Home సినిమా భవిష్యత్‌లో దర్శకత్వం వహిస్తా

భవిష్యత్‌లో దర్శకత్వం వహిస్తా

nmn

నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొం దిన చిత్రం ‘అ!’. కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్, ముర ళీశర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. ఈ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక నిత్యా మీనన్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

కొత్తగా ఉండే పాత్రలో…
దర్శకుడు ప్రశాంత్ ఈ చిత్ర కథ చెప్పగానే సినిమా చేయాలన్న ఆసక్తి కలిగింది. ఇందులోని పాత్రలు అన్నింటినీ దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు. సినిమాలో నా పాత్ర కొత్తగా ఉండడంతో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతోంది.
విభిన్నమైన పాత్రలకే…
ఒక నటిగా అన్ని రకాల పాత్రలను చేయాలని కోరుకుంటాను. దీనివల్ల కెరీర్ ఏమైపోతుందని ఆలోచించను. విభిన్నమైన పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను. రెగ్యులర్ రోల్స్ చేయాలంటే బోర్ కొడుతుంది.
కథను నమ్మే ఒప్పుకున్నా…
హీరో నాని ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసమే అందరం నటించాము. కథ అందరికీ బాగా నచ్చింది. నేను కూడా కథను నమ్మే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
కొత్తగా అనిపించింది…
ఈ సినిమాలో నన్ను రాధ క్యారెక్టర్ లేదా కృష్ణవేణి క్యారెక్టర్ కానీ చేయమని అన్నారు. నేను కృష్ణవేణి క్యారెక్టర్ చేయడానికి సిద్ధమయ్యాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా కొత్తగా అనిపించింది.
అది వర్కవుట్ కాలేదు…
‘కాంచన’లో గంగ పాత్ర చేసేటప్పుడు నాకు కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇక ‘మహానటి’లో సావిత్రి పాత్రి చేసే అవకాశం నాకే ముందుగా వచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదు. నాకు స్క్రిప్ట్ బాగా నచ్చితే నటిగా నా వల్ల ఎంత చేయగలనో అంత చేస్తాను.
ఆలోచించి ఒప్పుకుంటా…
నేను ఏదైనా పాత్ర చేసేటప్పుడు అది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆలోచించి ఒప్పుకుంటాను. ఇక భవిష్యత్‌లో తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. కానీ ప్రొడక్షన్ చేయను.
అన్ని రకాల సినిమాలకు ఆదరణ…

టాలీవుడ్‌లో ‘అ’ సినిమా కొత్తదనానికి దారి చూపించింది. తెలుగు సినిమాల్లో విప్లవం రావాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు.
ఒకే ఒక పాత్ర…
‘ప్రాణ’ అనే సినిమాను నాలుగు భాషల్లో చేస్తున్నాం. ఇందులో ఒకే ఒక పాత్ర కనపడుతుంది. సింక్ సౌండ్‌లో సినిమా చేస్తున్నాం. కేరళలోని హిల్ స్టేషన్‌లో సినిమా నడుస్తుంది. ఈ చిత్రాన్ని 23 రోజుల్లో పూర్తిచేయడం విశేషం. నాకు నాలుగు భాషలు వచ్చు కాబట్టి స్క్రిప్ట్ వైపు కూడా సహకారం అందించాను.