Home ఆఫ్ బీట్ మా ఇల్లు ఓ రంగుల ప్రపంచం

మా ఇల్లు ఓ రంగుల ప్రపంచం

life

     ప్రకృతి సౌందర్యంతో పరవశించే  కళాకారుల అంతరంగాల్లో అనేక భావాలు దాగిఉంటాయి. వారి కళాకృతుల్లో  కళాసౌందర్యంతోపాటు సామాజిక సమస్యలు ఉంటాయి. తల్లి ఒడిలోనే  కళలను నేర్చుకుని కాన్వాసుపై  వర్ణాలు అద్దుతున్న చిత్రకారిణి స్వర్ణభార్గవి. సమాజంలోని ప్రతి అంశాన్ని కుంచెలో బంధించిన ఆర్టిసు. అనేక అంతర్జాతీయ వేదికలపై నుంచి బహుమతులను సొంతం చేసుకున్న స్వర్ణభారతిని అఖిల పలకరించింది.

చిత్రకళలో అనేక రీతులు ఉన్నాయి. అయితే సందర్భానుసారంగా ఆ పద్ధతుల్లో బొమ్మలు గీస్తుంటాం. ఇటీవల అంతర్జాతీయ నగల డిజైన్స్ పోటీల్లో బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉంది. జ్యూలరీ డిజైన్ చిత్రీకరించడం ఎంతో నైపుణ్యతతో పాటు ఏకాగ్రత అవసరం. వీటితో పాటు కార్వింగ్ డిజెన్స్, మైక్రో ఆర్ట్, పోట్స్,్ర కార్టూన్స్, భావవ్యక్తీకరణ చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాను. ఖమ్మం జిల్లా పోలంపల్లి సొంత ఊరైనా హైదరాబాద్‌లోనే స్థిరపడి చిత్రాలనే ఉపాధిగా చేసుకున్నా. అమ్మ సుగుణ నా చిన్నతనంలో మహిళా సంఘం ద్వారా డ్రాయింగ్, అల్లికలు నేర్పిస్తుండేది. దాంతో ఆసక్తి పెరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి బొమ్మలు వేయడం ఎంతో సరదాగా ఉండేది. ఆ తర్వాత డ్రాయింగ్‌లో టీచర్ ట్రైనింగ్ చేసి వరంగల్ లోని కేప్టెన్ లక్ష్మీకాంతారావు పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా చేరాను. అనంతరం ఉన్నత చదువులతో పాటు అంతర్జాతీయ చిత్రప్రదర్శనల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నాను.
కుటుంబపరంగా ప్రోత్సాహం ఉందా?
అమ్మ దగ్గర ఈ కళ నేర్చుకున్న నాకు హోమియో డాక్టర్ వాసుదేవరావుతో పెళ్లయింది. వృత్తి రీత్యా ఆయన డాక్టర్ అయినా ప్రవృత్తి ఆర్టిస్టే. ఇద్దరం కలిసి అనేక చిత్రాలను చిత్రీకరించాం. అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశాం. మా ఇంటిని ఓ రంగుల ప్రపంచంగా మార్చాం. వరకట్నం అంశంపై చిత్రీకరించిన పెయింటింగ్స్ కు ఆదరణ లభించింది. సామాజిక అంశాలపై మా రంగులు పడుతూనే ఉంటాయి.
జ్యాలరీ ఆర్ట్‌కు డిమాండ్ ఉందా?
చాలా సున్నితమైంది జ్యూలరీ ఆర్ట్. ప్రతి కోణాన్ని నైపుణ్యంతో చిత్రీకరించాలి. లండన్ కు చెందిన సంస్థ నిర్వహించిన జ్యూలరీ ఆర్ట్ పోటీల్లో నేను గెలిచాను. అలాగే జపాన్ పత్రికలకు బొమ్మలు వేశాను. అంతర్జాతీయ సంస్థలు అనేక అవార్డులతో నన్ను ప్రోత్సహించాయి. అయితే ప్రకృతికి సంబంధించిన వర్ణ చిత్రాలతోపాటు విభిన్నరీతుల పెయింటింగ్స్‌ను వేశాను. వీటితో పాటు కార్టూన్స్ వేయడమం చాలా ఇష్టం. మా ఇద్ద్దరిదీ రంగుల ప్రపంచమే. శాస్త్రీయ చిత్రాలతో పాటు విభిన్న పద్ధతుల్లో ఎన్నో బొమ్మలు వేశాం. మైసూర్ యూనివర్సిటీ నుంచి బి.ఎప్.ఏ, ఎం.ఎఫ్.ఏ పూర్తి చేశాను. మావారు ఎం.ఎఫ్.ఏ పూర్తి చేశారు.
మీ ఆర్ట్‌కు ప్రత్యేకత ఏమిటి?
నేను వేసే పెయింటింగ్స్‌లో ప్రయోగాత్మకత ఉంటుంది. ప్రతి పెయింటింగ్‌కు ఓ ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. ఈ ప్రత్యేక లైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేశాను. అలాగే ప్రత్యేక ఫాంట్‌ను రూపొందించాను. కష్టమైన పనిని ఇష్టంగా చేసినప్పుడే టాలెంట్ ఏంటో తెలుస్తుంది. నేను ప్రతి పెయింటింగ్ లో కష్టమైన డిజైన్స్ వేస్తుంటాను. నైపుణ్యతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చెక్క టీపాయ్‌పై అల్లికలు ఉన్నట్లు వేసిన పెయింటింగ్‌కు ఎంతో శ్రమించాను. ప్రతి చిన్న లైన్ ఓపికతో వేయాలి. సమయం చాలా అవసరం అవుతుంది. అయినా పట్టుదలగా నైపుణ్యతను ప్రదర్శిస్తే రూపొందే కళాకృతులు ఎంతో తృప్తిని ఇస్తాయి. చిత్రకళలో ఏకాగ్రత ఉంది. పట్టుదల ఉంది. లక్షసాధన ఉంది.
విద్యార్థులకు చిత్రకళనేర్పిస్తూ సమాజానికి నా వంతు కృషిచేస్తున్నట్లు భావిస్తాను. అందుకే మానవ నాగరికత సాధనాలలో లలితకళలకు అధిక ప్రాధాన్యత లభించిందనడంలో అతిశయోక్తిలేదు.