Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అప్పుడే నటుడి కెరీర్‌కు పరిపూర్ణత

cini

గోలీసోడా ఫిలిమ్స్ బ్యానర్‌పై అర్జున్‌రెడ్డి, శివానీసింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీధర్ మర్రితో ఇంటర్వూ విశేషాలు…

ఇన్ఫోసిస్‌లో వైస్‌ప్రెసిడెంట్‌గా చేశాను…
మా స్వస్థలం హైదరాబాద్. అయితే కొన్ని కారణాల వల్ల మా కుటుంబం బెంగుళూర్‌లో స్థిరపడింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత మాస్టర్ ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్ కోర్సు చేశాను. ఆతర్వాత కోల్‌కతాలో ఐఏఎమ్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా 15 ఏళ్లు పనిచేశాను.
సినిమాలంటే ఆసక్తి…
చిన్నప్పటి నుంచే సినిమాలతో పాటు కథలంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. ఊహ తెలిసినప్పటి నుంచి కథలు రాయడం అలవాటుగా మారింది. అయితే ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పడే ఓ సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో ఓ మంచి కథ రాసుకున్నాను. అదే ‘ఏ మంత్రం వేసావే’.
యువతకు సందేశాన్నిస్తూ…
మన చుట్టూ అనునిత్యం జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నాను. నేడు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌లో మునిగితేలుతున్నారు. ఈ పిచ్చిలో ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలైంది. సోషల్ మీడియా మోజులో భావోద్వేగాల్ని, బంధాల్ని మర్చిపోవడం జరుగుతోంది. దీన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని యువతకు సందేశాన్నిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.
అందుకే స్వీయ దర్శకత్వంలో నిర్మించాను…
‘పెళ్లిచూపులు’కు ముందే విజయ్ దేవరకొండకు ఈ కథ చెప్పాను. అయితే ఇలాంటి కథతో రిస్క్ చేయడానికి ఏ నిర్మాత ముందుకురాడని గ్రహించి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఉద్యోగం చేస్తూ సినిమా చేయడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ సమయంలోనే విజయ్ చేసిన పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత చిత్రాలకు ఏమాత్రం సంబంధం లేనివిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుంది.
నటులకు స్వేచ్ఛనివ్వాలి..
విభిన్నమైన పాత్రల్లో నటించేలా నటులకు ప్రేక్షకులు స్వేచ్ఛనివ్వాలి. ఒకే తరహా పాత్రల్లో నటులను చూస్తామనడం సరైనది కాదు. అమీర్‌ఖాన్ ‘దంగల్’ సినిమా చేసిన తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తానంటే కుదరదు కదా. కొత్త తరహా కథలు చేస్తేనే నటుడి కెరీర్‌కు పరిపూర్ణత చేకూరుతుంది.
కథ నచ్చి ముందుకొచ్చారు…
ఈ సినిమా పూర్తయిన తర్వాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్‌లను సంప్రదించాను. కానీ ఎవరూ దీన్ని విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో సినిమా కథ నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మల్కాపురం శివకుమార్ ముందుకొచ్చారు. ఈ సినిమా విడుదల తర్వాత ఓ కొత్త తరహా కథతో తదుపరి చిత్రానికి శ్రీకారం చుడతాను.

Comments

comments