె అప్పటికే పిడిఎస్‌యూలో కార్యకర్త. అలా మా ఇద్దరి భావజాలం ఆలోచనలు దగ్గరగా ఉండేవి. అంబేడ్కర్ చెప్పినట్లు ఈ దేశంలో కులం, మతం పోవాలంటే కులాంతర మతాంతర వివాహాలు జరగాలి.
అప్పుడే కులాలు మతాలు అంతమవుతాయని ఆ మహానుభావుడు చెప్పిన మాటలను నేను నిజం చేయాలనుకున్నాను. ఆచరణలో పెట్టాను. సంప్రదాయ పెళ్లి చేసుకోలేదు. స్టేజి మ్యారేజి చేసుకున్నాను.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీ పాత్ర..
ఒకరికి ఒకరు పరిచయం లేకున్నా ఒయు విద్యార్థి అంటే చాలు అందరం ఒక్కటే అనే భావన ఏర్పడుతుంది. ఉస్మానియాలో కళ్ల ముందే తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆ చరిత్రలో మేము భాగమవడం గొప్ప అనుభూతి. ఉద్యమం కోసమే నన్ను డప్పు కొట్టించుకోవడానికి పిలిపించుకుందా అని అనిపించేది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులను అరెస్టు చేసేందుకు 18 నుంచి 25 సంవత్సరాల యువకులు కనిపిస్తే చెప్పిన వారికి ఐదువందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. వడ్డెర బస్తీ తల్లులు మాకు అన్నం పెట్టి ఉద్యమానికి మాతో నడిచారు. సిద్దిపేటలో డిగ్రీ అయిపోగానే 2000లో పీజికి ఉసానియా యూనివర్సిటిలో సీటు వచ్చింది. పీజి అయిపోగానే ఎంఫిల్ చేశా తర్వాత పిహెచ్‌డి చేసి 2014 లో డాక్టరేట్ పట్టా పొందాను. యూనివర్సిటిలో తెలంగాణ స్టూడెంట్ ఫోరమ్ (టిఎస్‌ఎఫ్) మీటింగ్‌లో మొదటి పాట పాడాను. అలా మొదలయ్యింది యూనివర్సిటిలో కళాకారుడిగా ఉద్యమకారుడిగా నా ప్రయాణం. 2006 లో తెలంగాణ విద్యార్థివేదిక (టివివి) సంఘం కన్వీనర్‌గా పనిచేశాను. వర్సిటీతోపాటు కొమురం భీం, చాకలి ఐలమ్మలాంటివారు నాకు స్ఫూర్తి.