Home సినిమా మనం చేస్తున్న తప్పే అది

మనం చేస్తున్న తప్పే అది

సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంటర్వూ విశేషాలు…

indraganti

అన్నీ చక్కగా కుదిరాయి…

సినిమా చాలా బాగా వచ్చింది. నేను తీసిన సినిమాల్లో తక్కువ అసంతృప్తినిచ్చిన సినిమా ఇది. కొన్ని సినిమాలకు మాత్రమే అన్నీ చక్కగా అమరుతాయి. అలా అన్నీ చక్కగా కుదిరిన సినిమా ‘సమ్మోహనం’. లుక్‌పరంగా, విజువల్‌గా, నటీనటుల పరంగా అన్నీ బాగా కుదిరాయి. సుధీర్‌బాబు ఫ్రెష్ లుక్‌లో కనపడతారు. అదితిరావు అందంగా కనపడుతుంది. ఇది నాకు స్పెషల్ మూవీ.
ఆ పాత్రే సూత్రధారి…

సుధీర్ తండ్రి పాత్రలో నరేశ్ కనిపిస్తారు. నాకు చాలా ఇష్టమైన పాత్ర ఇది. ఆ పాత్రలాంటి వ్యక్తి నాకు ‘గోల్కోండ హైస్కూల్’ సినిమా సమయంలో తగిలాడు. అదే క్యారెక్టర్‌తో ఓ సినిమా రాస్తే బావుంటుందనిపించి కథను మొదలుపెట్టి దాన్ని లవ్ స్టోరీగా మలిచాను. నరేశ్ పాత్రే ఈ సినిమాకు సూత్రధారి. ఆ పాత్రకు సినిమాలంటే పిచ్చి. సినిమా అంటే గొప్ప కళ అనే భావనలో ఉంటాడు. అయితే హీరో అందుకు భిన్నంగా ఉంటాడు.
తండి, కొడుకుల మధ్య సంఘర్షణ...

సినిమాలో చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా హీరో సుధీర్ కనపడతాడు. తనకు సినిమా నటులంటే పెద్దగా ఇష్టం ఉండదు. తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణలో హీరోయిన్ పాత్ర ఎలా ప్రవేశించిందనేదే సినిమా. ముందుగా తండ్రి పాత్రకు నరేశ్‌ను అనుకోలేదు. కానీ ఇద్దరు, ముగ్గురు మిత్రులు ఆ పాత్రకు నరేశ్ అయితే బావుంటుందని సలహా ఇచ్చారు. ఆయన నటించిన తర్వాత మరొకరు చేయకపోవడమే బావుందనిపించింది.
అది నచ్చడంతో వెళ్లి కలిశా…

ముందుగా సుధీర్‌బాబు పాత్రకు విజయ్ దేవరకొండను అనుకున్నాను. కానీ ‘అర్జున్‌రెడ్డి’ విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. అలాగే నాని అనుకుంటే అతను ఇప్పుడు స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఆ సమయంలో ‘శమంతకమణి’ చిత్రంలో సుధీర్‌బాబును చూశాను. అందులో తన తల్లి గురించి అతను మాట్లాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది నచ్చడంతో వెంటనే వెళ్లి అతన్ని కలిశాను. చివరికి సుధీర్‌బాబు ఈ సినిమాకు ఒప్పుకున్నాడు.
కథ నచ్చి చేసింది…

మూడు, నాలుగు హిట్స్ ఇచ్చిన నార్త్ ఇండియన్ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాం. తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్ల ఇమేజ్ చాలా పెద్దది. హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు మణిరత్నం ‘చెలియా’ సినిమా చూశాను. అందులో చేసిన అదితిరావ్ హైదరి హీరోయిన్‌గా సరిపోతుందనిపించింది. ఆ సమయంలో ఆమె భూమి, పద్మావత్ సినిమాల్లో నటిస్తోంది. ఆమెకు నేను ఫోన్ చేసి… ‘ముందు ఐడియా వినండి. నచ్చితే పూర్తి కథ ముంబయ్ వచ్చి చెబుతాను’ అని చెప్పాను. ఐడియా విన్న అదితి కథను కూడా ఫోన్‌లో చెప్పమంది. తనకు కథ నచ్చడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి నటించింది.
కొత్త ట్రెండ్ బావుంది…

ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ చాలా బావుంది. రామ్‌చరణ్ వంటి స్టార్ హీరో ఓ చెవిటివాడి పాత్రలో నటించి మెప్పించడం చాలా గొప్ప విషయం. తెలుగు సినిమాలో మార్పుకు మంచి ఉదాహరణ ఈ చిత్రం. అలాగే ‘మహానటి’ విషయానికి వస్తే ఈ మహిళా సినిమాలో ఎలాంటి స్టార్ హీరోలు లేరు. ఇద్దరు, ముగ్గురు స్టార్స్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చారు. అలాంటి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. అంటే ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది.
రెడ్‌కార్పెట్ వేస్తారనుకోకూడదు… నేను హీరోను దృష్టిలో పెట్టుకొని కథ తయారుచేయను. ఓ కథను తయారుచేసుకున్న తర్వాత దానికి ఎవరైతే సరిపోతారు అని ఆలోచించి వారిని కలుస్తాను. నేను స్టార్ హీరోలు అందరినీ కలిసి కథలు చెబుతున్నాను. ఆ సమయంలో వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారనేది కూడా ముఖ్యమే. అది గుర్తించకుండా వారు రిజెక్ట్ చేస్తున్నారనుకోవడంలో అర్థం లేదు. నేను కలవగానే నాకు రెడ్‌కార్పెట్ వేస్తారనుకోకూడదు. అది అన్ని సమయాల్లో జరుగదు. అయితే స్టార్స్‌తో సినిమా చేస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతుంది.
హీరోయిన్‌ని దద్దమ్మను చేయనక్కర్లేదు…

సినిమాల్లో ఆడవాళ్లను చులకనగా చూపించకూడదనేది సింపుల్ కమర్షియల్ ఫార్ములా. ఎందుకంటే ఆడవాళ్లను గొప్పగా చూపిస్తే ఎక్కువ మంది మహిళలు ఆ సినిమాను చూస్తారు. ఓ మహిళ తన కుటుంబాన్ని సినిమాకు తీసుకొని రాగలుగుతుంది. హీరోయిజమ్‌ను ఎలివేట్ చేయాలని… హీరోయిన్‌ని దద్దమ్మను చేయనక్కర్లేదు. మనం చేస్తున్న తప్పే అది. హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ గ్లామర్‌గా ఉంటాయి. అదే సమయంలో పవర్‌ఫుల్‌గానూ ఉంటాయి. రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ ఎంత దూకుడుగా ఉంటుంది. అలాగే ‘మహానటి’లో కీర్తిసురేశ్ పాత్ర ఎంత బావుంటుంది. ఆమె పాత్రే కాదు ఇతర పాత్రలన్నింటికీ అర్థం ఉంది. సినిమాను మనం సరిగ్గా తీయకపోతే ప్రేక్షకులకు అర్థం కాదు.
ఏడాది తర్వాతే…

ఈ సినిమా తర్వాత నెక్స్ మూవీ గురించి ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే 2016 నుండి ఈ ఏడాది వరకు మూడు సినిమాలు జెంటిల్‌మన్, అమీతుమీ, సమ్మోహనం చేశాను. ఈ సినిమాల స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటం వల్ల గ్యాప్ తీసుకోకుండా చేయగలిగాను. నెక్స్ కథ తయారుచేసుకోవాలంటే నాకు కనీసం ఏడాది సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకు ఆగాల్సిందే.